AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chittoor Politics: పార్టీ కోసం ఏకమైన మాజీలు.. చిత్తూరులో చిత్రమైన రాజకీయం

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. చిత్తూరు జిల్లా రాజకీయం ఆసక్తిగా మారింది. మారిన సమీకరణాలు, ఒకనాటి ప్రత్యర్థులందరినీ ఒక్కచోటికి చేర్చింది. ఒక అభ్యర్థి విజయం కోసం పాత ప్రత్యర్థులంతా చేతులు కలిపేలా చేసింది. కలిసి పనిచేసేందుకు కారణం అయింది. వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కలిసి కట్టుగా దూసుకుపోతున్నారు.

Chittoor Politics: పార్టీ కోసం ఏకమైన మాజీలు.. చిత్తూరులో చిత్రమైన రాజకీయం
Chittoor Tdp Leaders
Raju M P R
| Edited By: |

Updated on: Mar 14, 2024 | 5:21 PM

Share

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. చిత్తూరు జిల్లా రాజకీయం ఆసక్తిగా మారింది. మారిన సమీకరణాలు, ఒకనాటి ప్రత్యర్థులందరినీ ఒక్కచోటికి చేర్చింది. ఒక అభ్యర్థి విజయం కోసం పాత ప్రత్యర్థులంతా చేతులు కలిపేలా చేసింది. కలిసి పనిచేసేందుకు కారణం అయింది. వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కలిసి కట్టుగా దూసుకుపోతున్నారు.

సిట్టింగ్‌ స్థానంలో అధికార పార్టీ నుంచి మరో అభ్యర్థి. విపక్షం నుంచి కూడా తెరపైకి కొత్త అభ్యర్థి. అలకలు, అసంతృప్తులు ఉంటాయనుకున్నచోట కొత్త రాజకీయం కనిపిస్తోంది. అధికార పార్టీ అభ్యర్థిని ఓడించేందుకు ప్రత్యర్థులని ఏకం చేసింది చిత్తూరు రాజకీయం. వైసీపీ అభ్యర్థి విజయానంద్ రెడ్డికి బలమైన ప్రత్యర్థిగా గురుజాల జగన్మోహన్‌ని టీడీపీ బరిలోకి దించింది. చిత్తూరు పాలిటిక్స్‌లోకి జగన్మోహన్ అనూహ్యంగా ఎంట్రీ ఇవ్వగా టికెట్‌ ఆశించిన ఆశావహులు, ఆయన కోసం చేతులు కలపడాన్ని సొంతపార్టీ తమ్ముళ్లే నమ్మలేకపోతున్నారు. నిజమేనా అని గిల్లి చూసుకుంటున్నారట.

సిట్టింగ్‌ ఎమ్మెల్యేతో పాటు నలుగురు మాజీ ఎమ్మెల్యేలు, రాజ్యసభ మాజీ సభ్యురాలు టీడీపీ అభ్యర్థి కోసం చేతులు కలిసి పనిచేస్తుండటం చిత్తూరులో చర్చనీయాంశమైంది. నాలుగు సార్లు చిత్తూరు ఎమ్మెల్యేగా గెలిచి తనదైన ముద్రవేసిన మాజీ ఎమ్మెల్యే సీకే బాబుతో పాటు సిట్టింగ్ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యేలు ఏఎస్ మనోహర్, వెంకటేశ్వర చౌదరి, ఆర్.గాంధీ, మాజీ ఎంపీ దుర్గా రామకృష్ణ ఒకేతాటిపైకి రావటంతో ఫుల్‌జోష్‌లో ఉన్నారు చిత్తూరు తెలుగు తమ్ముళ్లు.

ఐక్యతారాగం ఆలపిస్తున్న నాయకులు గతంలో ప్రత్యర్థులుగా చిత్తూరు రాజకీయాల్లో చక్రం తిప్పినవారే. దీంతో ఈసారి ఎవరి రియాక్షన్‌ ఎలా ఉంటుందోనని క్యాడర్‌ కంగారుపడితే, ఊహకందని విధంగా అంతా చేతులు కలపటంతో పార్టీ తమ్ముళ్లు ఫుల్‌ ఖుషీ. నారా లోకేష్ యువగళం సమయంలోనూ సరైన నాయకత్వం లేక డీలాపడ్డ చోట ఇప్పుడు ఇంతమంది కలయిక చిత్తూరు రాజకీయాల్లో చర్చగా మారింది. టీడీపీ అధినేత సొంత జిల్లాలో పార్టీలో ఇది కొత్త ట్రెండ్‌ అంటున్నారు చిత్తూరు తమ్ముళ్లు. మాజీ ఎమ్మెల్యేలను ఒక తాటిపైకి తీసుకురావడానికి గురజాల జగన్మోహన్ చేసిన ప్రయత్నాలు సక్సెస్ కావడంతో ఆర్థికంగా బలమైన వైసీపీ అభ్యర్థికి టీడీపీ నుంచి గట్టిపోటీ ఇచ్చినట్లయింది.

నలుగురు మాజీ ఎమ్మెల్యేలతో పాటు మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, రాజ్యసభ మాజీ సభ్యురాలు దుర్గా రామకృష్ణ, మాజీ మేయర్ కటారి హేమలత, మాజీ జడ్పీ చైర్‌పర్సన్ గీర్వాణి చంద్రప్రకాష్ ఇలా అందరూ ఇగోలకు పోకుండా ఒక్కటవుతారని సొంత పార్టీ కేడరే ఏమాత్రం ఊహించలేదట. ఇలా ప్రత్యర్థులను ఏకం చేసిన చిత్తూరులో దూకుడుగానే సాగుతోంది ఎన్నికల ప్రచారం. ఇంతమంది నేతలు టీడీపీ అభ్యర్థి జగన్మోహన్ కోసం పనిచేస్తుంటే, వైసీపీ అభ్యర్థి విజయానంద రెడ్డి తనదైన రీతిలో జనం ముందుకు వెళుతున్నారు. తన అనుభవంతో ఆయన వ్యూహాలకు పదునుపెడుతున్నారు. చేతులు కలిపిన ప్రత్యర్థుల ప్రచారం టీడీపీకి కలిసొస్తుందా..? లేదంటే ఒంటరిగానే అందరినీ ఎదుర్కొంటున్న అధికార పార్టీ అభ్యర్థి ఓటర్లని ఆకట్టుకుంటారా ? అన్నది చిత్తూరు పాలిటిక్స్‌లో ఇప్పుడు హాట్‌హాట్‌ డిస్కషన్‌.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…