
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లోన్ యాప్స్, మైక్రో ఫైనాన్స్ ఆగడాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. వారి వేధింపులు తాళలేక, చేసేదేంలేక ఇప్పటికే చాలామంది ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. లోన్ యాప్స్ వేధింపులతో ఇటీవల పలువురు ఆత్మహత్య చేసుకున్నారు. కాగా.. ఈ వరుస ఘటనలపై ఏపీ ప్రభుత్వం సీరియస్ అయింది. రాష్ట్రంలో లోన్ యాప్ సంఘటనల గురించి హోంమంత్రి తానేటి వనిత శుక్రవారం ఆరా తీశారు. పోలీస్ ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడి హోం మినిస్టర్ వనిత వివరాలు తెలుసుకున్నారు. లోన్ యాప్ మరణాలకు సంబంధించి నివేదిక ఇవ్వాలని ఉన్నతాధికారులను హోంమంత్రి ఆదేశించారు. లోన్ యాప్ నిర్వాహకుల ఆగడాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా పోలీసులను ఆదేశించారు.
ఆర్బీఐ నిబంధనలు పాటించని లోన్ యాప్‌లపై చర్యలు తీసుకోవాలని హోంమంత్రి వనిత అధికారులకు ఆదేశించారు. ఆన్ లైన్ లోన్ పేరుతో ప్రజలను వేధింపులకు గురిచేస్తే ఉపేక్షించేది లేదని హోంమంత్రి హెచ్చరించారు. లోన్ యాప్ నిర్వాహకుల మాయలో పడి మోసపోవొద్దని హోం మినిస్టర్ ప్రజలకు సూచించారు. లోన్ యాప్ నిర్వాహకుల నుంచి బెదిరింపుల కాల్స్ వస్తే సంబంధిత పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయాలని హోంమంత్రి ఈ సందర్భంగా సూచించారు. నిర్వాహకుల వేధింపులకు భయపడి క్షణికావేశంలో ఆత్మహత్యలకు పాల్పడొద్దని హోంమంత్రి సూచించారు.
ఏపీలో గత కొన్ని రోజుల నుంచి లోన్ యాప్ ఆగడాలు పెరుగుతున్నాయి. వేలల్లో రుణాలు ఇచ్చి.. లక్షల్లో వసూలు చేస్తున్న ఘటనలు, అధికంగా వడ్డీలు తీసుకున్న సైతం వెలుగులోకి వచ్చాయి. ఈ డబ్బు మొత్తం కట్టాల్సిందేనని, లేదంటే న్యూడ్ వీడియోలు పెడతామని బెదిరిస్తుండటంతో చాలామంది గత్యంతరం లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
ఈ ఘటనలు పెరగడంతో రాష్ట్ర ప్రభుత్వం లోన్ యాప్‌లపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయం కూడా తీసుకుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి లేని లోన్ యాప్‌లపై కఠినంగా వ్యవహరించాలని అధికారులకు ఆదేశాలు సైతం జారీచేసింది. అయినప్పటికీ.. లోన్ యాప్స్ వేధింపులు పెరిగిపోతుండటం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది.
మరిన్ని ఏపీ వార్తల కోసం..