Amaravati ORR: అమరావతి ఔటర్ రింగ్‌రోడ్డు ప్రాజెక్టులో భారీ మార్పులు.. ఇదిగో కొత్త డిజైన్
Key Changes in Amaravati 189 Km ORR Design : అమరావతి నగర రవాణా రంగానికి ఎంతో కీలకమైన ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణ ప్రణాళికల్లో భారీ మార్పులు జరిగాయి. ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని తగ్గించాలన్న NHAI ఆదేశాలతో గతంలో ప్రతిపాధించిన 19 ఇంటర్ చేంజ్‌లను 17కు కుదించారు. అలాగే తెనాలి-కాజ అనుసంధాన రహదారిని రద్దు చేశారు. ప్రాజెక్టులో ఇంకా ఏఏ మార్పులు జరిగాయో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

అమరావతి నగర రవాణా రంగానికి ఎంతో కీలకమైన ఔటర్ రింగ్ రోడ్ (ORR) నిర్మాణ ప్రణాళికల్లో అధికారులు కొన్ని కీలక మార్పులు చేశారు. ప్రాజెక్ట్ అంచనా వ్యయాన్ని తగ్గించే దిశగా నిబంధనలను సవరించి, మొత్తంగా 17 చోట్ల ఇంటర్‌ఛేంజ్‌లను ఖరారు చేశారు. 189.93 కిలోమీటర్ల పొడవుతో, ఆరు వరుసలతో అత్యాధునిక హంగులతో ఈ యాక్సెస్ కంట్రోల్డ్ ఓఆర్‌ఆర్‌ను నిర్మించనున్నారు. ఈ రింగ్ రోడ్డులోకి వాహనాలు ప్రవేశించాలన్నా లేదా బయటకు వెళ్లాలన్నా కేవలం ఈ ఇంటర్‌ఛేంజ్‌ల వద్ద మాత్రమే అవకాశం ఉంటుంది.
రూ.30,491 కోట్లకు తగ్గిన ప్రాజెక్ట్ వ్యయం
ప్రాజెక్ట్ ఖర్చును తగ్గించాలంటూ NHAI అధికారులు ఇచ్చిన ఆదేశాల మేరకు గతంలో ప్రతిపాదించిన 19 ఇంటర్‌ఛేంజ్‌ల సంఖ్యను 17కు కుదించారు. అలాగే, ఓఆర్‌ఆర్‌లో కేవలం లోపలి వైపు మాత్రమే సర్వీస్ రోడ్లు ఉండేలా మార్పులు చేశారు. దీనికితోడు తెనాలి సమీపం నుంచి కాజ వరకు ఉన్న 17.5 కిలోమీటర్ల అనుసంధాన రహదారి ప్రతిపాదనను పక్కన పెట్టారు. ఈ మార్పుల ఫలితంగా ప్రాజెక్ట్ వ్యయం గతంలో అంచనా వేసిన రూ.38,450 కోట్ల నుంచి రూ.30,491 కోట్లకు భారీగా తగ్గింది.
ఇంటర్‌ఛేంజ్‌ల రూపకల్పన వివరాలు
ఈ ఓఆర్‌ఆర్ మార్గంలో జాతీయ రహదారులు క్రాస్ అయ్యే ప్రాంతాల్లో ప్రయాణం మరింత సులభంగా సాగేందుకు 8 చోట్ల ‘డబుల్ ట్రంపెట్’ ఇంటర్‌ఛేంజ్‌లను నిర్మించనున్నారు. అలాగే రాష్ట్ర, జిల్లా రహదారులు దాటే ప్రాంతాలలో ఒక ‘సింగిల్ ట్రంపెట్’ ఇంటర్‌ఛేంజ్‌ను, మరో 8 చోట్ల ‘రోటరీ’ ఇంటర్‌ఛేంజ్‌లను ఏర్పాటు చేయనున్నారు. ముందుగా జాతీయ రహదారులు క్రాస్ అయ్యే ప్రాంతాల్లో 8 డబుల్ ట్రంపెట్ ఇంటర్‌ఛేంజ్‌లను నిర్మిస్తున్నారు. ఇవి కంచికచర్ల, దుగ్గిరాలపాడు, మైలవరం, పొట్టిపాడు, చలివేంద్రపాలెం, నారాకోడూరు, అలాగే పొత్తూరు – లింగాయపాలెం ప్రాంతాల్లో రానున్నాయి.
ఇక రాష్ట్ర, జిల్లా రహదారులు దాటే ప్రాంతాలలో మరో 8 రోటరీ ఇంటర్‌ఛేంజ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. ఇవి పొన్నవరం, అడవినెక్కలం, గన్నవరం, మానికొండ, నందివెలుగు, అనంతవరప్పాడు, పుల్లడిగుంట, అలాగే బలుసుపాడు ప్రాంతాల్లో ఉండబోతున్నాయి. వీటితో పాటు మేడికొండూరు సమీపంలో ఒక సింగిల్ ట్రంపెట్ ఇంటర్‌ఛేంజ్‌ను నిర్మించనున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
