జనసేన ఆవిర్బావ సభలో పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ పొత్తులు, రాజకీయ బంధాలపై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. బీజేపీతో ఉన్న బంధం అవమానాల మధ్య సాఫీగా సాగడం లేదన్న జనసేన .. మరోసారి కొత్త స్నేహానికి సిద్ధమవుతోంది. ఇదంతా ముందే ఊహించామని వైసీపీ అంటే… టీడీపీతో పొత్తు పెట్టుకుంటామని బహిరంగసభలో పవన్ కల్యాణ్ ఎక్కడైనా చెప్పారా అని ప్రశ్నిస్తోంది భారతీయ జనతా పార్టీ.
ఏపీలో పాత స్నేహాలకు బీటలు వారుతున్నాయా? కొత్త బంధాలకు ద్వారాలు తెరుచుకుంటున్నాయా? అనే విషయం ప్రస్తుతం రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. బీజేపీతో పేరుకే పొత్తు కానీ ప్రత్యామ్నాయంగా ఎదగడానికి ఎలాంటి సహకారం లేదంటూ బాంబ్ పేల్చిన పవన్ కల్యాణ్.. తెలంగాణ బీజేపీ నేతలు కూడా తనను అవమానించారన్నారు. జాతీయ నాయకత్వం తనతో కలిసి రావడానికి సిద్ధంగా ఉన్నా.. రాష్ట్ర నాయకత్వమే ముందుకు తీసుకెళ్లడం లేదన్న పవన్ వ్యాఖ్యలు.. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో సరికొత్త చర్చకు తెరతీశాయి. అదే సమయంలో ఓటు వేస్ట్ కానివ్వనన్న పవన్.. సొంతంగా గెలుస్తామనుకుంటేనే ఒంటరిగా బరిలోకి దిగుతామని చెప్పేశారు పవన్.
ఆవిర్బావ సభలో జెండా మాత్రమే జనసేనది అయితే.. అజెండా మొత్తం టీడీపీదే అంటున్నారు వైసీపీ నాయకులు. సింగిల్‌గా వచ్చే ధైర్యం లేక మొత్తం జనసేనను టీడీపీకి అమ్మకానికి పెట్టారంటోంది అధికారపార్టీ.
ఏపిలో రెండు కుటుంబ పార్టీలకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఎదగాలన్నది తమ పార్టీ విధానమని.. జనసేన వ్యూహం మార్చుకుంటే అప్పుడు చూస్తామంటోంది బీజేపీ. పొత్తులపై సోము వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఎన్నికల సమీపిస్తున్న కొద్దీ ఏపీలో రాజకీయసమీకరణాలు మారిపోతున్నాయి.. కొత్త స్నేహాలు తెరమీదకు వస్తాయా? ఇంతకీ ప్రత్యర్థుల పొత్తులపై అధికార వైసీపీ ఏమి కోరుకుంటోంది? జనసేన నిర్ణయాలు ఉండబోతున్నాయన్నది ఆసక్తిగా మారింది.
మరిన్ని ఏపీ వార్తల కోసం..