AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: గుడ్ న్యూస్.. ఆంధ్రాలో కొత్త పింఛన్‌లు వీరికే.. ఇదిగో పూర్తి వివరాలు..

ఏపీలోని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న పేదలకు ఊరటనిచ్చే కీలక నిర్ణయం తీసుకుంది. కిడ్నీ, లివర్, గుండె సంబంధిత తీవ్ర సమస్యలతో బాధపడుతున్న వారికి 895 కొత్త పింఛన్‌లు మంజూరు చేసింది. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఎన్టీఆర్ భరోసా పథకం కింద డయాలసిస్ చేయించుకుంటున్న వారు, కిడ్నీ, కాలేయం, గుండె మార్పిడి చేసుకున్నవారు, ద్వైపాక్షిక బోదకాలు, కుష్టు వంటి వ్యాధులతో బాధపడుతున్న అర్హులైన పేదలను ఈ పింఛన్ పరిధిలోకి తీసుకొచ్చారు.

Andhra Pradesh: గుడ్ న్యూస్.. ఆంధ్రాలో కొత్త పింఛన్‌లు వీరికే.. ఇదిగో పూర్తి వివరాలు..
Ntr Bharosa Scheme
Eswar Chennupalli
| Edited By: |

Updated on: May 14, 2026 | 6:20 PM

Share

ఏపీలో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న పేదలకు ఆర్థిక భరోసా కల్పించే దిశగా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కిడ్నీ, లివర్, గుండె సంబంధిత తీవ్ర సమస్యలతో బాధపడుతున్న వారికి 895 కొత్త పెన్షన్లు మంజూరు చేసింది. పేదలు వైద్య ఖర్చులతో ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద డయాలసిస్ చేయించుకుంటున్న కిడ్నీ బాధితులు, కిడ్నీ, కాలేయం, గుండె మార్పిడి చేసుకున్న వారు, అలాగే ద్వైపాక్షిక బోదకాలు, కుష్టు వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న అర్హులైన పేదలను ఈ కొత్త పెన్షన్ల పరిధిలోకి తీసుకొచ్చారు.

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 895 మందికి ఈ పెన్షన్లు మంజూరు అయ్యాయి. దీంతో ప్రభుత్వంపై ప్రతి నెలా రూ.86.34 లక్షల అదనపు భారం పడుతుందని మంత్రి వివరించారు. ఈ పెన్షన్లు పొందుతున్న వారికి ప్రతి నెలా 1వ తేదీన స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు సిబ్బంది వారి ఇళ్లకే వెళ్లి నగదు అందజేస్తారు. పేదలు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా నేరుగా వారి వద్దకే సేవలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. వైద్య చికిత్సలతో ఇప్పటికే ఆర్థికంగా నలిగిపోయిన కుటుంబాలకు ఈ పెన్షన్ కొంత ఊరటనిస్తుందని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా పథకం కింద ప్రస్తుతం లక్షలాది మందికి వివిధ కేటగిరీలలో పెన్షన్లు అందుతున్నాయి. వృద్ధులు, వికలాంగులు, విధవలు, చేనేత కార్మికులు, మత్స్యకారులు, ఒంటరి మహిళలు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు ఇలా విభిన్న వర్గాల వారికి ప్రభుత్వం నెలనెలా ఆర్థిక సాయం అందిస్తోంది. గత కొన్నేళ్లుగా పెన్షన్ మొత్తాలను దశలవారీగా పెంచుతూ పేదలకు భరోసా కల్పిస్తోంది.

ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతినెలా సుమారు 64 లక్షల సామాజిక భద్రతా పెన్షన్ల కోసం 2700 కోట్ల వరకు ఖర్చవుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్ మొత్తాన్ని గణనీయంగా పెంచడంతో పాటు అర్హులైన లబ్ధిదారుల సంఖ్యను కూడా విస్తరించింది. అధికారిక లెక్కల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా నెలకు సుమారు రూ.2,700 కోట్లకు పైగా పెన్షన్ల రూపంలో పంపిణీ జరుగుతోంది. సంవత్సరానికి ఇది రూ.32,000 కోట్లకు పైగా వ్యయం అవుతోంది.

ఇప్పటికే పలు దఫాలుగా కొత్త లబ్ధిదారులను చేర్చడం ద్వారా ప్రభుత్వం తన సామాజిక భద్రతా వ్యయాన్ని పెంచింది. తాజాగా మరో 895 మందిని చేర్చడంతో ఈ భారం మరింత పెరిగింది. అయినప్పటికీ పేదలకు అవసరమైన సాయం అందించడంలో ప్రభుత్వం వెనుకడుగు వేయబోదని మంత్రి స్పష్టం చేశారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు సాధారణంగా అధిక వైద్య ఖర్చులు భరించాల్సి వస్తుంది. డయాలసిస్, అవయవ మార్పిడి వంటి చికిత్సలు లక్షల రూపాయలు ఖర్చవుతాయి. అలాంటి కుటుంబాలు అప్పుల బారిన పడే పరిస్థితి వస్తుంది. ఈ నేపథ్యంలో వారికి నెలనెలా పెన్షన్ రూపంలో కొంత ఆర్థిక సాయం అందించడం ద్వారా భారాన్ని తగ్గించడమే ప్రభుత్వ లక్ష్యంగా ఉంది.

గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా ఈ సాయం ఎంతో ఉపశమనం కలిగిస్తోందని అధికారులు చెబుతున్నారు. స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు సిబ్బంది నేరుగా ఇళ్లకే వెళ్లి పెన్షన్లు అందించడం వల్ల లబ్ధిదారులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా సౌకర్యంగా సాయం పొందుతున్నారు. పింఛన్ పంపిణీ ప్రక్రియలో పారదర్శకత, సమయపాలన పాటిస్తున్నామని అధికారులు తెలిపారు. మొత్తంగా చూస్తే, సామాజిక భద్రతను మరింత బలోపేతం చేస్తూ ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయం పేద కుటుంబాలకు కొంత ఊరటనిస్తుంది. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఇది ఒక ఆర్థిక అండగా మారనుంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us