AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీలో ఇవాళ్టి నుంచి నామినేషన్ల ప్రక్రియ షురూ.. ఎక్కడా కనిపించని ఎన్నికల హడావిడి.. కోర్టు తీర్పు కోసం ఎదురుచూపులు..!

రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసినా విశాఖ జిల్లా అధికారులు మాత్రం అదేమీ పట్టనట్టే వ్యవహరిస్తున్నారు.

ఏపీలో ఇవాళ్టి నుంచి నామినేషన్ల ప్రక్రియ షురూ.. ఎక్కడా కనిపించని ఎన్నికల హడావిడి.. కోర్టు తీర్పు కోసం ఎదురుచూపులు..!
Balaraju Goud
|

Updated on: Jan 25, 2021 | 7:39 AM

Share

AP Local body Elections : ఏపీలో పంచాయతీ ఎన్నికలపై ఇంకా అదే ప్రతిష్టంభన కొనసాగుతోంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసినా విశాఖ జిల్లా అధికారులు మాత్రం అదేమీ పట్టనట్టే వ్యవహరిస్తున్నారు. మరోవైపు కరోనా వ్యాక్సినేషన్ పూర్తయ్యేంత వరకు ఎన్నికల విధులు నిర్వహించలేమంటూ జిల్లా ఉద్యోగ సంఘాలు కరాఖండిగా చెప్పేస్తున్నాయి. దీంతో సోమవారం వెలువడనున్న సుప్రీంకోర్టు తీర్పు పైన అందరి దృష్టి పడింది.

ఎన్నికలు అంటే ఓ సందడి వాతావరణం కనిపిస్తుంది. ఇటు రాజకీయ పార్టీలకు, అటు అధికార యంత్రాంగానికి బోలెడంత పని. రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసినప్పటి నుంచే అభ్యర్థుల ఎంపిక, నామినేషన్లు, ప్రచారాలతో నేతలంతా బిజీగా ఉంటే…. అటు అధికార యంత్రాంగం కూడా ఎన్నికల కోడ్ అమలు ,బ్యాలట్ పేపర్ల ముద్రణ, నామినేషన్ల స్వీకరణ వంటి విధుల్లో ఉన్నతాధికారులు మొదలు కిందిస్థాయి అధికారుల వరకు అంతా బిజీ బిజీగా ఉంటారు.

కానీ ఈసారి పంచాయతీ ఎన్నికల్లో మాత్రం ఆ హంగామా ఎక్కడా కనిపించడం లేదు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ శనివారం పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసినప్పటికీ విశాఖ జిల్లా యంత్రాంగం లైట్ తీసుకుంటుంది. శనివారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినప్పటికీ జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ సహా జిల్లా అధికారులంతా దూరంగానే ఉన్నారు .దీంతో వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఖాళీ కుర్చీలు మాత్రమే దర్శనమిచ్చాయి. ఇక నోటిఫికేషన్ వచ్చిన రెండో రోజు అయిన ఆదివారం సైతం రిలేక్స్ మూడు లోనే ఉన్నారు అధికారులు. ఎన్నికల సందడి తో ఆదివారం కూడా బిజీ బిజీగా ఉండాల్సిన కలెక్టరేట్ తాళాలు వేసి బోసు పోతూ కనిపించింది.

విశాఖ జిల్లాలో విశాఖపట్నం ,అనకాపల్లి, నర్సీపట్నం ,పాడేరు 4 రెవిన్యూ డివిజన్లు ఉన్నాయి. మొత్తం 39 మండలాల పరిధిలో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. జిల్లాలో 969 పంచాయతీలు, 9500 కి పైగా వార్డులు ఉన్నాయి. 17 లక్షల 84 వేల మంది ఓటర్లు ఉన్నారు. మొదటి విడతలో విశాఖ తర్వాత అనకాపల్లి ,ఆ తరువాత నర్సీపట్నం చివరగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతము, ఏజెన్సీ అయిన పాడేరు సబ్ డివిజన్ పరిధిలో ఎన్నికలు జరగనున్నాయి.

ఇక, విశాఖ జిల్లాలో ఎన్నికలు నిర్వహించాలి అంటే దాదాపు 30 వేల మంది వరకు ఉద్యోగులు ,సిబ్బంది అవసరం ఉంటుంది. కానీ ఉద్యోగ సంఘాలు కరోనా వ్యాక్సినేషన్ పూర్తయ్యేంత వరకు తాము ఎన్నికల విధుల్లో పాల్గొనలేమని స్పష్టం చేస్తున్నారు ఉద్యోగులు. తమ ప్రాణాలతో చెలగాటం మాట్లాడని ఇదే వాదనను కోర్టు లో కూడా వినిపిస్తామని ఉద్యోగ సంఘాల నేతలు అంటున్నారు.

అయితే, ప్రభుత్వానికి ,రాష్ట్ర ఎన్నికల సంఘానికి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనడంతో ఇప్పుడు పంచాయతీ ఎన్నికల పై ప్రతిష్టంభన నెలకొంది. దీంతో పంచాయతీ ఎన్నికలపై సోమవారం వెలువడనున్న సుప్రీంకోర్టు తీర్పు శిరోధార్యం కానుంది. ఈ తీర్పుతో ఉత్కంఠకు తెర పడవచ్చని అంతా భావిస్తున్నారు.

Read Aslo… National Voters’ Day 2021: ఇవాళ జాతీయ ఓటరు దినోత్సవం.. ‘హలో ఓటర్స్​’ను ఆవిష్కరించనున్న కేంద్ర న్యాయ శాఖ మంత్రి