Andhra News: గుళ్లకు వెళ్లే వారికి బిగ్ అలర్ట్.. ఇకపై ఆలయాల్లో ఈ రూల్స్ పాటించకపోతే అంతే!
మీరు గుడికి వెళ్లి ఫొటోలు తీస్తున్నారా? గుడిలో రీల్స్ చేస్తున్నారా? జాగ్రత్త.. ఇకపై అలా చేస్తే మీరు తప్పకుండా చట్టపరమైన సమస్యలు ఎదుర్కోవలసిందే. అవును పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రముఖ దేవాలయాల్లో గర్భగుడిలోని మూలవిరాట్ విగ్రహాలను ఫొటోలు, వీడియోలు తీయడంపై నిషేదాన్ని విధిస్తూ దేవాదాయ ధర్మాదాయ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.

ఏలూరు జిల్లా, ఆగస్ట్ 22: పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రముఖ దేవాలయాల్లో గర్భగుడిలోని మూలవిరాట్ విగ్రహాలను ఫొటోలు, వీడియోలు తీయడంపై దేవాదాయ ధర్మాదాయ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఆయాల్లో ఫోటోలు తీయాడంపై పూర్తి స్థాయి నిషేధం విధించింది. ఆలయాల ఆధ్యాత్మిక పవిత్రతను పరిరక్షించడంతో పాటు ఆగమశాస్త్ర నియమాలను పక్కాగా అమలు చేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని.. భక్తులు ఈ విషయాలను గుర్తుంచుకోవాలని సూచించారు.
గర్భాలయంలోని మూలవిరాట్ విగ్రహాలకు ప్రాణప్రతిష్ఠ, యంత్ర స్థాపన జరిగి ఉంటాయని.. కెమెరా ఫ్లాష్ లైట్లు, డిజిటల్ చిత్రీకరణలు ఆ దివ్య శక్తుల ప్రభావం, ఆగమ నిబంధనలకు విరుద్ధమని పండితులు స్పష్టం చేస్తున్నారు. భక్తులు దర్శన సమయంలో మూలవిరాట్ చిత్రాలు తీసి రీల్స్ చేయడం, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వల్ల ఇతర భక్తుల ఏకాగ్రత, ఆలయాల్లోని నిశ్శబ్ద వాతావరణం దెబ్బతింటున్నాయన్నారు. ప్రాచీన, చారిత్రక విగ్రహాల వివరాలు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో విస్తృతంగా ప్రచారం కావడం భద్రతా పరంగా కూడా సమస్యాత్మకంగా మారుతోందని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.
కీలక మార్గదర్శకాలు అన్ని కేటగిరీల ఆలయాలకు వర్తింపు
రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు జిల్లాలోని 6(A), 6(B), 6(C) వర్గీకరణ పరిధిలోకి వచ్చే చిన్న, పెద్ద ఆలయాలన్నింటిలోనూ ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వచ్చాయని అధికారులు తెలిపారు. అయితే అయాల్లోని మూలవిరాట్‌కు మాత్రమే ఈ నిషేధం వర్తిస్తుందని.. ఆలయ ప్రాంగణంలో, కల్యాణోత్సవాలు లేదా రథోత్సవాల్లో ప్రదర్శించే ఉత్సవ మూర్తుల ఫొటోలు, వీడియోలు తీసుకోవడానికి అనుమతి ఉందన్నారు. భక్తులకు అవగాహన కల్పించేందుకు ప్రతి ఆలయ ప్రవేశ ద్వారం, క్యూలైన్లు, గర్భగుడి ముఖద్వారం వద్ద “ఫొటోగ్రఫీ నిషేధం” బోర్డులను ఏర్పాటు చేస్తున్నామన్నారు.
ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
నిబంధనలను అతిక్రమించి రహస్యంగా ఫొటోలు లేదా వీడియోలు తీస్తే చట్టపరమైన చర్యలు తప్పవని పశ్చిమ గోదావరి జిల్లా దేవాదాయ శాఖ అధికారి వి. హరి సూర్య ప్రకాష్ హెచ్చరించారు. ఆలయ సిబ్బంది, అర్చకులు కూడా ఈ నియమాలను పర్యవేక్షించాలని ఆదేశించారు. భక్తులు మొబైల్ మోజులో పడకుండా, ఆలయ సంప్రదాయాలను గౌరవిస్తూ భక్తిశ్రద్ధలతో దైవ దర్శనం చేసుకోవాలని సూచించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
