AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వచ్చే నెల రోజుల్లోనే DSC 2.0 నోటిఫికేషన్.. AP సర్కార్ కీలక ప్రకటన!

రాష్ట్ర విద్యాశాఖలో కీలక నియామకాలకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. నెల రోజుల్లో డీఎస్సీ 2.0 నోటిఫికేషన్ విడుదలకు ఏర్పాట్లు చేయాలని మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. నోటిఫికేషన్ నుంచి పోస్టింగ్స్ వరకు మొత్తం ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. అలాగే రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో 1,523 అధ్యాపక పోస్టుల భర్తీతోపాటు పలు కీలక..

వచ్చే నెల రోజుల్లోనే DSC 2.0 నోటిఫికేషన్.. AP సర్కార్ కీలక ప్రకటన!
AP DSC Notification
Srilakshmi C
|

Updated on: Oct 01, 2026 | 7:35 PM

Share

అమరావతి, అక్టోబర్ 1: రాష్ట్ర విద్యాశాఖలో నియామకాలు, విద్యా ప్రమాణాల మెరుగుదలపై మంత్రి నారా లోకేష్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నెల రోజుల్లో డీఎస్సీ 2.0 నోటిఫికేషన్ విడుదలకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. నోటిఫికేషన్ విడుదల నుంచి పోస్టింగ్స్ వరకు మొత్తం డీఎస్సీ ప్రక్రియను పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ రిక్రూట్‌మెంట్ మోడల్ వైపు చూస్తోందని లోకేష్ పేర్కొన్నారు. నియామక ప్రక్రియలో పారదర్శకత, వేగం, సమర్థతకు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు సూచించారు. పదో తరగతి పరీక్షల్లో విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించేలా ‘మిషన్ మార్చ్’ కార్యక్రమాన్ని సమర్థంగా అమలు చేయాలని మంత్రి సూచించారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాన్ని మెరుగుపరచడంతో పాటు వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు తెలిపారు.

డ్రాప్‌అవుట్స్ నివారణకు ‘జీరో డ్రాప్‌అవుట్ మిషన్’

పిల్లలు మధ్యలోనే చదువు మానేయకుండా చర్యలు తీసుకోవాలని లోకేష్ ఆదేశించారు. ఇందుకోసం ‘జీరో డ్రాప్‌అవుట్ మిషన్’ను అమలు చేయాలని సూచించారు. పాఠశాలలకు దూరమయ్యే పిల్లలు భవిష్యత్తులో మాదకద్రవ్యాల వంటి సమస్యల బారిన పడే అవకాశం ఉందన్న సింగపూర్ మంత్రి షణ్ముగం సూచనలను పరిగణనలోకి తీసుకోవాలని ఆయన అన్నారు. డ్రాప్‌అవుట్స్‌ను తగ్గించడంలో కమ్యూనిటీ లీడర్లను భాగస్వాములను చేయాలని సూచించారు. రాష్ట్రంలోని 175 పాఠశాలలను ‘లీప్ స్కూల్స్‌’గా అభివృద్ధి చేసే ప్రతిపాదనలను అధికారులు సమీక్షకు తీసుకువచ్చారు. ఈ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపరిచి విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణాన్ని కల్పించే అంశాలపై చర్చ జరిగింది.

యూనివర్సిటీల్లో 1523 అధ్యాపక పోస్టుల భర్తీ

రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 1,523 అధ్యాపక పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నట్లు సమీక్షలో వెల్లడించారు. ఈ పోస్టులకు సంబంధించి డిసెంబర్‌లో రాత పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో క్యాంపస్‌లను ఏర్పాటు చేసేందుకు పలు జాతీయ, అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలు ఆసక్తి చూపుతున్నట్లు అధికారులు మంత్రికి వివరించారు. ఉన్నత విద్యా రంగంలో రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేసేలా ఈ అవకాశాలను వినియోగించుకోవాలని లోకేష్ సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా 125 ప్రాంతాల్లో ఆటిజం సెంటర్లను ఏర్పాటు చేసే అంశంపై కూడా సమీక్ష జరిగింది. ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలకు అవసరమైన సేవలు, సహాయక వ్యవస్థలను మరింత అందుబాటులోకి తీసుకురావడంపై అధికారులు చర్చించారు.

ఇవి కూడా చదవండి

ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల నేపథ్యంలో విశాఖపట్నంలో ప్రతిష్టాత్మక పబ్లిక్ లైబ్రరీ నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలను కూడా మంత్రి సమీక్షించారు. విద్యార్థులు, పరిశోధకులు, సాధారణ ప్రజలకు ఉపయోగపడేలా గ్రంథాలయాన్ని అభివృద్ధి చేసే అంశంపై అధికారులతో చర్చించారు. విద్యాశాఖలో నియామకాలు, పాఠశాల విద్య, డ్రాప్‌అవుట్స్ నివారణ, ఉన్నత విద్య, ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలకు సేవలు వంటి అంశాలపై నిర్దిష్ట లక్ష్యాలతో ముందుకు వెళ్లాలని మంత్రి లోకేష్ అధికారులకు సూచించారు.

Follow Us