Andhra Pradesh: వరద నీటిలో ప్రాణాలు తీసే బ్యాక్టీరియా.. అప్రమత్తంగా ఉండాలంటున్న వైద్యులు..
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నారాయణ ఇంటిలోకి నీరు చేరింది. ఇందులో డ్రెనేజీ వాటర్ కూడా కలిసింది. ఎప్పటిలాగే నారాయణ అదే ఇంట్లో నీటిలో కాలవ వెళ్లదీస్తున్నాడు. కుటుంబ సభ్యులంతా అంతా బాగానే ఉందనుకున్నారు.
అది గుంటూరు నగరంలోని నెహ్రూనగర్ ఆరో వీధిలో ఉండే నారాయణ ఇల్లు.. నారాయణ వయస్సు 81 ఏళ్లు. ఎన్నో ఇల్లుగా నారాయణ ఈ ఇంటిలోనే ఉంటున్నాడు. నారాయణకు ఒక కూతురు, ఇద్దరు కొడుకులున్నారు. వారందరికీ వివాహాలు చేసి పంపించాడు. సోడా బండి నడుపుకుని జీవించే నారాయణ గత కొంతకాలంగా సోడా బండి వేయడం కూడా నిలిపేశాడు. అయితే ఎప్పటి ఇల్లో కావడంతో చుట్టు పక్కల ప్రాంతం అంతా మెరకలో ఉండటంతో నారాయణ ఇంటిలోకి వర్షపు నీరు వచ్చి చేరుతుండేది. అంతేకాకుండా వర్షం పడిన సమయంలో డ్రెయిన్ వాటర్ కూడా ఇంటిలోకి వచ్చేది.
అలా వచ్చిన నీరు చాలా రోజుల పాటు ఉండిపోయేది. అయితే నారాయణ మాత్రం ఎత్తు మంచం వేసుకొని బల్లపై ఇతర వస్తువులు ఉంచుకుని కొద్దీ రోజుల పాటు ఆ నీటిలోనే నివాసం ఉన్నాడు. కొడుకులు, కూతురికి వివాహాలు కావడంతో వారు వేరు వేరు చోట్ల జీవనం సాగిస్తున్నారు. తండ్రి మాత్రం అక్కడే ఉన్నా వారంతా వచ్చి చూసి పోయేవారు.
అయితే ఈ నెలలో కురిసిన భారీ వర్షాలకు నారాయణ ఇంటిలోకి నీరు చేరింది. ఇందులో డ్రెనేజీ వాటర్ కూడా కలిసింది. ఎప్పటిలాగే నారాయణ అదే ఇంట్లో నీటిలో కాలవ వెళ్లదీస్తున్నాడు. కుటుంబ సభ్యులంతా అంతా బాగానే ఉందనుకున్నారు. నాలుగు రోజుల తర్వాత నారాయణ కాలు దురదగా అనిపించడంతో స్థానికంగా ఉన్న ఆర్‌ఎంపీ డాక్టర్ వద్దకు తీసుకెళ్లారు. అతను ఇచ్చిన మందులు వాడుతుండగానే సెప్టెంబర్ 20వ తేదీన నారాయణ కాలుపై పుండులా వచ్చింది. వెంటనే కుటుంబ సభ్యులు నారాయణను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాలును పరిశీలించిన వైద్యులు అన్ని రకాల పరీక్షలు చేసి ఇన్ఫెక్షన్ వచ్చిందని కాలు తీసేయాలని సూచించారు.
దీంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులను నారాయణను ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ వైద్యులు మొదట కొంత కండ తీసివేసి తగ్గుతుందేమో చూద్దామన్నారు. అప్పటికీ తగ్గకుండా ఉంటే కాలు తీసేయాలని చెప్పారు. అందుకు కుటుంబ సభ్యులకు అంగీకరించడంతో కండ తీసేసే ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేసిన కొద్దీ రోజులకే నారాయణ చనిపోయాడు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. కేవలం వరద, మురుగు కలిసి నీటిలో ఉండటంతోనే ఇన్ఫెక్షన్ వచ్చి తమ తండ్రి చనిపోయాడని ఇటువంటి ఘటన ఎవరికి ఎదురు కాకుండా చూడాల్సిన అవసరం ఉందని కుటుంబసభ్యులు చెబుతున్నారు.
ఈ మధ్య కాలంలో ఇదే విధంగా విజయవాడలో వరద నీటిలో ఉన్న బాలుడికి ఇన్షెక్షన్ సోకడంతో వైద్యులు కాలు తొలగించారు. మురుగు, వరద కలిసి నీటిలో ఎక్కువ సేపు ఉండటంతోనే ఇటువంటి ఇన్షెక్షన్లు సోకుతున్నాయని, వర్షం పడిన సమయంలో నగరాల్లో ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని వైద్యులు సూచిస్తున్నారు. మున్సిపల్ కార్పోరేషన్ సిబ్బంది కూడా అప్రమత్తంగా ఉండి ఎవరైనా అటువంటి పరిస్థితుల్లో ఉంటే వారికి అవగాహన కల్పించి బయటకు తీసుకురావాలని పలువురు సలహా ఇస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..