AP: సంతానోత్పత్తి కోసం 20 వేల కిలోమీటర్లు ప్రయాణం.. ఆలివ్ రిడ్లేల గురించి అరుదైన విషయాలు
ఆలివ్‌రిడ్లేలుగా పిలిచే సముద్ర తాబేళ్లకు పర్యావరణ నేస్తాలుగా పేరుంది... ప్రతి ఏటా జనవరి నుంచి మార్చి కాలంలో సముద్రం నుంచి ఒడ్డుకు చేరి తీరంలోని ఇసుక గుంతలను ఆవాసాలుగా ఏర్పరుచుకొని గుడ్లు పెట్టి తిరిగి సముద్రంలోకి తిరుగు ప్రయాణమతాయి.
అరుదైన ఉభయచర జీవుల్లో ఆలివ్ రిడ్లే తాబేళ్లకు ఎన్నో ప్రత్యేకతలున్నాయి. వీటికి స్థిర నివాసం అంటూ ఏదీ ఉండదు. ఈ తాబేళ్లు ఆహారాన్వేషణ, గుడ్లు పెట్టడం, సంతానోత్పత్తి కోసం దాదాపు 20 వేల కిలోమీటర్లు ప్రయాణిస్తాయి. జపాన్, ఆస్టేలియా, న్యూజిలాండ్ తదితర దేశాల నుంచి లక్షలాదిగా ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల తీరాలకు సముద్ర మార్గంలో వలస వస్తుంటాయి. సముద్రంలో వ్యర్ధాలను తింటూ పర్యావరణానికి ఎంతో మేలు చేస్తున్న ఆలివ్ రిడ్లే తాబేళ్ళ సంరక్షణ కోసం అటవీ వన్యప్రాణి విభాగం సిబ్బంది ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.
వేల కిలోమీటర్ల ప్రయాణం.. ఆలివ్ రిడ్లే తాబేళ్ల ప్రత్యేకత…
వలసజీవుల్లో అలసట ఎరుగని జీవులు ఇవి. అలుపెరుగని ప్రయాణం వాటి జీవన శైలి. సైబీరియా పక్షుల్లా కేవలం సంతానోత్పత్తి కోసమే వేల కిలోమీటర్లు ప్రయాణించి పుట్టింటికి వచ్చినట్టుగా తూర్పు తీరానికి చేరుకుంటాయి. అరుదైన ఉభయచర జీవుల్లో అనేక జాతుల తాబేళ్లున్నప్పటికీ ఆలివ్ రిడ్లే తాబేళ్లకు ఎన్నో ప్రత్యేకతలున్నాయి. వీటికి స్థిర నివాసం అంటూ ఏదీ ఉండదు. రెండడుగుల పొడవు, సుమారు 500 కేజీల బరువు ఉండే ఈ తాబేళ్లు ఆహారాన్వేషణ, గుడ్లు పెట్టడం, సంతానోత్పత్తి కోసం దాదాపు 20 వేల కిలోమీటర్లు ప్రయాణిస్తాయి. వీటిల్లో 7 జాతులుండగా 5 జాతుల తాబేళ్లు జపాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తదితర దేశాల నుంచి లక్షలాదిగా ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల తీరాలకు సముద్ర మార్గంలో వలస వస్తుంటాయి. నదులు… సముద్రంలో కలిసే చోటు వీటి సంతానోత్పత్తికి అనువుగా ఉంటుంది. అందుకే కాకినాడ సమీపంలోని ఉప్పాడ, హోప్ ఐలాండ్, కోరంగి అభయారణ్య తీర ప్రాంతానికి, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు సముద్ర తీర ప్రాంతాలకు ఈ తాబేళ్లు ఎక్కువగా వస్తుంటాయి. జీవనం అంతా సముద్రంలోనే అయినప్పటికీ కేవలం గుడ్లు పెట్టడానికి భూమి మీదకు వచ్చేవి ఆలివ్ రిడ్లే తాబేళ్లు మాత్రమే. వేల కిలోమీటర్లు వలస వచ్చి గుడ్లు పెట్టిన చోటనే తయారైన పిల్లలు.. తిరిగి పదేళ్ల తరువాత సంతానోత్పత్తి సమయంలో తిరిగి అదే చోటుకు వచ్చి గుడ్లు పెడతాయి. ఈ విధంగా పుట్టిన చోటుకే వచ్చి, మళ్లీ అక్కడే గుడ్లు పెట్టేది ఒక్క సముద్ర తాబేలు మాత్రమే.
