గుడివాడ, ఫిబ్రవరి 02: చిన్నపిల్లలు ఉన్న తల్లిదండ్రులు మీ బిడ్డలను గమనించుకుంటూ ఉండండి.. మీ పిల్లలు ఏం చేస్తున్నారు.. ఎక్కడికి వెళ్తున్నారు అని ఒక్కన్నేసి ఉంచితే బాగుంటుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా.. కృష్ణాజిల్లాలో జరిగిన ఈ దారుణ ఘటనను వింటే ఎవరైనా కన్నీరు పెట్టుకోవాల్సిందే. రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబం.. ఆనందంగా సాగిపోతున్న ఓ సంసారం. ముద్దు ముద్దు మాటలు పలికే ఓ బాబును ఎంతో మురిపెంగా చూసుకుంటున్న నాలుగేళ్ళ చిన్నోడు. ఆటో నడపగా వచ్చిన డబ్బుతో ఆ దంపతులు ఏ చీకు చింత లేకుండా.. ఉన్నదానిలోనే సంతోషంగా జీవనం కొనసాగిస్తున్నారు. కానీ విధి వెక్కిరించి.. జీవనోపాధి కల్పించే ఆటోని, కుటుంబాన్ని శోకసంద్రంలోకి నెట్టేసింది ఈ ఘటన. అప్పటి వరకు బుడిబుడి అడుగులతో ఇంట్లో సందడి చేసిన ఆ బాలుడు ఆటో శబ్దం విని తన తండ్రి వచ్చాడని గుర్తించి హడావిడిగా బయటకు వచ్చాడు. కానీ అక్కడే మృత్యువు ఎదురుచూస్తుందని గ్రహించలేకపోయారు. ఆ తల్లిదండ్రులు.. ఆటో పార్కింగ్ చేసి తన బిడ్డను ఎత్తుకుందామని తండ్రి భావించాడు. చేస్తుండగా ఎనక ఉన్న పిల్లవాడు ఆటో కింద పడిపోయిన ఘటన కృష్ణాజిల్లా గుడివాడలో సంచలనంగా మారింది.
కృష్ణాజిల్లా గుడివాడ మండలం మోటూరు గ్రామానికి చెందిన వరి గంజి మురళీకృష్ణ, రుచిత భార్యాభర్తలు. మురళీకృష్ణ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఈ దంపతులకు నాలుగేళ్ల కుమారుడు రిషిక్ , మూడు నెలల కుమార్తె ఉంది. గత బుధవారం ఆటో పార్క్ చేస్తున్న సమయంలో ఆటో రివర్స్‌లో వస్తున్న క్రమంలో కుమారుడు రిషిక్ ఆటో కింద పడి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అదే ఆటోలో గుడివాడలోని ప్రభుత్వ ఆసుపత్రికి హుటా హుటిన తరలించారు తల్లిదండ్రులు. రిషిక్‌ను పరిశీలించిన డాక్టర్లు బాలుడు మృతి చెందాడని నిర్ధారించారు వైద్యులు.
బాలుడి మరణ వార్త విన్న తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. గుండెలు పగిలేలా రోధించారు. దేవుడా ఇలా చేశావు ఏంటయ్యా అంటూ విలపించారు. కనీసం గాయాలతోనైనా నా కొడుకుని బతికిస్తే బాగుండే అని గుండెలు పగిలేలా ఏడ్చిన తీరు స్థానిక ప్రజలను కంటతడి పెట్టించింది. బంధువులు సైతం బాలుడి మృతదేహాన్ని చూసి తీవ్రంగా రోధించారు. దీంతో కృష్ణాజిల్లా మోటూరులో విషాదఛాయలు అలుముకున్నాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..