Mekapati Goutham Reddy: మేకపాటి గౌతమ్ రెడ్డి మరణానికి ముందు.. ఆ 90 నిమిషాలపాటు ఏం జరిగింది..?
ఎంతో కూల్ గా ఉండే మేకపాటికి హార్ట్ అటాక్ ఎలా వచ్చింది? ఎంతో కఠిన వ్యాయామాయాలను చేసే గౌతమ్ రెడ్డికి ఈ అనారోగ్యమేంటి?
Mekapati Goutham Reddy: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణం వెనక అసలేం జరిగింది? రాత్రి అందరితో కలసి నిశ్చితార్ధంలో పాల్గొన్న మంత్రి గౌతమ్ రెడ్డి. ఉదయానికల్లా మృతి చెందడానికి అసలు సిసలు కారణాలేంటి? ఉదయం ఎన్నింటికి ఆయనకు గుండె పోటు వచ్చింది? ఎంతో కూల్ గా ఉండే మేకపాటికి హార్ట్ అటాక్ ఎలా వచ్చింది? ఎంతో కఠిన వ్యాయామాయాలను చేసే గౌతమ్ రెడ్డికి ఈ అనారోగ్యమేంటి? ఎక్కడైనా హోటల్ లో దిగినా సరే జిమ్ ఫెసిలిటీ చూసుకునే వ్యక్తికి ఇలాంటి దుర్మరణం ఎలా వచ్చింది? అన్నదిపుడు అందరినీ తొలిచేస్తున్న ప్రశ్న. అయితే సోమవారం ఉదయం గౌతమ్‌రెడ్డి మరణానికి ముందు 90 నిమిషాల పాటు ఏం జరిగింది…
మేకపాటికి ఉదయం ఐదున్నర ఆరు గంటలకు నిద్ర లేచి కాఫీ తాగే అలవాటు. కానీ ఈ రోజు మాత్రం గౌతమ్ కాఫీ తాగలేదు. ఉదయం 7. 20కి సోఫాలో వచ్చి కూర్చున్నారు. ఆ వెంటనే కుప్పకూలిపోయారు. చెమటలు పట్టడం గుర్తించి ప్రాథమిక వైద్యం అందించారు. ఆ వెంటనే ఆయన్ను అపోలోకి చేర్చారు. ఆ తర్వాత డాక్టర్లు అత్యవసర వైద్య సేవలు అందించారు. కానీ అవేవీ ఫలించలేదు. సరిగ్గా సోమవారం ఉదయం 9 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచినట్లు చికిత్స అందించిన అపోలో వైద్యులు ధృవీకరించారు.
కాగా.. ఉదయం 7:30 గంటలకు జిమ్‌కు వెళ్దామని సిద్ధమయ్యారని.. ఇంట్లో నుంచి బయటికి రాకముందే ఛాతిలో నొప్పిగా ఉందని సోఫాలోనే కూర్చుకున్నారని గౌతమ్ ఇంటి వంట మనిషి కొమురయ్య చెబుతున్నారు. వెంటనే ఆయన్ను కుటుంబ సభ్యులు, గన్‌మెన్‌లు అపోలో ఆస్పత్రికి తరలించారు. కొద్దిసేపటికే ఆయన మృతిచెందారు. గౌతమ్‌రెడ్డికి భార్య శ్రీకీర్తి, కుమార్తె అనన్యరెడ్డి, కుమారుడు అర్జున్‌రెడ్డి ఉన్నారు. మంత్రి మృతిపట్ల తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ ప్రముఖులు, పలువురు పారిశ్రామికవేత్తలు ప్రగాఢ సంతాపం తెలిపారు.
- అసలేం జరిగింది.
- ఇంట్లో పనిమనుషులు కొమరయ్య, చందు ఇచ్చిన సమాచారం ప్రకారం ఓసారి చూద్దాం.
- >> ఉ 7.00 – నిద్రలేచిన గౌతమ్ రెడ్డి
- >> ఉ 7.10- బెడ్‌రూమ్ నుంచి బయటకి, సోఫాలో కూర్చున్న గౌతమ్‌రెడ్డి
- >> ఉ 7.15- కాఫీ ఇచ్చిన వంటమిషని, వద్దన్న గౌతమ్
- >> ఉ 7.25- చమటలు పడుతున్నాయంటూ గుండెపట్టుకున్న గౌతమ్
- >> వెంటనే భార్య కీర్తి, కుమార్తె అనన్యకు పనిమనుషుల సమాచారం
- >> ఉ 7.30- అప్పటికే స్పృహతప్పినట్లు గుర్తించిన కుటుంబీకులు
- >> కాసేపు సపర్యలు చేసిన కుటుంబీకులు
- >> ఉ 7.45 – అపోలో ఆస్పత్రికి చేరిక
- >> ఉ 9.00 – చనిపోయినట్లు నిర్దారించిన వైద్యులు
7.45 నుంచి దాదాపు 8.55 వరకూ.. అంటే దాదాపు 90 నిమిషాల పాటు ఆస్పత్రిలో CPR జరిగింది. అప్పటికీ బాడీ రెస్పాండ్ కాలేదు. ఇక ఆఖరి ప్రయత్నాలు ఫలించకపోవడంతో 9గంటల ప్రాంతంలో ఆయన చనిపోయిటన్లు ధృవీకరించారు. ఆయన మరణంపై అపోలో వైద్యులు కీలక ప్రకటన చేశారు. ఇవాళ ఉదయం 9.16 గంటలకు గౌతమ్‌రెడ్డి మృతిచెందినట్లు అపోలో వైద్యులు ప్రకటించారు. ‘గౌతమ్‌రెడ్డి ఇంటి దగ్గర కుప్పకూలారు. ఉదయం 7.45 గంటలకు గౌతమ్‌రెడ్డిని అపోలో ఆస్పత్రికి తీసుకువచ్చారు. స్పందించని స్థితిలో గౌతమ్‌రెడ్డిని ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఆయన ఆస్పత్రికి వచ్చే సమయానికి శ్వాస ఆడట్లేదు. అత్యవసరం విభాగంలో తీవ్రంగా శ్రమించినా ఫలితం లేకపోయింది’ అని వైద్యులు ప్రకటించారు.