AP News: ‘దాడులకు భయపడను.. నాలో వైఎస్ రక్తమే ప్రవహిస్తోంది’ : ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల.
వైఎస్ రక్తమే తనలో ప్రవహిస్తోందన్న ఏపీసీసీ చీఫ్ షర్మిల దాడులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా తిరుపతిలో కాంగ్రెస్ పార్టీ సమావేశంలో పాల్గొన్నారు ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సైనికులుగా కాకుండా ఒక్కో సైన్యంలా పనిచేయాలని పిలుపునిచ్చారు.

తిరుపతి, జనవరి 28: వైఎస్ రక్తమే తనలో ప్రవహిస్తోందన్న ఏపీసీసీ చీఫ్ షర్మిల దాడులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా తిరుపతిలో కాంగ్రెస్ పార్టీ సమావేశంలో పాల్గొన్నారు ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సైనికులుగా కాకుండా ఒక్కో సైన్యంలా పనిచేయాలని పిలుపునిచ్చారు. వైసీపీ పార్టీని భుజాన వేసుకొని 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేశానన్న షర్మిల ఇప్పుడు ఆ పార్టీ నుంచి దాడులను ఎదుర్కొంటున్నానన్నారు. వైఎస్ బిడ్డగా పుట్టింటికి వచ్చి కాంగ్రెస్ పార్టీ కోసం రాష్ట్రంలో రాజకీయం చేస్తున్నానన్నారు. ఎలాంటి త్యాగానికైనా, పోరాటానికైనా రెడీ అన్నారు. సీపీఎస్ అమలు కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెడతామన్న షర్మిల ఇదే తిరుపతిలో 2014లో మోడీ 10 ఏళ్ల ప్రత్యేక హోదా హామీ ఇచ్చారని గుర్తు చేశారు. రామమందిరం కట్టిన మోడీ మరి ఇక్కడ దేవస్థానం ముందు ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. కోటి అనే వ్యక్తి హోదా కోసం తిరుపతిలో ఆత్మాహుతి చేసుకున్నారని షర్మిల తెలియజేశారు. మోడీ, చంద్రబాబులు అలీబాబా అరడజను దొంగల గుంపుగా మారిందన్నారు. మనకు హోదా ఇచ్చి ఉంటే హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ లాగా పరిశ్రమలు వచ్చి ఉండేవన్నారు.
చంద్రబాబు రాజధాని పేరిట గ్రాఫిక్స్ చూపితే, జగన్ మూడు రాజధానులు అని చెప్పి గందర గోళం చేశారన్నారు. ఏపీలో జగన్, చంద్రబాబులు మోడీకి ఊడిగం చేసి, బానిసలు అయ్యారన్నారు. ఒక్క మేలు చేయని బీజేపీకి జగన్, చంద్రబాబు బానిసలయ్యారన్నారు. వీళ్ళిద్దరూ బానిసలు కావడమే కాకుండా రాష్ట్ర ప్రజలను బానిసలు చేస్తున్నారన్నారు. ఒక్క ఎమ్మెల్యే కూడా లేని బీజేపీకి ఈ రెండు పార్టీలు వశం అయ్యాయన్నారు. హంద్రీ నీవా ప్రాజెక్ట్ వైఎస్ఆర్ 90 శాతం పూర్తి చేస్తే, మిగిలిన 10 శాతం చంద్రబాబు, జగన్లు పూర్తి చేయలేక పోయారన్నారు. కొత్తగా ఒక్క ఎకరా ఆయకట్టు కూడా పెరగలేదన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి, జగన్ పాలనకు మధ్య ఆకాశానికి, పాతాళానికి ఉన్నంత తేడా ఉందన్నారు.హోదాతో పాటు మద్యపాన నిషేధం ఏమైందో జగన్ చెప్పాలన్నారు. ఇచ్చిన ప్రతి మాట జగన్ తప్పారని విమర్శించారు. పోలవరం ప్రాజెక్ట్ ఏమైందో చెప్పాలన్నారు. వైసీపీ కోసం పాదయాత్ర చేసి పార్టీకి అండగా ఉండి నిలబెట్టానన్నారు షర్మిల. పార్టీని అధికారంలోకి తెచ్చానన్నారు. ఇప్పుడు నా వ్యక్తిగత జీవితంపై దాడి చేస్తున్నారని అయినా తాను భయపడనన్నారు షర్మిల. పులి కడుపున పులి పుడుతుందని నాపై ఎంత దాడి చేసిన పరవాలేదన్నారు. ఏ త్యాగానికి అయినా నేను సిద్ధమన్నారు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..