APSRTC Jobs: ఏపీఎస్ ఆర్టీసీలో మరోమారు కారుణ్య నియామకాలు..1538 పోస్టుల భర్తీకి సర్కార్ అనుమతి..
2020 జనవరి 1 నుంచి 2023 ఆగస్టు 15 వరకు 1,538 మంది ఆర్టీసీ ఉద్యోగులు చనిపోయారు. వారి కుటుంబాల్లో అర్హులైన వారసులకు కారుణ్య నియామకాల కింద మూడు దశల్లో ఉద్యోగాలు కల్పించనున్నారు. మొదటి దశలో కలెక్టర్ల ఆధ్వర్యంలోని జిల్లా కమిటీలు ఉద్యోగాలు కల్పిస్తాయి. ఆయా జిల్లాల్లో గ్రామ, వార్డు సచివాలయాలు, ఇతర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల్లో వారిని నియమిస్తారు. జిల్లా కమిటీలు గుర్తించిన పోస్టులను భర్తీ చేయగా మిగిలిన వారికి ఆర్టీసీలో ఉద్యోగాలు కల్పిస్తారు. అప్పటికీ ఇంకా అర్హులు..
అమరావతి, ఆగస్టు 17: ఏపీఎస్ ఆర్టీసీ మరోసారి కారుణ్య నియామకాలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. సర్వీసులో ఉండగా మరణించిన ఆర్టీసీ సిబ్బంది కుటుంబాలకు ఊరట కల్పిస్తూ అర్హులైన వారసులకు కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు కల్పించనున్నారు. 2016 నుంచి 2020 జనవరి వరకు మృతి చెందిన 311 మంది ఆర్టీసీ సిబ్బంది వారసులకు కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు ఇచ్చేందుకు సీఎం జగన్ ఇప్పటికే అనుమతించారు.
ఆ ఉద్యోగాలను భర్తీ చేసిన ఆర్టీసీ యాజమాన్యం ప్రస్తుతం వారికి శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. తాజాగా 2020 జనవరి 1 నుంచి ఇప్పటివరకు మరణించిన ఆర్టీసీ సిబ్బంది వారసులకు కూడా కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు ఇవ్వాలని సీఎం జగన్ నిర్ణయించారు. ఈమేరకు రెండో విడత కారుణ్య నియామకాలకు ఆర్టీసీ కార్యాచరణ చేపట్టింది.
2020 జనవరి 1 నుంచి 2023 ఆగస్టు 15 వరకు 1,538 మంది ఆర్టీసీ ఉద్యోగులు చనిపోయారు. వారి కుటుంబాల్లో అర్హులైన వారసులకు కారుణ్య నియామకాల కింద మూడు దశల్లో ఉద్యోగాలు కల్పించనున్నారు. మొదటి దశలో కలెక్టర్ల ఆధ్వర్యంలోని జిల్లా కమిటీలు ఉద్యోగాలు కల్పిస్తాయి. ఆయా జిల్లాల్లో గ్రామ, వార్డు సచివాలయాలు, ఇతర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల్లో వారిని నియమిస్తారు. జిల్లా కమిటీలు గుర్తించిన పోస్టులను భర్తీ చేయగా మిగిలిన వారికి ఆర్టీసీలో ఉద్యోగాలు కల్పిస్తారు. అప్పటికీ ఇంకా అర్హులు మిగిలిపోతే వారికి మళ్లీ జిల్లా కమిటీల ద్వారా ఉద్యోగాలు కల్పిస్తారు. ఇప్పటికే మొదటి దశగా జిల్లా కమిటీల ద్వారా కారుణ్య నియామకాల ప్రక్రియను చేపట్టారు. మిగిలిన ఉద్యోగాల కల్పనకు కూడా ఆర్టీసీ సమాయత్తం అవుతోంది.
కారుణ్య నియామకాల కోసం ఆగస్టు 15 నాటికి ఆర్టీసీలో అందుబాటులో ఉన్న ఉద్యోగాలను గుర్తించారు. రాష్ట్రంలో 12 ఆర్టీసీ రీజియన్ల వారీగా మొత్తం 715 ఉద్యోగాలను గుర్తించారు. వీటిలో డ్రైవర్ పోస్టులు 346, కండక్టర్ పోస్టులు 90, అసిస్టెంట్ మెకానిక్ పోస్టులు 229, ఆర్టీసీ కానిస్టేబుల్ పోస్టులు 50 ఉన్నాయి. కారుణ్య నియామకాల కింద ఈ పోస్టులను నెల రోజుల్లో భర్తీ చేయాలని ఆర్టీసీ భావిస్తోంది. ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమం, సంస్థ అభివృద్ధి పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృత నిశ్చయంతో ఉన్నారని ఆర్టీసీ ఎండీ సీహెచ్. ద్వారకా తిరుమలరావు తెలిపారు. అర్హులైన వారసులకు కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు కల్పించే చర్యలు వేగంగా చేస్తున్నామన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.