Vizag: తీరంలో ఆవరించిన మత్తు తుఫాన్.. భుజాలు తడుముకుంటున్నదెవరు?
హాలీవుడ్ భారీ యాక్షన్ సినిమాను తలదన్నేలా విశాఖ పోర్టులో డ్రగ్స్ దందా బయటపడింది. బ్రెజిల్ నుంచి వచ్చిన ఈ మత్తు పదార్ధాలపై ఇప్పుడు రాజకీయ దందా ఇంకా వేగంగా నడుస్తోంది. ప్రధాన పార్టీలన్నీ దీనిపై భుజాలు తడుముకుంటున్నాయి. పరస్పర విమర్శలతో వీదికెక్కుతున్నాయి. అసలే ఎన్నికల సీజన్ కూడా కావడంతో అతిపెద్ద అజెండాగా మారి పంచాయితీ ఎన్నికల సంఘం వద్దకు చేరింది.

ఆపరేషన్ గరుడలో భాగంగా విశాఖపట్నంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు భారీగా డ్రగ్స్‌ను సీజ్ చేశాయి. రొయ్యల పరిశ్రమలో వాడే డ్రైడ్ ఈస్ట్ పేరుతో 25వేల కేజీల డ్రగ్స్ ప్యాకెట్లను బ్రెజిల్ నుంచి తరలించింది మాఫియా. ఇంటర్‌పోల్ సమాచారంతో రంగంలో దిగిన అధికారులు పోర్టులో పరీక్షలు చేసి నిషేధిత మత్తు పదార్ధాలున్నట్టు నిర్దారించారు.
మాఫియా వెనక ఎవరున్నారనే కోణంలో విచారణ జరుగుతుండగానే ఏపీలో రాజకీయపార్టీలు రంగంలో దిగాయి. ఇందులో మీ పాత్ర ఉందంటే మీ పాత్ర ఉందని విమర్శలకు దిగాయి. ఇందులో అధికారపార్టీ పాత్ర ఉందని.. సమగ్ర విచారణ జరిపించాలంటూ టీడీపీ నాయకులు రంగంలో దిగారు. గంజాయి చాలదన్నట్టు ఇప్పుడు విదేశాల నుంచి డ్రగ్స్‌ను కూడా దింపుతున్నారని ఆరోపించారు. డ్రగ్స్ అమ్మడం ద్వారా వచ్చే డబ్బును ఎన్నికల్లో ఖర్చుచేయాలని వైసీపీ ప్రయత్నిస్తుందని సంచలన ఆరోపణలు చేశారు టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్యచౌదరి. .. మరోవైపు కన్‌సైన్‌మెంట్ వచ్చిన కంపెనీ సంధ్య ఆక్వాలో వాటాదారులు చంద్రబాబు, పురంధేశ్వరి కుటుంబసభ్యులేనంటోంది వైసీపీ.
సంధ్య ఆక్వా కంపెనీకి పురంధేశ్వరి కుటుంబసభ్యులకు ఎలాంటి సంబంధం లేదంటోంది బీజేపీ. సంధ్యా మెరైన్స్‌లో 30 ఏళ్ల క్రితం వాటాదారుడిగా ఉన్న కూనం వీరభద్రరావును 2005లోనే బయటకు పంపేశారన్నారు. నిందితులకు వైసీపీ నేతలతో దగ్గర సంబంధాలున్నాయంటోంది బీజేపీ. మరోవైపు ఆధారాలు లేకుండా తమ పార్టీపై ఆరోపణలు చేసిన టీడీపీ నేతలపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది వైసీపీ.
మొత్తానికి విశాఖలో ఆవరించిన డ్రగ్ తుఫాన్ ప్రస్తుతం రాజకీయపార్టీలకు బలంగా తాకింది. మరి ఇది పెనుతుఫానుగా మారి ఎవరికి కబళిస్తుందో? లేక టీ కప్పులో తుఫాను మాదిరిగా చల్లారుతుందో చూడాలి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..