పర్యావరణ నేస్తాలు…
పెరుగుతున్న కాలుష్యానికి సముద్ర జలాలు కూడా కలుషితమవుతున్నాయి… అటువంటు సముద్ర జలాలను కాలుష్యం కోరల నుంచి బయట పడేసేవే ఉభయచర జీవులు తాబేళ్లు… వీటిలో ప్రధానమైనవి ఆలివ్ రెడ్లే తాబేళ్లుగా చెబుతారు… సముద్రంలోని పాచి, మొక్కలు, వివిధ రకాల వ్యర్థ పదార్థాలను తింటూ జలాలు కలుషితం కాకుండా చేయడంలో ప్రధాన పాత్ర పోషించేవి ఆలివ్‌రిడ్లేలుగా పిలిచే సముద్ర తాబేళ్ళు . కానీ ఈ తాబేళ్లు జాతి మనుగడ ప్రస్తుతం ప్రశ్నార్ధకంగా మారింది.
ఆలివ్‌రిడ్లేలుగా పిలిచే సముద్ర తాబేళ్లకు పర్యావరణ నేస్తాలుగా పేరుంది… ప్రతి ఏటా జనవరి నుంచి మార్చి కాలంలో సముద్రం నుంచి ఒడ్డుకు చేరి తీరంలోని ఇసుక గుంతలను ఆవాసాలుగా ఏర్పరుచుకొని గుడ్లు పెట్టి తిరిగి సముద్రంలోకి తిరుగు ప్రయాణమతాయి. అయితే ఈ క్రమంలో తాబేళ్లు పెట్టిన గుడ్లను పక్షులు, ఇతర జంతువులు తినేస్తుంటాయి… దీంతో అంతరించే దశకు చేరుకున్న ఈ జాతిని సంరక్షించేందుకు అటవీశాఖ వన్యప్రాణి విభాగం అధికారులు ప్రకాశం, బాపట్ల జిల్లాల తీర ప్రాంతాల్లో తాబేళ్ల సంరక్షణకు శ్రీకారం చుట్టారు… తీరం వెంబడి తాబేళ్ల సంతతి, పునరుత్పత్తి కేంద్రాలతో పాటుగా ప్రత్యేకంగా వలంటీర్లను నియమించి రక్షణ కల్పిస్తున్నారు… వలంటీర్లు తాబేళ్లు పెట్టిన గుడ్లను సేకరించి అవి పిల్లలుగా అయ్యేంత వరకు సంరక్షించి తిరిగి సముద్రంలోకి వదులుతున్నారు. ఆరేళ్లుగా ఈ ప్రక్రియ ఓ మహాయజ్ఞంలా కొనసాగుతుంది .
