చికెన్ ప్రియులకు బ్యాడ్ న్యూస్.. కోళ్లకు కొత్త రోగం.. వామ్మో.. తిరుగుతూనే ఉన్నట్టుండి..

ఆంధ్రప్రదేశ్.. తెలంగాణ.. అటు ఉభయగోదావరి జిల్లాలతో పాటు.. ఇటు ఖమ్మం, నిజామాబాద్‌ జిల్లాల్లో అంతుచిక్కని వైరస్ పౌల్ట్రీ పరిశ్రమను వణికిస్తోంది. అప్పటివరకు ఆరోగ్యంగా కనిపించిన కోడి అంతలోనే మృత్యువాత పడుతుండటం పౌల్ట్రీ నిర్వాహకులను కలవరపెడుతోంది. సాధారణ మరణాలకు భిన్నంగా వేలాది కోళ్లు చనిపోతుండటం వారికి కంటిమీద కునుకులేకుండా చేస్తోంది.

చికెన్ ప్రియులకు బ్యాడ్ న్యూస్.. కోళ్లకు కొత్త రోగం.. వామ్మో.. తిరుగుతూనే ఉన్నట్టుండి..
Chicken Virus
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Feb 05, 2025 | 9:09 PM

ఆంధ్రప్రదేశ్.. తెలంగాణ.. అటు ఉభయగోదావరి జిల్లాలతో పాటు.. ఇటు ఖమ్మం, నిజామాబాద్‌ జిల్లాల్లో అంతుచిక్కని వైరస్ పౌల్ట్రీ పరిశ్రమను వణికిస్తోంది. అప్పటివరకు ఆరోగ్యంగా కనిపించిన కోడి అంతలోనే మృత్యువాత పడుతుండటం పౌల్ట్రీ నిర్వాహకులను కలవరపెడుతోంది. సాధారణ మరణాలకు భిన్నంగా వేలాది కోళ్లు చనిపోతుండటం వారికి కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. అంతుచిక్కని వైరస్‌ చాపకింద నీరులా పౌల్ట్రీలకు విస్తరిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది.

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో పౌల్ట్రీ ఫారాల దగ్గర చనిపోయిన కోళ్లు గుట్టలు గుట్టలుగా దర్శనమిస్తున్నాయి. ఒక్కొ ఫారంలో రోజుకు సుమారు పదివేల కోళ్లు చనిపోతున్నాయని చెబుతున్నారు నిర్వాహకులు. అయితే ఈ కోళ్ల మృతికి కారణం ఏంటన్నది గుర్తించలేకపోతున్నారు..యజమానులు. కోళ్ల మృతితో కోడిగుడ్ల ఎగుమతులు భారీగా తగ్గిపోయాయి. ఇక్కడి నుంచి నిత్యం పశ్చిమ బెంగాల్, అస్సా రాష్ట్రాలకు నిత్యం 40కి పైగా లారీల్లో కోడిగుడ్లు ఎగుమతి అయ్యేవి. అయితే ఆ సంఖ్య ప్రస్తుతం 25కు పడిపోయింది. మరికొన్ని రోజులు పరిస్థితి ఇలాగే ఉంటే ఆ సంఖ్య సింగిల్ డిజిట్‌కు పడిపోతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. కోళ్ల మరణాలు ఇలాగే కొనసాగితే భారీ నష్టాలు తప్పవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..పౌల్ట్రీ యజమానులు.

40 లక్షలకు పైగా కోళ్ల మృతి

సాధారణంగా అనారోగ్య సమస్యలు, ఇతర కారణాలతో పౌల్ట్రీలోని కోళ్ల సంఖ్యలో రోజుకు 0.05 శాతం లోపు కోళ్లు చనిపోతుంటాయి. లక్ష కోళ్లు ఉన్న పౌల్ట్రీలో రోజుకు 20 నుంచి 50 వరకు కోళ్లు చనిపోతుంటే లెక్కలోకి తీసుకోరు. అయితే ప్రస్తుతం పరిస్థితి అందుకు భిన్నంగా తయారైంది. ఒక్క ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోనే గడిచిన 15 రోజుల్లో 40 లక్షల కోళ్లు చనిపోయాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతోంది. ఈ కోళ్ల మరణాలకు కారణమైన వైరస్‌ను గుర్తించి..దాని నిర్మూలనకు సహకరించాలని ప్రభుత్వాన్నికోరుతున్నారు..రైతులు.

ఇక తెలంగాణలోని ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో వేలాది బాయిలర్ కోళ్లు చనిపోతున్నాయి. అంతుచిక్కని వైరస్‌తో సత్తుపల్లి, కల్లూరు, విఎమ్ బంజరలోని పౌల్ట్రీ ఫామ్స్‌లో కోళ్లు మృతి చెందాయి. కోళ్ల మృతిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న రైతులు.. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతున్నారు.

