AP Assembly: ‘దేనికైనా రెడీ’.. మీ నాయకుడిని రమ్మనండి.. సీఏం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు సెప్టెంబర్ 15వ తేదీ గురువారం నుంచి ప్రారంభమయ్యాయి. సమావేశాల్లో భాగంగా ప్రశ్నోత్తరాలు పూర్తయిన తర్వాత సీఏం జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన..
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు సెప్టెంబర్ 15వ తేదీ గురువారం నుంచి ప్రారంభమయ్యాయి. సమావేశాల్లో భాగంగా ప్రశ్నోత్తరాలు పూర్తయిన తర్వాత శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ (BAC) సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీతో పాటు.. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేపుతున్నాయి. ఈసమావేశానికి తెలుగుదేశం పార్టీ తరపున అచ్చెన్నాయుడు హాజరయ్యారు. ప్రజా సభస్యలను చర్చించాల్సిన సభలో అనవసరంగా గందరగోళం సృష్టించడం ఏంటని అచ్చెన్నాయుడు తో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. ప్రతిపక్ష టీడీపీ ఏం అంశాన్ని లేవనెత్తినా సభలో చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని.. మీ నాయకుడిని సభకు రమ్మనండి దేనికైనా రెడీ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు జగన్. ప్రజా సమస్యలపై చర్చించడానికి తాము ఎప్పుడూ సిద్ధమేనని సీఏం స్పష్టం చేశారు. మీరు ఒకటి అంటే మా వాళ్ళు పది మాటలు అనగలరని ఈసందర్భంగా జగన్ వ్యాఖ్యానించారు. సభ సజావుగా జరిగేలా ప్రతిపక్ష సభ్యులు సహకరించాలి, సభకు వచ్చి గౌరవంగా ఉండాలని సీఏం జగన్మోహన్ రెడ్డి టీడీపీ సభ్యులకు సూచించారు. ప్రతిపక్ష సభ్యులు ఉన్నది 17మంది మాత్రమే అని.. తాము 150 మంది ఉన్నామని ఈసందర్భంగా సీఏం గుర్తు చేశారు. మీరు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే తమ సభ్యులు కూడా అదే చేస్తారని చెప్పారు. మీ నాయకుడిని సభకు రమన్నండి…. మాట్లాడదాం అని సీఏం జగన్ సూచించారు.
ఇదే సందర్భంలో బీఏసీలో అధికార, ప్రతిపక్ష నాయకుల కుటుంబ సభ్యుల మీద వ్యక్తిగత ఆరోపణలపై కూడా చర్చ జరిగింది. ముఖ్యమంత్రిని జగన్ అంటూ మర్యాద లేకుండా సంభోదిస్తున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి ప్రస్తావించగా.. ఈవివాదం ప్రారంభమైందే వల్లభనేని వంశీ వల్ల అంటూ అచ్చెన్నాయుడు కౌంటర్ ఇచ్చారు. టీడీపీ నాయకులు కూడా ఇష్టానుసారం మాట్లాడుతున్నారని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. మొత్తంమీద బీఏసీ సమావేశంలో సీఏం జగన్ టీడీపీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. కాగా అసెంబ్లీ సమావేశాలు ఐదు రోజులపాటు నిర్వహించాలని బీఏసీ సమావేశంలో నిర్ణయించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి..