శ్రీకాకుళం, ఆగస్టు 22: శ్రీకాకుళం జిల్లాలోని ఉద్ధానం ప్రాంతంలో ఎలుగుబంట్లు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గతంలో జీడి, కొబ్బరి తోటల్లో తిష్ట వేస్తూ వ్యవసాయ పనులకోసం తోటలోకి వెళ్లే రైతులు, రైతు కూలీలపై దాడులు చేసే ఎలుగుబంట్లు ఇటీవల కాలంలో తరచూ గ్రామాల్లోకి చొరబడుతున్నాయి. ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్నాయి. మందస మండలం మల్లెనవారి పేట గ్రామంలోకి సోమవారం రాత్రి మూడు ఎలుగుబంట్లు చొరబడి హల్ చల్ చేసాయి. గ్రామ వీధుల్లో రాత్రంతా యదేచ్చగా సంచరిస్తూ గ్రామస్తులకు కంటి మీద కునుకు లేకుండా చేసాయి ఎలుగు బంట్లు. ఒక తల్లి ఎలుగుబంటి, రెండు పిల్ల ఎలుగుబoట్లు గ్రామంలోకి రావటoతో రాత్రంతా ఇళ్ళ నుండి బయటకు రాడానికి గ్రామస్తులు వణికిపోయారు. చివరకు ఆరుబయట కాల కృత్యాలు తీర్చుకోడానికి కూడా వీలు లేని పరిస్థితి ఏర్పడింది.
ఉద్దాన ప్రాంతంలోని రట్టి కొండలు, నల్ల బొడ్లూరు మెట్ట ప్రాంతం గతంలో ఎలుగుబంట్లుకు కేరాఫ్ అడ్రస్ గా ఉండేవి. ఈ ప్రాంతంలో ఉంటూ కొండజాతి ఫలాలు, సమీప జీడి,కొబ్బరి తోటలలో ఆహారం సేకరిస్తూ జీవనం కొనసాగించేవి ఎలుగు బoట్లు. కానీ తరువాత కాలంలో రట్టి కొండలు, నల్ల బొడ్లూరు మెట్టను గ్రావెల్ కోసమని, ఇళ్ళ నిర్మాణాల కోసమని యధేచ్ఛగా మైనింగ్ చేయటంతో రట్టి కొండ, మెట్ట ప్రాంత స్వరూపమే పూర్తిగా మారిపోయింది. దానికి తోడు గతంలో వచ్చిన తిత్లీ తుఫాన్ దెబ్బకు సమీప ప్రాంతంలోని తోటలలో చెట్లు విరిగిపోయి వీటి ఆవాసం దెబ్బతింది. దీంతో ఎలుగు బoట్లు ఆహారం కోసం జనావాసాల బాట పడుతున్నాయి.
వీధుల్లో గ్రామస్తులు తిని పడేసే ఆహార వ్యర్ధాలే కాకుండా అప్పుడప్పుడు రాత్రిపూట అంగన్వాడి కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలోని మిడ్ డే మిల్స్ కిచెన్ రూమ్ లలోకి సైతం కిటికీ ఊచలు విరిచి ఎలుగుబంట్లు చొరబడి ఆహార దినుసులను తినేస్తున్న సందర్బాలు చాలానే ఉన్నాయి. అప్పుడప్పుడు మనుషులపై దాడులకు దిగుతుండటంతో పాటు తమ ఉపాధి పైన తీవ్ర ప్రభావం చూపుతున్న ఎలుగు బంట్ల సంచారం నుండి రక్షణ కల్పించాలని అటవీశాఖ అధికారులను ఉద్దానo ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.