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోనూ అంతుచిక్కని వ్యాధితో కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. బిర్కూర్, పోతంగల్, భీమ్‌గల్ మండలాల్లో వేలాది కోడి పిల్లలు చనిపోయాయి. వైరస్‌ ఒక్కొక్కటిగా.. అన్ని పౌల్ట్రీ ఫామ్స్‌కు వ్యాపిస్తుండటంతో పౌల్ట్రీ రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. వైరస్‌ ఏంటో కనిపెట్టి..దానికి సంబంధించిన వ్యాక్సిన్‌ పంపిణీ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

ఉన్న కోళ్లను వచ్చిన ధరకు అమ్ముకుంటున్న రైతులు

సాధారణంగా డిసెంబర్, జనవరి నెలల్లో చలిగాలుల తీవ్రత ఎక్కువై కోళ్లకు ఊపిరితిత్తుల సంబంధిత వైరస్‌లు వ్యాపిస్తుంటాయి. అయితే శీతాకాలంలో వచ్చే వ్యాధులకు భిన్నంగా ఈ వైరస్‌ లక్షణాలు ఉన్నాయని రైతులు చెబుతున్నారు. తెల్లారేసరికి ఎన్ని కోళ్లు ఉంటాయో తెలియని పరిస్థితి ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం ఒక్క కోడికి వైరస్‌ సోకిందంటే చాలు.. సాయంత్రానికి ఆ షెడ్డులో ఉన్న వేలాది కోళ్లు ప్రాణాలు కోల్పోతున్నాయి. దీంతో వైరస్ వచ్చి చనిపోతాయేమో అనే భయంతో..బతికి ఉన్న కోళ్లను వచ్చిన ధరకు అమ్మేసుకుంటున్నారు రైతులు.

శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపించిన అధికారులు

మరోవైపు కోళ్ల అంతుచిక్కని మరణాలకు కారణాలేంటో తెలుసుకునే పనిలో పడ్డారు అధికారులు. పౌల్ట్రీ పార్మ్స్‌లో ఇప్పటికే శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కి పంపామని అధికారులు చెబుతున్నారు. ల్యాబ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత కోళ్లకు సోకుతున్న వ్యాధి ఏంటో తెలుస్తుందంటున్నారు. అయితే మరిన్ని కోళ్లకు వైరస్ సోకకుండా రైతులు..చనిపోయిన కోళ్లను బహిరంగ ప్రదేశంలో పడేయకుండా పాతిపెట్టాలని సూచిస్తున్నారు.

ఆరోగ్యంగా తిరుగుతూ ఉన్నట్టుండి మృతి

ఈ మరణాలకు H5N1 అనే వైరస్ కారణం కావొచ్చని అనుమానిస్తున్నారు.. పశు సంవర్ధకశాఖ అధికారులు. 2012, 2020లో కూడా ఇదే తరహాలో వైరస్‌ వ్యాపించింది. నాలుగేళ్ల క్రితం ఈ వ్యాధి సోకిన అనేక కోళ్లు మృత్యువాతపడ్డాయి. అప్పుడు కోళ్లు ఎందుకు చనిపోతున్నాయో కూడా తెలియని అయోమయం నెలకొంది. వైరస్‌ సోకి కోళ్లు మరణిస్తున్నాయనే వార్త బయటకు రాగానే అమ్మకాలు కూడా గణనీయంగా తగ్గిపోయాయి. దీంతో చికెన్‌ ధరలు భారీగా పడిపోయాయి. అప్పుడు వైరస్‌ సోకడానికి చాలా రోజుల సమయం పట్టింది. ఇప్పుడు మళ్లీ అదే తరహా వైరస్‌ వ్యాపిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వైరస్‌ సోకిన కోడికి లక్షణాలు కనిపించవు. ఎప్పటిలాగే ఆరోగ్యంగా తిరుగుతున్నట్టే కనిపించి.. ఉన్నట్టుండి చనిపోతుంది. అధికారుల సూచనలతో ఇప్పటికే కోళ్లపై వైరస్ ప్రభావం తగ్గేందుకు మందులు ఇస్తున్నారు. ఇక కొల్లేరు ప్రొంతానికి ఈ సారి అధిక సంఖ్యలో వలస పక్షులు రావడం కూడా వైరస్ వ్యాప్తికి కారణమై ఉండొచ్చన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. వైరస్ ప్రభావం కోళ్లపై పడకుండా ఉండేందుకు వాటికి చిన్నప్పటి నుంచే వ్యాక్సిన్లు అందించాలని సూచిస్తున్నారు..నిపుణులు.

20 వారాల వయసు వచ్చేసరికి 23 రకాల వ్యాక్సిన్లు

కొద్దిరోజుల క్రితం నాటు కోళ్లలో కనిపించిన వింత లక్షణాలు ఇప్పుడు లేయర్, బ్రాయిలర్‌ కోళ్లకు వ్యాపించాయి. నాటు కోళ్లతో పోలిస్తే లేయర్‌ కోళ్లకు వ్యాక్సినేషన్‌ విషయంలో పౌల్ట్రీ వర్గాలు చాలా జాగ్రత్తలు తీసుకుంటాయి. కోడికి 20 వారాల వయసు వచ్చేనాటికి దాదాపు 23 వరకు వ్యాక్సిన్లు వేస్తారు. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా కోళ్లు అంతుచిక్కని లక్షణాలతో మృత్యువాత పడుతుండటం పౌల్ట్రీ వర్గాలను కలవరపరుస్తోంది. ఈ కోళ్ల మరణాలను నియంత్రించకపోతే.. రాబోయే రోజుల్లో పౌల్ట్రీ ఫారాల మనుగడే ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందని పలువురు హెచ్చరిస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..