Vande Bharat: జెట్‌స్పీడ్! విశాఖ టూ భువనేశ్వర్.. ఇకపై కేవలం ఆరు గంటలే.. ధరలెంతంటే.?
ఏపీ వాసులకు మరో వందేభారత్ రైలు అందుబాటులోకి వచ్చింది. విశాఖపట్నం-భువనేశ్వర్ మధ్య పరుగులుపెట్టే వందేభారత్ రైలును ఈ నెల 12న ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించిన సంగతి తెలిసిందే. సోమవారం మినహా..
ఏపీ వాసులకు మరో వందేభారత్ రైలు అందుబాటులోకి వచ్చింది. విశాఖపట్నం-భువనేశ్వర్ మధ్య పరుగులుపెట్టే వందేభారత్ రైలును ఈ నెల 12న ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించిన సంగతి తెలిసిందే. సోమవారం మినహా వారంలో మిగిలిన ఆరు రోజులు తిరిగే ఈ వందేభారత్ రైలు టికెట్లు మార్చి 17 నుంచి ఐఆర్‌సీటీసీ పోర్టల్‌లో ప్రయాణీకులకు లభిస్తాయి. మరి ఇంతకీ ఆ టికెట్ రేట్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందామా..
ప్రతీ రోజూ ఉదయం 5.15 గంటలకు భువనేశ్వర్‌లో 20841 రైలు నెంబర్‌తో బయల్దేరే ఈ వందేభారత్ ఎక్స్‌ప్రెస్.. ఉదయం 11 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఖుర్దారోడ్(ఉదయం 5.33 గంటలకు), బలుగావ్(ఉదయం 6.23 గంటలకు), ఇచ్చాపురం(ఉదయం 7.18 గంటలకు), పలాస(ఉదయం 8.18 గంటలకు), శ్రీకాకుళం రోడ్(ఉదయం 9 గంటలకు), విజయనగరం(ఉదయం 9.43 గంటలకు) ఈ ట్రైన్ స్టాప్‌లు. అలాగే తిరుగు ప్రయాణంలో 20842 రైలు నెంబర్‌తో బయల్దేరే ఈ రైలు.. మధ్యాహ్నం 3.30 గంటలకు బయల్దేరి.. రాత్రి 9.30 గంటలకు భువనేశ్వర్ చేరుకుంటుంది. ఈ రెండు నగరాల మధ్య ఉన్న 443 కిలోమీటర్లను సుమారు 5.45 గంటల్లో కవర్ చేస్తుంది. ఈ ట్రైన్‌లో రెండు ఏసీ చైర్ కారు, ఆరు ఎగ్జిక్యూటివ్ చైర్ కారు బోగీలు ఉన్నాయి.
టికెట్ ధరలు ఇలా ఉన్నాయి..
భువనేశ్వర్ టూ విశాఖపట్నం ఏసీ చైర్ కారు టికెట్ ధర రూ. 1,115 కాగా, ఇందులో బేస్ ఫేర్ రూ. 841, రిజర్వేషన్ చార్జ్ రూ. 40, సూపర్ ఫాస్ట్ చార్జ్ రూ. 45, జీఎస్టీ చార్జ్ రూ. 47, కేటరింగ్ చార్జ్ రూ. 142గా ఉంది. అలాగే ఎగ్జిక్యూటివ్ చైర్ కారు టికెట్ ధర రూ. 2,130గా నిర్ణయించారు. ఇందులో కేటరింగ్ చార్జ్ రూ. 175గా ఉంది. తిరుగు ప్రయాణంలో ఏసీ చైర్ కారు ధర రూ. 1280గా, ఎగ్జిక్యూటివ్ చైర్ కారు టికెట్ ధర రూ. 2,325గా నిర్ణయించారు. రెండు ప్రయాణాలలోనూ కేటరింగ్ చార్జీల విడివిడిగా ఉండటంతో.. టికెట్ ధరల్లో ఈ వ్యత్సాసం ఉన్నట్టు తెలుస్తోంది.