రేషన్‌ పంపిణీ పూర్తయ్యే వరకూ గ్రామ, వార్డు వాలంటీర్లు వాహనం వెంటే.. ఇంకా అదనపు బాధ్యతలు ఏమేమిటంటే..

Ration Distribution in AP : రేషన్‌ పంపిణీ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వార్డు, గ్రామ వాలంటీర్లకు అదనపు బాధ్యతలు అప్పగించింది...

  • Venkata Narayana
  • Publish Date - 9:53 pm, Thu, 8 April 21
రేషన్‌ పంపిణీ పూర్తయ్యే వరకూ గ్రామ, వార్డు వాలంటీర్లు వాహనం వెంటే.. ఇంకా అదనపు బాధ్యతలు ఏమేమిటంటే..

Ration Distribution in AP : రేషన్‌ పంపిణీ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వార్డు, గ్రామ వాలంటీర్లకు అదనపు బాధ్యతలు అప్పగించింది. గ్రామ, పట్టణ వార్డుల్లో రేషన్ ప్రక్రియ పూర్తయ్యే వరకు వాలంటీర్లు రేషన్ పంపిణీ వాహనం వెంటే ఉండాలని ఆదేశాలు జారీచేసింది. ఇంటింటికీ రేషన్‌ పంపిణీ సమయంలో మొబైల్‌ వాహనంలోని ఈ-పోస్‌ యంత్రాన్ని నిర్వహించాల్సిన బాధ్యత వాలంటీర్లదేనని పేర్కొంది. కార్డుదారుల నుంచి వేలిముద్రలను వాలంటీర్లే తీసుకోవాలి.. తమ క్లస్టర్‌ పరిధిలో నిత్యావసరాల పంపిణీ పూర్తయ్యే వరకు వాహనం వద్దే అందుబాటులో ఉండాలని పేర్కొంది.

ఈ మేరకు వాలంటీర్లకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ గ్రామ, వార్డు వాలంటీర్లు, సచివాలయాల శాఖ డైరెక్టర్‌ నారాయణ్‌ భరత్‌ గుప్తా పలు సూచనలు చేశారు. అయితే, రేషన్ సరుకుల లోడింగ్‌, అన్‌లోడింగ్‌, మోసుకెళ్లడం తదితర పనులేవీ చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. మొబైల్‌ వాహనాల ద్వారా నిత్యావసరాల పంపిణీ సజావుగా సాగేందుకు వీలుగా.. పురపాలక కమిషనర్లు, ఎంపీడీవోలకు సూచనలు చేయాలని జిల్లాల్లోని సంయుక్త కలెక్టర్లను గుప్తా కోరారు. ఇక, రేషన్ సరుకుల పంపిణీ విషయంలో వాలంటీర్ల మరిన్ని బాధ్యతలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

● తమ క్లస్టర్‌ పరిధిలోని ఇళ్లకు రేషన్‌ పంపిణీ వాహనం ఏ రోజు, ఏ సమయంలో వస్తుందో తెలియజేస్తూ కూపన్‌ను కార్డుదారులకు అందించాలి.

● వాహనం రావడానికి ఒక రోజు ముందు మళ్లీ వారందరికీ గుర్తు చేయాలి.

● నిత్యావసరాల పంపిణీ సమయంలో వాహనం వెంటే ఉండాలి.

● సమస్యల పరిష్కారానికి గ్రామ, వార్డు రెవెన్యూ అధికారులకు సంబంధాలు నెరపాలి.

● బయోమెట్రిక్‌ (వేలిముద్రలు పని చేయకపోతే) ఫ్యూజన్‌ ఫింగర్‌ విధానంలో ప్రయత్నించాలి.

● ప్రతి రోజూ సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు వార్డు సచివాలయం వద్ద రేషన్‌ వాహనం నిలిపి నిత్యావసరాలు అందిస్తారు. రేషన్‌ తీసుకోని కార్డుదారులు ఎవరైనా ఉంటే.. అక్కడికి వెళ్లి తీసుకోవచ్చనే విషయాన్ని వారికి తెలియజేయాలి.

● పోర్టబిలిటీ విధానంలో రేషన్‌ తీసుకోవడంపై కార్డుదారులకు అవగాహన కల్పించాలి.

● తమ నివాస ప్రాంతం లోని వాహనాల వద్దనే రేషన్‌ తీసుకోవాలనే విషయాన్ని.. మ్యాపింగ్‌ కాని కార్డుదారులకు వివరించాలి.

● పింఛన్‌ పంపిణీకి ఇబ్బంది లేకుండా తమ క్లస్టర్‌ పరిధిలో నిత్యావసరాల పంపిణీని రెండు రోజుల్లో పూర్తి చేయాలి.

Read also : సంక్షేమ పథకాలు, అభివృద్ధి, ప్రభుత్వ దార్శనికత, ఇచ్చిన వాగ్దానాలను.. ఇలా నిలబెట్టుకున్నానంటూ జగన్ లేఖ