
ఎప్పటిలాగే స్వామివారికి పూజలు చేసేందుకు పూజారి ఆలయానికి వెళ్లాడు.. పూజా సమయం ఆసన్నం కావడంతో హడావుడిగా ఆలయ ప్రాంగణంలోకి వెళ్తుండగా లోపల నుండి ఎప్పుడు చూడని సువాసన వెదజల్లుతుంది. దీంతో అంత మంచి వాసన ఎక్కడ నుండి వస్తుందా అని పరిసర ప్రాంతంలో వెతికి చూశాడు. అలా వెదుకుతుండగా పూజారి ఎప్పుడో ఐదు ఏళ్ల క్రితం నాటిన బ్రహ్మకమలం మొక్క నుండి రెండు పుష్పాలు వికసించి కనిపించాయి. అంతే కాకుండా ఆ బ్రహ్మ కమలాల చుట్టూ ఒక పాము పెనవేసుకొని దర్శనమిచ్చింది. ఆ ఘటనను చూసిన పూజారి ఒకసారిగా ఆశ్చర్యానికి గురై అది ఒక దైవాంశగా భావించి నమస్కారం పెట్టుకొని తరువాత పామును అక్కడ నుండి వెళ్లే వరకు వేచి చూశాడు. ఆ తరువాత రెండు బ్రహ్మకమలం పూలను కోసి దేవుడికి అలంకరించాడు.
పార్వతీపురం పట్టణంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ త్రినాధ స్వామి దేవస్థానంలో జరిగిన ఈ ఘటన ఆ నోటా ఈ నోటా తిరిగి పట్టణమంతా వ్యాపించింది. దీంతో బ్రహ్మకమలంను దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పద్మనాభ మహపాత్రో స్వామికి ప్రత్యేక పూజలు చేసి భక్తులకు బ్రహ్మకమలం విశిష్టతను తెలియజేశాడు. పవిత్రమైన బ్రహ్మకమలం పుష్పం దర్శనం చేసుకుంటే మన జీవితాలు కూడా బ్రహ్మ కమలం పుష్పంలా వికసిస్తుందని చెప్పుకొచ్చారు. బ్రహ్మ, సరస్వతి చేతిలో వికసిస్తూ దర్శనమిస్తుందని, అలాంటి బ్రహ్మ కమలం ఇప్పుడు పార్వతీపురం త్రినాథ స్వామి ఆలయంలో భక్తులకు దర్శనమివ్వడం ఆనందమని తెలియజేశాడు.
Brahma Kamalam
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..