Rain Alert: ఏపీకి దడపుట్టించే న్యూస్.. మూడు రోజులు వానలే వానలు.. ఈ జిల్లాల్లో అత్యధికంగా..
ఏపీకి వాయుగుండం ముప్పు పొంచి ఉంది. రాబోయే మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్‌లు జారీ అయ్యాయి. చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాల్లో అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉంది. వాయుగుండం తుపానుగా మారే అవకాశం కూడా ఉంది. మత్స్యకారులు శనివారం వరకు వేటకు వెళ్లకూడదని అధికారులు తెలిపారు.

ఏపీకి వాతావరణ శాఖ బ్యాడ్ న్యూస్ చెప్పింది. వాయుగుండం ముప్పు ఉందని తెలిపింది. దీని ప్రభావంతో రాబోయే మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో బలపడుతున్న వాయుగుండం కారణంగా కొన్ని జిల్లాలకు ఆరెంజ్, మరికొన్నింటికి ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. నైరుతి బంగాళాఖాతంలో మొదలైన అల్పపీడనం ఇప్పుడు తీవ్ర అల్పపీడనంగా మారింది. ఇది ఇవాళ వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఈ వాయుగుండం మరింత బలపడి తుపానుగా మారే అవకాశం కూడా ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. అరేబియా సముద్రంలో కూడా ఒక తీవ్ర అల్పపీడనం కొనసాగుతూ వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వీటి ప్రభావంతో ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది.
ఈ జిల్లాల్లో వర్షాలు..
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, తిరుపతి, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరేంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. బాపట్ల, ప్రకాశం, నంద్యాల, కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాలకు ఎల్లో అలర్ట్ చేసింది. గురువారం నుంచి ఆదివారం వరకు రాష్ట్రంలోని అక్కడక్కడ భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉంది.
అధికారుల అలర్ట్
దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 35 నుంచి 55 కి.మీ. వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయి. సముద్రం అల్లకల్లోలంగా మారుతుంది కాబట్టి, మత్స్యకారులు శనివారం వరకు వేటకు వెళ్లవద్దు అని అధికారులు హెచ్చరించారు. ప్రభావిత జిల్లాల యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ప్రజలు సహాయం కోసం విపత్తుల నిర్వహణ సంస్థ కంట్రోల్ రూమ్ నంబర్లను సంప్రదించవచ్చు. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు.
తెలంగాణలో..
అటు తెలంగాణలోనూ రెండు రోజుల పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
