YS Jagan: వైఎస్ జగన్ మార్గంలో అస్సాం సీఎం.. ఇంతకీ ఏ విషయంలోనంటే.?

ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాల్లో పెద్దన్నగా ఉన్న అస్సాం తాజాగా మరో 3 రాజధానుల ప్రస్తావనతో వార్తల్లో నిలిచింది. ఇప్పటికే ఆ రాష్ట్రానికి దిస్‌పూర్ (గువాహటిలో ఒక భాగం) రాష్ట్ర రాజధానిగా ఉంది. ఇది రాష్ట్రానికి పశ్చిమాన ఒక మూలన బ్రహ్మపుత్ర నదికి, హిమాలయ పర్వత సానువులకు మధ్యన విస్తరించి ఉంటుంది.

YS Jagan: వైఎస్ జగన్ మార్గంలో అస్సాం సీఎం.. ఇంతకీ ఏ విషయంలోనంటే.?
Ys Jagan & Himanta Biswa Sa
Follow us
Mahatma Kodiyar, Delhi, TV9 Telugu

| Edited By: Ravi Kiran

Updated on: Jan 27, 2025 | 5:21 PM

అస్సాం ముఖ్యమంత్రి హేమంత బిశ్వ శర్మ.. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అనుసరిస్తున్నారు. హిమాలయాలు, బ్రహ్మపుత్ర నదీ లోయ మధ్య సువిశాలంగా విస్తరించిన అస్సాం రాష్ట్రానికి దిబ్రూగఢ్‌ను రెండవ రాజధానిని చేస్తానని ప్రకటించడంతో పాటు తేజ్‌పూర్‌లో మరో రాజ్‌భవన్, సిల్చార్‌లో చీఫ్ సెక్రటరీ కార్యాలయంతో పాటు మినీ సెక్రటరియట్ నిర్మిస్తానంటూ గణతంత్ర దినోత్సవ వేడుకల ప్రసంగంలో సీఎం కీలక ప్రకటన చేశారు. రానున్న మూడేళ్లలో దిబ్రూగఢ్‌ను 2వ రాజధానిగా అభివృద్ధి చేస్తామని, తేజ్‌పూర్‌ను రాష్ట్ర సాంస్కృతిక రాజధానిగా తీర్చిదిద్దుతామని చెప్పారు. ఈ ప్రకటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గతంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల పేరుతో తీసుకున్న నిర్ణయం అప్పట్లో విస్తృతంగా చర్చనీయాంశంగా మారింది. కొత్తగా ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సరికొత్త రాజధానిగా ‘అమరావతి’ని నిర్ణయించగా, జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత పాలన వికేంద్రీకరణ పేరుతో విశాఖపట్నం, కర్నూలు నగరాలను కూడా రాజధానులుగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయడం ద్వారా ఆ నగరాన్ని జ్యుడీషియల్ క్యాపిటల్ (న్యాయ రాజధాని)గా, విశాఖపట్నంలో సెక్రటరియట్ ఏర్పాటు చేయడం ద్వారా ఆ నగరాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ (పాలన రాజధాని)గా, అమరావతిలో అసెంబ్లీ కార్యకలాపాలు కొనసాగించడం ద్వారా ఆ నగరాన్ని లెజిస్లేటివ్ క్యాపిటల్ (శాసన రాజధాని)గా తీర్చిదిద్దుతానని తెలిపారు. అయితే అమరావతిని రాజధానిగా తీర్చిదిద్దడం కోసం రైతుల నుంచి 33 వేల ఎకరాల భూమిని సమీకరించి, పాలనా రాజధానిని పూర్తిగా విశాఖపట్నంకు తరలించాలన్న నిర్ణయంపై నిరసనలు వ్యక్తమయ్యాయి. మరోవైపు న్యాయస్థానాల్లోనూ కేసులు దాఖలవగా, హైకోర్టు ఈ నిర్ణయానికి బ్రేకులు వేసింది. దీంతో మూడు రాజధానుల నిర్ణయం ముందుకు కదల్లేదు. గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో జగన్ అధికారాన్ని కోల్పోవడంతో మూడు రాజధానుల నిర్ణయానికి శాశ్వతంగా ఫుల్ స్టాప్ పడింది.

అస్సాంలో మూడు కాదు, 4 రాజధానులు

అయితే ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాల్లో పెద్దన్నగా ఉన్న అస్సాం తాజాగా మరో 3 రాజధానుల ప్రస్తావనతో వార్తల్లో నిలిచింది. ఇప్పటికే ఆ రాష్ట్రానికి దిస్‌పూర్ (గువాహటిలో ఒక భాగం) రాష్ట్ర రాజధానిగా ఉంది. ఇది రాష్ట్రానికి పశ్చిమాన ఒక మూలన బ్రహ్మపుత్ర నదికి, హిమాలయ పర్వత సానువులకు మధ్యన విస్తరించి ఉంటుంది. మొత్తం ఈశాన్య రాష్ట్రాల్లోకెల్లా ఈ నగరమే అతి పెద్దది. అయితే బ్రహ్మపుత్ర నదీలోయతో పాటు హిమాలయ సానువుల్లో విస్తరించిన ఈ రాష్ట్రంలో ఒక మూల నుంచి ఇంకో మూలకు వెళ్లేందుకు ఒక రోజు మొత్తం ప్రయాణం చేయాల్సిన పరిస్థితులున్నాయి. అలాగే అభివృద్ధిలోనూ అసమతుల్యత స్పష్టంగా కనిపిస్తుంది. గువాహటి నగరం పరిసర ప్రాంతాలు తప్ప రాష్ట్రంలోని మిగతా పట్టణాలు, నగరాలు అంతగా అభివృద్ధి చెందలేదు. దీన్ని దృష్టిలో పెట్టుకున్న సీఎం హేమంత బిశ్వ శర్మ.. మరో మూడు నగరాలను రాజధానులుగా ప్రకటించి.. ఆయా ప్రాంత ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.

