కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న స్టార్ క్రికెటర్ శిఖర్ ధావన్.. ఫొటోల కోసం ఫ్యాన్స్ పోటీ!
Shikhar Dhawan In Tirumala Temple: భారత స్టార్ క్రికెటర్ శిఖర్ ధావన్ కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సుప్రభాత సేవలో పాల్గొన్న ఆయనకు ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందించి వేద ఆశీర్వచనం చేశారు. దర్శనం అనంతరం భక్తులు శిఖర్ ధావన్‌తో ఫొటోలు దిగేందుకు పోటీ పడ్డారు.

తిరుపతి: తిరుమల శ్రీవారిని భారత స్టార్ క్రికెటర్ శిఖర్ ధావన్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. సోమవారం ఉదయం తిరుమల చేరుకున్న ఆయన.. శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. భార్య సోఫీ షైన్‌తో కలిసి తిరుమలకు వచ్చిన శిఖర్ ధావన్ వెంకన్నకు మొక్కులు చెల్లించుకున్నారు. ఐర్లాండ్‌కు చెందిన సోఫీ షైన్‌ను ఈ ఏడాది ఫిబ్రవరి 21న శిఖర్ ధావన్ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.
తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం ఆలయ అర్చకులు శిఖర్ ధావన్ కుటుంబ సభ్యులకు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం అందించారు.
శ్రీవారిని దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని ఈ సందర్భంగా శిఖర్ ధావన్ తెలిపారు. తన పర్యటనకు ఏర్పాట్లు చేసినందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పరిపాలన విభాగానికి ధావన్ కృతజ్ఞతలు కూడా తెలిపారు.
దర్శనం అనంతరం ఆలయం వెలుపలకు వచ్చిన శిఖర్ ధావన్‌ను చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆసక్తి చూపించారు. ఆయనతో ఫొటోలు దిగేందుకు అభిమానులు, భక్తులు పోటీ పడ్డారు. దీంతో ఆలయ పరిసరాల్లో కొద్దిసేపు సందడి నెలకొంది.
వీడియో చూడండి..




