Rain Alert: రైతన్నలకు గుడ్‌న్యూస్.. ఈ జిల్లాల్లో 3 రోజుల పాటు వర్షాలే వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్!
ఏపీ వాసులకు వాతావరణ శాఖ కీలక సూచనలు చేసింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్‌పై ఉన్న ఆదివారం నాటి ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 5.8 నుండి 7.6 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి కొనసాగుతుందని, దీని ప్రభావంతో రాష్ట్రంలో రాబోయే మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాతావరణ శాఖ కీలక సూచనలు చేసింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం నుండి ఉపరితల ద్రోణి దక్షిణ ఒడిశా, దక్షిణ ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, మధ్య మహారాష్ట్ర, మరాఠ్వాడా, దక్షిణ గుజరాత్ ప్రాంతాల మీదుగా ఈశాన్య అరేబియా సముద్రం వరకు సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉందని.. అలాగే దక్షిణ ఛత్తీస్‌గఢ్, దానిని ఆనుకుని తెలంగాణ ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి పైన పేర్కొన్న ద్రోణితో విలీనమైందని.. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
వాతావరణ శాఖ సూచనల ప్రకారం.. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం ప్రాంతాల్లో రాబోయే మూడు రోజుల పాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే వర్షాల సమయంలో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.
ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమలో రాబోయే మూడు రోజుల పాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని.. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే ఈ ప్రాంతాల్లో కూడా వర్షాల సమయంలో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.
వర్షాల నేపథ్యంలో ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ప్రజలకు కొన్ని కీలక సూచనలు చేసింది. వర్షాలు కురిసే సమయంలో ప్రజలు ఎవరూ చెట్ల కింద ఉండవద్దని.. విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని తెలిపింది. రైతులు పొలాలకు వెళ్లే సమయంలో ముందు వెనుక చూస్తూ వెళ్లాలని.. భారీ ఈదురుగాలుల కారణంగా విద్యుత్ స్తంభాలు విరిగిపడి.. కరెంట్ షాక్‌కు గురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది. అలాగే మత్స్యకారులు ఎవరూ సముద్రంలోకి చేపల వేటకు వెళ్లవద్దని సూచించింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
