ఎంపీ టికెట్‎పై ఈ ముగ్గురి ఆశలు గల్లంతు.. విశాఖ లోక్ సభ నుంచి బరిలో నిలిచేది ఆయనే..

విశాఖ నుంచి పోటీకి అందరికంటే ఎక్కువ హడావుడి చేసింది బీజేపీ నేతలే. పొత్తు ఉంటుందని ముందే ఊహించినా పొత్తులో భాగంగా విశాఖ లోక్ సభ సీట్ తమకే దక్కుతుందన్న ఆశ బీజేపీ నేతల్లో కనిపించింది. దానికి తోడు 2014లో విశాఖ లోక్ సభ నుంచి బీజేపీ అభ్యర్ధిగా బరిలోకి దిగిన కంభంపాటి హరిబాబు గెలిచిన నేపథ్యం ఉండడంతో టికెట్ వస్తే గెలుపు ఖాయం అన్న రీతిలో నాయకులు ఆశలు పెంచుకున్నారు.

ఎంపీ టికెట్‎పై ఈ ముగ్గురి ఆశలు గల్లంతు.. విశాఖ లోక్ సభ నుంచి బరిలో నిలిచేది ఆయనే..
Vishakapatnam Mp Seat

Edited By: Srikar T

Updated on: Mar 23, 2024 | 1:33 PM

విశాఖ నుంచి పోటీకి అందరికంటే ఎక్కువ హడావుడి చేసింది బీజేపీ నేతలే. పొత్తు ఉంటుందని ముందే ఊహించినా పొత్తులో భాగంగా విశాఖ లోక్ సభ సీట్ తమకే దక్కుతుందన్న ఆశ బీజేపీ నేతల్లో కనిపించింది. దానికి తోడు 2014లో విశాఖ లోక్ సభ నుంచి బీజేపీ అభ్యర్ధిగా బరిలోకి దిగిన కంభంపాటి హరిబాబు గెలిచిన నేపథ్యం ఉండడంతో టికెట్ వస్తే గెలుపు ఖాయం అన్న రీతిలో నాయకులు ఆశలు పెంచుకున్నారు. ముఖ్యంగా పురంధరేశ్వరి విశాఖ నుంచి పోటీ చేసే అవకాశం ఉందంటూ పెద్ద ఎత్తున స్పెక్యులేషన్స్ వినిపించాయి. ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్న పురంధరేశ్వరి 2009 లో కాంగ్రెస్ పార్టీ విశాఖ ఎంపి గా విజయం సాధించారు. అంతేకాక అందరితో సంబంధాలు మంచిగా ఉండడంతో పాటు, 2019 లో కూడా బీజేపీ విశాఖ లోక్ సభ అభ్యర్ధిగా పోటీ చేసిన అనుభవాలు ఆమె పోటీ ఇక్కడే అన్నట్టు ప్రచారం జరిగింది. సీఎం రమేష్ కూడా విశాఖ నుంచి పోటీ చేసేందుకు ఎక్కువ ఆసక్తి చూపారు. విశాఖలో నార్త్ ఇండియా ఓట్లు ఎక్కువ ఉండడంతో పాటు సీఎం రమేష్‎కు చెందిన వెలమ సామాజిక వర్గ ప్రాబల్యం ఎక్కువ. ఈ రెండు అంశాలు తనకు కలిసి వస్తుందని ఊహించారు సీఎం రమేష్. దానికి తోడు ఆర్థికంగా బలమైన నేత కావడంతో పార్టీ టికెట్ ఇచ్చే ఛాన్స్ ఉంటుందని అందరూ అనుకున్నారు.

మూడేళ్లుగా విశాఖలోనే జీవీఎల్ నరసింహారావు..