ఈ క్రమంలో దిబ్రూగఢ్‌ను 2వ రాజధానిగా చేస్తామంటూ సీఎం ప్రకటించారు. ఈ నగరం ఎగువ అస్సాంలో బ్రహ్మపుత్ర నదికి దక్షిణాన కొలువై ఉంది. దేశ రాజధాని న్యూఢిల్లీని వివిధ రాష్ట్రాల రాజధానులకు అనుసంధానించే క్రమంలో రాజధాని ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడుస్తున్నాయి. అయితే అస్సాంలో రాష్ట్ర రాజధాని గువహాటిని దాటుకుని దిబ్రూగఢ్ వరకు రాజధాని ఎక్స్‌ప్రెస్ ప్రయాణం చేస్తుంది. అంటో పరోక్షంగా ఇప్పటికే ఆ నగరానికి 2వ రాజధానిగా గుర్తింపునిచ్చే ప్రయత్నం చాలా కాలం క్రితమే జరిగింది. ఇప్పుడు తాజాగా సీఎం హేమంత బిశ్వ శర్మ.. ఆ నగరంలో శాశ్వత అసెంబ్లీ భవనాలను నిర్మిస్తామని తెలిపారు. అంతేకాదు, 2027 నుంచి అస్సాం అసెంబ్లీ సమావేశాల్లో ఒక సెషన్ ప్రతియేటా దిబ్రూగఢ్‌లో నిర్వహిస్తామని కూడా వెల్లడించారు. కొత్త అసెంబ్లీ భవనం నిర్మాణ పనులు జనవరి 25, 2026న ప్రారంభించి.. మూడు సంవత్సరాలలోపు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

రాష్ట్ర పట్టణాభివృద్ధి ప్రణాళికలలో భాగంగా, తేజ్‌పూర్‌ను అస్సాం సాంస్కృతిక రాజధానిగా అభివృద్ధి చేస్తామని.. అక్కడ కొత్త రాజ్ భవన్‌ను నిర్మిస్తామని తెలిపారు. ఇది రాష్ట్రానికి మధ్యభాగంలో బ్రహ్మపుత్ర నదికి ఉత్తరాన కొలువై ఉంది. అస్సాం రాష్ట్రాన్ని బ్రహ్మపుత్ర నది రెండుగా చీల్చుతుందన్న విషయం తెలిసిందే. ఇందులో నదికి ఉత్తరాన ఉన్న ప్రాంతం దక్షిణాన ఉన్న ప్రాంతంతో పోల్చితే వెనుకబడి ఉంటుంది. ఈ క్రమంలో ఉత్తర అస్సాంలో.. రాష్ట్రానికి సరిగ్గా మధ్యభాగంలో ఉన్న తేజ్‌పూర్‌ను సాంస్కృతిక రాజధానిగా ప్రకటించడం ఆ ప్రాంతవాసుల మనసు గెలుచుకోడానికే అన్న చర్చ జరుగుతోంది.

ఇక సిల్చార్‌ పట్టణం రాష్ట్ర రాజధానికి సుదూరాన.. మణిపూర్‌కు సమీపంలో ఉంటుంది. ఇక్కడికి చేరుకోవాలంటే మధ్యలో పర్వత శ్రేణులు దాటి బరాక్ లోయకు చేరుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయంతో పాటు మినీ సచివాలయం ఏర్పాటు చేయడం ద్వారా ఆ ప్రాంత ప్రజలకు పాలనను మరింత దగ్గర చేసినట్టవుతుందని సీఎం హేమంత బిశ్వ శర్మ భావిస్తున్నారు. బరాక్ లోయకు గువాహాటికి మధ్య కనెక్టివిటీని మరింత మెరుగుపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇలా గువాహటితో పాటు దిబ్రూగఢ్, తేజ్‌పూర్, సిల్చార్ నగరాలు సైతం రాజధాని హోదాను దక్కించుకోనున్నాయి. హిమాలయ రాష్ట్రాల్లో ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సైతం 3 రాజధానులున్నాయి. పాలనపరమైన రాజధానిగా డెహ్రాడూన్ ఉండగా, హైకోర్టు కొలువైన నైనితాల్‌ను జ్యుడీషియల్ క్యాపిటల్‌గా వ్యవహరిస్తుంటారు. అలాగే పర్వత ప్రాంతాల్లో గైర్‌సైన్ వద్ద నిర్మించిన కొత్త అసెంబ్లీ, సచివాలయం భవనాలతో ఆ పట్టణాన్ని వేసవి రాజధానిగా వ్యవహరిస్తున్నారు. జమ్ము-కాశ్మీర్ రాష్ట్రానికి శ్రీనగర్, జమ్ము నగరాలు రాజధానులుగా ఉన్నాయి. అనేక రాష్ట్రాల్లో రాజధాని ఒకచోట, రాష్ట్ర హైకోర్టు మరోచోట కొలువై ఉన్నాయి. కర్ణాటకలో బెంగళూరుతో బెళగావిలో అసెంబ్లీ ఏర్పాటు చేసి ఒక సెషన్ అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తుండగా, మహారాష్ట్రలో ముంబైతో పాటు నాగ్‌పూర్‌లో ఒక సెషన్ అసెంబ్లీ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు అస్సాం ఏకంగా 4 నగరాలను రాజధానులుగా వ్యవహరించడం సరికొత్త చర్చకు దారితీసింది.