బాపట్ల, ప్రకాశం, నెల్లూరుజిల్లా తీర ప్రాంతాలు పునరుత్పత్తికి కేంద్రాలు…
బాపట్ల – ప్రకాశం – నెల్లూరు జిలాల్లో సముద్రపు ఆలివ్‌రిడ్లే తాబేళ్ళ సంరక్షణకు అటవీశాఖ వన్యప్రాణి విభాగం అధికారులు చేపడుతున్న చర్యలు సత్పలితాలిస్తున్నాయి… చీరాల మండలం విజయలక్ష్మీపురం నుంచి గుడ్లూరు మండల పరిధిలోని మొండి వాగు వరకు 102 కిలో మీటర్ల సముద్ర తీరం వెంట సముద్రపు తాబేళ్ళ సంరక్షణకు అటవీశాఖ వన్యప్రాణి విభాగం అధికారులు చర్యలు చేపట్టారు. బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల వ్యాప్తంగా సముద్ర తీర గ్రామాలలో 12 సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేశారు… వీటి సంరక్షణకు 24 మంది వలంటీర్లను నియమించారు .సముద్రపు తాబేళ్ళు జాతి అంతరించిపోకుండా చూడటం ,పక్షులు ,ఇతరత్రా జంతువుల బారిన పడకుండా రక్షించడమే ఈ సంరక్షణ కేంద్రాల ముఖ్య ఉద్దేశం . కాగా వాలంటీర్లు సముద్రపు తీరంలో సేకరించిన తాబేళ్ళ గుడ్లను పొదిగించి వాటి పిల్లలను తిరిగి సముద్రంలో విడిచి పెట్టె ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రియల్ నెలల్లో సముద్రంలోని ఆడ తాబేళ్లు తీరానికి చేరుకుని గుడ్లు పెడుతుంటాయి . వాటిని పక్షులు , ఇతర జంతువులు ధ్వంసం చేయకుండా అటవీశాఖ సిబ్బంది చర్యలు తీసుకుంటున్నారు. తాబేళ్ల పునరుత్పత్తికి ఏ ప్రాంతం అనుకూలమో ముందుగా గుర్తిస్తారు. ఆ ప్రాంతంలో సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసి అందులో రెండు నుంచి మూడు అడుగుల సైజు గుంతలు తవ్వి గుడ్లు ఉంచుతారు. గుంతల్లో ఉంచిన గుడ్లనుంచి పిల్లలు బయటకు వచ్చేందుకు 45 నుంచి 60 రోజుల సమయం పడుతుంది. డిసెంబర్ నుంచి జూన్ వరకు ఉత్పత్తికేంద్రాల ద్వారా తాబేళ్లను అభివృద్ధి చేస్తారు. ఈ ప్రక్రియకు ట్రీ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ సహకరిస్తోంది. ఇక సముద్ర తీర ప్రాంతంలోని వేటపాలెం మండలంలో మూడు , చిన్నగంజాం మండలంలో రెండు , కొత్తపట్నంలో రెండు , నాగులుప్పలపాడు , ఒంగోలు , ఉలవపాడు , గుడ్లూరు మండలాల్లో ఒక్కో సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు . ఇందులో వేటపాలెం మండలం రామచంద్ర పురం తీరంలో తొమ్మిది తల్లి తాబేళ్ళు పెట్టిన సుమారు 1075 గుడ్లు ,రామాపురం తీరంలో మూడు తల్లి తాబేళ్ళు పెట్టిన 351 గుడ్లు , పొట్టిసుబ్బయిపాలెం 105 గుడ్లు ఇప్పటివరకు సేకరించారు… ఇలా తీర ప్రాంతంలో ఈ ఏడాది జనవరి వరకు తల్లి తాబేళ్ళు తీరానికి వచ్చి 19 వేల 800 గుడ్లు పెట్టి వెళ్లాయి . వీటన్నింటిని వలంటీర్లు సేకరించిన 12 సంరక్షణ కేంద్రాలలో ఉంచారు.ఈ క్రమంలో గుడ్ల నుంచి బయటకు వచ్చిన సుమారు 12, 000 ఫై చిలుకు తాబేళ్లను సముద్రంలోకి సురక్షితంగా వదిలారు. ఈ ప్రక్రియ మే నెల చివరి వరకు కొనసాగుతుంది. గత సంవత్సరంలో సైతం 90 తాబేళ్ళు పెట్టిన 10,323 సేకరించి వాటి పిల్లలను సముద్రంలోకి వదిలారు. ఇలా అంతరించి పోతున్న సముద్రపు తాబేళ్ళ పునరుత్పత్తికి కోస్తా తీర ప్రాంతం స్వర్గధామంగా మారింది.
ఫైరోజ్, టీవీ9 తెలుగు, ఒంగోలు
Also Read: Andhra Pradesh: మానవత్వం పరిమళించిన వేళ.. యాచకురాలికి పురుడు పోసిన స్థానిక మహిళలు