AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amaravati Capital: అమరావతి రాజధానిలో మలి విడత భూసేకరణకు ఏపీ ప్రభుత్వం సిద్దం..!

నవ్యాంధ్ర రాజధానిని నభూతో న భవిష్యత్ అన్న రేంజ్‌లో నిర్మిస్తామంటోంది కూటమి ప్రభుత్వం. ప్రధాని మోదీతో అమరావతి రీ లాంచ్‌కు ప్లాన్ చేసిన ఏపీ సర్కార్ రూ.77వేల కోట్ల పనులు ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే రాజధానిలో రెండో విడత భూసేకరణకు ఏపీ ప్రభుత్వం సిద్దమైంది.

Amaravati Capital: అమరావతి రాజధానిలో మలి విడత భూసేకరణకు ఏపీ ప్రభుత్వం సిద్దం..!
Amaravati
T Nagaraju
| Edited By: Balaraju Goud|

Updated on: Apr 26, 2025 | 4:51 PM

Share

నవ్యాంధ్ర రాజధానిని నభూతో న భవిష్యత్ అన్న రేంజ్‌లో నిర్మిస్తామంటోంది కూటమి ప్రభుత్వం. ప్రధాని మోదీతో అమరావతి రీ లాంచ్‌కు ప్లాన్ చేసిన ఏపీ సర్కార్ రూ.77వేల కోట్ల పనులు ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే రాజధానిలో రెండో విడత భూసేకరణకు ఏపీ ప్రభుత్వం సిద్దమైంది. భూ సమీకరణ విధానంలో భూములు ఇచ్చేందుకు సిద్దమైన గ్రామాల్లో సభలు నిర్వహిస్తుంది. మరో పది వేల ఎకరాలను మలి విడతలో సమీకరించుకునేందుకు ఆయా గ్రామాల్లో ప్రాధమిక సమావేశాలను పూర్తి చేసింది. అమరావతి మండలంలోని మూడు గ్రామాల సభల్లో భూములు ఇచ్చేందుకు సిద్దమే అంటూనే పలు సమస్యలను ప్రభుత్వం ముందుంచారు. అత్యధికులు అభిప్రాయం ప్రకారమే ముందడగు వేస్తామని రాష్ట్ర ప్రభుత్వం అంటుంది.

అమరావతి రాజధాని నిర్మాణం కోసం గతంలో ముప్పై నాలుగు వేల ఎకరాలను ప్రభుత్వం సేకరించింది. ఆ భూముల్లో అభివృద్ది పనులు కూటమీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఊపందుకున్నాయి. ఇదే సమయంలో రాజధానిలో రైల్వే లైన్ ఏర్పాటు, ఇన్నర్ రింగ్ రోడ్డు, పోలవరం, బనకచర్ల ప్రాజెక్ట్‌ల కోసం అమరావతి మండలంలోని పలు గ్రామాల్లో భూసేకరణ చేయాల్సి ఉంది.

అయితే అమరావతి మండలంలోని వైకుంఠపురం, యండ్రాయి, పెద మద్దూరు, కర్లపూడి గ్రామాల్లో రైతులు భూములిచ్చేందుకు ముందుకొచ్చారు. ఈ క్రమంలోనే రైతులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకునేందుకు ప్రభుత్వం గ్రామసభలు నిర్వహించింది. ఈ నాలుగు గ్రామాల్లో కలిసి పది వేల ఎకరాల భూమి ఉంది. వీటిల్లో వైకుంఠపురం, యండ్రాయి, పెద మద్దూరు గ్రామాల్లో గ్రామ సభలు పూర్తయ్యాయి. అత్యధిక శాతం మంది రైతులు భూములిచ్చేందుకు సిద్దంగానే ఉన్నట్లు చెప్పారు. ఈ గ్రామ సభల్లో పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ తో పాటు సత్తెనపల్లి ఆర్డివో రమాకాంత్ రెడ్డి పాల్గొన్నారు. భూసేకరణ విధానంలో భూములిస్తే రైతులు నష్టపోతారని భూ సమీకరణ విధానంలో పొలాలు అప్పగిస్తే మేలు జరుగుతుందన్న అభిప్రాయాన్ని ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ వ్యక్తం చేశారు.

అయితే రాజధాని అవసరాల కోసం భూములిచ్చేందుకు తాము సిద్దంగానే ఉన్నామని, తమ డిమాండ్స్ కూడా ప్రభుత్వం విని పరిష్కారం చూపాలని రైతులు అధికారులతో చెప్పారు. గ్రామ కంఠం నుండి 500 మీటర్ల వెలుపలనే భూ సమీకరణ చేయాలన్నారు. రోడ్డు వెంట భూముల అధిక విలువైనవని వాటికి రాజధానిలో ఇచ్చిన జరీబు భూముల ప్యాకేజ్ ఇవ్వాలన్నారు. తమకు కోర్ క్యాపిటల్లోనే భూ కేటాయింపులు ఉండేలా చూడాలన్నారు. వైకుంఠపురంలో ఇనాం భూముల సమస్యను ముందుగా పరిష్కరించి ఆ తర్వాతే భూ సమీకరణ చేయాలని కొంతమంది సూచించారు.

మొత్తం మీద రైతుల నుండి సానుకూలత వ్యక్తం కావడంతో ప్రభుత్వం ముందడుగు వేయనుంది. ఈ నాలుగు గ్రామాల ద్వారానే దాదాపు పదివేల ఎకరాల భూమి ప్రభుత్వానికి సమకూరనుంది. అయితే రెండో విడతలో భాగంగా ఏకంగా నాలుగు వేల ఎకరాలు సేకరించాలన్న ఉద్దేశం ప్రభుత్వానికి ఉన్నట్లు వచ్చిన వార్తల నేపథ్యంలో రానున్న రోజుల్లో ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందోనని ఆయా గ్రామాల రైతులు ఇప్పటి నుండే చర్చించుకుంటున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..