ఇక వచ్చే ఏప్రిల్‎లో రాజ్యసభ పదవీ కాలాన్ని పూర్తిచేసుకోనున్న జీవీఎల్.. ఈలోపు విశాఖ నుంచి లోక్ సభకు ఎన్నికవ్వాలని చాలా ప్రణాళికలు సిద్దం చేసుకున్నారు. ఇందులో భాగంగానే మూడేళ్ల క్రితమే విశాఖ చేరిపోయారు. సొంత ఇల్లు, ప్రత్యేకమైన క్యాంప్ ఆఫీస్‎ను తీసుకుని పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాలను చుట్టేశారు జివీఎల్. అలాగే ఈ ప్రాంతంలో దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న అనేక సమస్యలను పార్లమెంట్ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా తూర్పు కాపులను ఓబీసీలో చేర్చడం, సిస్టకరణాలు, ఆర్యవైశ్య లాంటి సామాజిక వర్గాలను ఓబీసీ స్టేటస్ ఇప్పించే ప్రయత్నం చేయడం ఇలా అనేక ప్రయత్నాలను దిగ్విజయంగా పూర్తి చేశారు. అంతటితో ఆగకుండా దీర్ఘకాలికంగా సమస్యలు ఉన్న ప్రదేశానికి తానే వెళ్లి ఆ సమస్య గురించి ప్రస్తావించి దాన్ని పార్లమెంటు దృష్టికి తీసుకెళ్లి కదలిక తెప్పించడంతో విశాఖపట్నంలో జివిఎల్ రాజకీయ ఆలోచనలపై విస్తృత చర్చ జరిగింది. జీవీఎల్ కూడా పురంధేశ్వరి, సీఎం రమేష్ లకు గట్టి పోటీ ఇస్తారన్న ప్రచారం కూడా జరిగింది. అనేక మంది కేంద్ర మంత్రులని విశాఖ తీసుకురావడం, వాళ్లతో పలు కార్యక్రమాలను ప్రారంభింపచేయడం లాంటి ప్రోగ్రామ్స్‎ని తరచు జీవీఎల్ చేస్తుండటంతో బలమైన పోటీదారుడుగా నిలబడ్డారు.

విశాఖను బీజేపీకి ఇచ్చేందుకు నిరాకరించిన టీడీపీ..

అయితే ఒకవైపు బీజేపీ నేతల ప్రయత్నాలను కాదని విశాఖని బిజెపికి ఇచ్చేందుకు తెలుగుదేశం పార్టీ నిరాకరించింది. 2019 ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా పోటీ చేసిన భరత్ కేవలం 4000 ఓట్ల తేడాతో ఓడిపోయారని, విశాఖ చాలా కీలకమైన నగరం కాబట్టి అది మాకే కావాలంటూ టిడిపి బిజెపికి స్పష్టం చేసింది. దాంతో బిజెపి అధినాయకత్వం కూడా ఏం అనలేకపోయింది. ఈ నేపథ్యంలో తాజాగా శ్రీభరత్ పేరును ప్రకటించింది టిడిపి. దీంతో విశాఖ లోక్‌సభ స్థానం నుంచి గీతం విద్యా సంస్థల చైర్మన్‌ ఎం.శ్రీభరత్‌ పోటీకి సిద్ధమయ్యారు. ఈ మేరకు టీడీపీ శుక్రవారం లిస్ట్ విడుదల చేసింది. దీంతో విశాఖ పార్లమెంటు స్థానం నుంచి శ్రీభరత్‌ రెండోసారి బరిలోకి దిగబోతున్నారు. టీడీపీ సీనియర్‌ నేత ఎంవీవీఎస్‌ మూర్తి మరణాంతరం ఆయన వారసునిగా మూర్తి పెద్ద కుమారుడు రామారావు తనయుడు శ్రీభరత్‌ 2019 ఎన్నికల్లో విశాఖ నుంచి పోటీ చేసి కేవలం 4 వేల ఓట్ల తేడాతో ఓటమి చెందారు. ఎన్నికల తర్వాత కూడా పార్లమెంటరీ నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జిగా ఉంటూ పార్టీ శ్రేణులకు అందుబాటులో ఉంటున్నారు. దీంతో శ్రీభరత్‌ను ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడంతో పార్టీ శ్రేణులు హర్షాన్ని వ్యక్తం చేశాయి. 2024 లో విశాఖ లోక్ సభ నుంచి భారీ మెజారిటీతో విజయం సాధించడం ఖాయమని టీడీపీ నాయకులు ధీమా వ్యక్తంచేస్తున్న పరిస్థితి ఇప్పుడు కనిపిస్తోంది. అయితే పోలింగ్ నాటికి పరిణామాలు ఎలా మారుతాయో వేచి చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ కిక్ చేయండి..