AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Land Values: రాష్ట్ర ప్రజలకు బిగ్‌ అలర్ట్.. ఆ ప్రాంతాల్లో మరోసారి భూములు మార్కెట్ విలువ పెంపు!

ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ ప్రాంతాల్లో భూముల మార్కెట్ విలువలను సవరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సవరించిన విలువలను ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అమలు చేయాలని రెవెన్యూ శాఖ ఆదేశాలు జారీ చేసింది. నిబంధనల ప్రకారం పట్టణ ప్రాంతాల్లో భూముల విలువలను ఏటా సవరించుకునే అవకాశం ఉండగా, గ్రామీణ ప్రాంతాల్లో రెండేళ్లకోసారి ఈ మార్పులు చేయవచ్చు. నిర్మాణ విలువలైతే ప్రతి ఏడాది పెంచుకునే వెసులుబాటు ఉంది.

AP Land Values: రాష్ట్ర ప్రజలకు బిగ్‌ అలర్ట్.. ఆ ప్రాంతాల్లో మరోసారి భూములు మార్కెట్ విలువ పెంపు!
Ap Urban Land Values Revised
Eswar Chennupalli
| Edited By: |

Updated on: Jan 22, 2026 | 9:17 PM

Share

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతేడాది ఫిబ్రవరిలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో భూముల మార్కెట్ విలువలను సవరించిన సంగతి తెలిసిందే. ఈసారి మాత్రం పట్టణ ప్రాంతాలకే పరిమితమయ్యేలా నిర్ణయం తీసుకున్నారు. YSRCP ప్రభుత్వ హయాంలో కొన్ని ప్రాంతాల్లో భూముల విలువలను శాస్త్రీయ ప్రాతిపదిక లేకుండా భారీగా పెంచినట్టు అప్పట్లో విమర్శలు వచ్చాయి. ఆ పరిస్థితిని పరిగణనలోకి తీసుకున్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా కొన్ని చోట్ల విలువలను తగ్గించింది. మరికొన్ని ప్రాంతాల్లో యథాతథ స్థితిని కొనసాగించగా, అభివృద్ధి వేగంగా జరుగుతున్న ప్రాంతాల్లో మాత్రం కొంత మేర పెంపు చేసింది.

పట్టణ ప్రాంతాల్లో

తాజాగా ఇప్పుడు పట్టణ ప్రాంతాల భూముల విలువల సవరణకు మాత్రమే నిర్ణయం తీసుకోవడం రాజకీయంగా, ఆర్థికంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. సవరించిన మార్కెట్ విలువలను ఫిబ్రవరి 1 నుంచి అమలు చేసేందుకు అనుమతి ఇస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మార్కెట్ విలువల సవరణను స్థానిక పరిస్థితులకు అనుగుణంగా జిల్లాస్థాయిలో జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలోని కమిటీ నిర్ణయించనుంది. ప్రాంతంలో జరిగిన అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల ప్రవాహం, రహదారి అనుసంధానం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకోవాలని ఆదేశాల్లో స్పష్టం చేశారు. అలాగే మార్కెట్ విలువల వ్యవస్థను ఆధునికీకరించే దిశగా రెండు నెలల్లో సమగ్ర విధానాన్ని రూపొందించాలని సూచించారు.

రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ ఆదాయం ఇలా.

రిజిస్ట్రేషన్ ఆదాయాల పరంగా చూస్తే, ప్రభుత్వానికి ఈ నిర్ణయం కీలకంగా మారే అవకాశం ఉంది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో రిజిస్ట్రేషన్ రుసుముల రూపంలో రూ.8,843 కోట్లు వసూలైనట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. 2025–26 సంవత్సరానికి రూ.11,221 కోట్ల లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించింది. జనవరి 9 నాటికి ఇప్పటికే రూ.8,391 కోట్లు వసూలయ్యాయి. సగటు వృద్ధి రేటు 27.98 శాతంగా ఉంది. స్టాంపు రుసుమ మినహాయింపుల రూపంలో రూ.714 కోట్ల వరకు రాయితీ ఇచ్చినట్టు రెవెన్యూ శాఖ వర్గాలు తెలిపాయి. ఈ గణాంకాలు మార్కెట్ విలువల సవరణతో ఆదాయ వృద్ధికి మరింత అవకాశముందని సూచిస్తున్నాయి.

రెవెన్యూ మంత్రి ఏం చెప్పారంటే

ఈ అంశంపై రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ… ప్రభుత్వ విలువకు, వాస్తవ మార్కెట్ విలువకు మధ్య ఉన్న గ్యాప్‌ను తగ్గించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో భూముల విలువలను పెంచాలని నిర్ణయించామని, ఎంత పెంచాలన్నది స్థానికంగా జరిగిన అభివృద్ధి, పెద్ద ఎత్తున వస్తున్న పెట్టుబడులను బట్టి నిర్ణయిస్తామని చెప్పారు. రాజధాని గ్రామాల విషయంలో గత ఏడాది భూముల విలువలను పెంచలేదని, ఈ ఏడాది కూడా ముఖ్యమంత్రితో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.

మొత్తంగా చూస్తే, పట్టణ ప్రాంతాల్లో భూముల మార్కెట్ విలువల సవరణ నిర్ణయం రియల్ ఎస్టేట్ రంగం, ప్రభుత్వ ఆదాయాలు, ప్రజల లావాదేవీలపై ప్రభావం చూపనుంది. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రానున్న ఈ సవరణలు పట్టణ భూముల లావాదేవీలకు కొత్త దిశను చూపనున్నాయన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.