Galla Jayadev: రాజకీయాలకు గుడ్ బై చెప్పిన గల్లా జయదేవ్.. కానీ చిన్న ట్విస్ట్..
రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ తెలిపారు. ఈ నిర్ణయం.. తాత్కాలికమేనని చెప్పారు. వనవాసం తర్వాత శ్రీరాముడు, పాండవులు వచ్చినంత బలంగా తిరిగి రాజకీయాల్లోకి వస్తానని వెల్లడించారు. గుంటూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఆంధ్రప్రదేశ్, జనవరి 28: రాజకీయాల నుంచి తాను తాత్కాలికంగా తప్పుకుంటున్నట్లు గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ తెలిపారు. తాను ఇకపై వ్యాపారాలపై దృష్టి పెడతానన్నారు. రాజకీయాలు ఒకసారి వదిలేస్తే మళ్లీ రావడం కష్టమని కొందరు అంటున్నారని.. కానీ మళ్లీ అవకాశం వస్తే తిరిగి పోటీ చేస్తానని తెలిపారు. పార్టీకి రాజీనామా చేయడంలేదని వెల్లడించారు. రాజకీయాలు, వ్యాపారాలపై ఒకేసారి దృష్టి పెట్టడం కష్టమని, ప్రజలను కలవలేకపోతున్నానని ఆయన అన్నారు. తాను ఇప్పటివరకు పార్లమెంట్‌లో యాక్టివ్‌గా ఉన్నానని, ఏపీ రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న హామీలను నెరవేర్చాలని ఒత్తిడి తెచ్చానని చెప్పారు. రాష్ట్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ జరిగిన అమరావతి రైతుల ఆందోళనలో తాను చురుగ్గా పాల్గొన్నానని గుర్తు చేశారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు బాగుంటే పరవాలేదని, అవి దెబ్బతినే విధంగా ఉంటే మాత్రం ఇబ్బంది పడతామని గల్లా జయదేవ్ అన్నారు. పదేళ్లు తాను ప్రజలకు సేవ చేశానని, ఇప్పుడు బ్రేక్ తీసుకుంటానన్నారు. శ్రీరాముడు, పాండవులు వనవాసం వెళ్లి పరాక్రమ వంతులుగా తిరిగొచ్చినట్లు తానూ అలాగే వస్తానన్నారు జయదేవ్.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.