Life Lesson: పురోగతి నెమ్మదిగా ఉందని ఆగిపోకండి.. ఈ కథ మీకు కొత్త జీవిత పాఠం నేర్పుతుంది
కొన్నిసార్లు మనం ఎంత కష్టపడినా వెంటనే ఫలితాలు కనిపించవు. కొన్ని రోజులు, కొన్ని వారాలు ప్రయత్నించినా మార్పు కనిపించకపోతే.. “నా ప్రయత్నం వృథా అవుతోందా?” అనే సందేహం మొదలవుతుంది. చివరికి మన లక్ష్యాన్ని వదిలేయాలని అనిపిస్తుంది. కానీ నిజం ఏమిటంటే.. పురోగతి కనిపించడం లేదంటే మన ప్రయత్నం విఫలమైందని అర్థం కాదు. కొన్నిసార్లు నెమ్మదిగా సాగే దశ ముగిసేలోపే మనమే ఆగిపోతాం. ఈ విషయాన్ని అర్థం చేసుకున్న ఓ యువకుడి కథ ఇది..

ఒక చిన్న గ్రామంలో ర్యాన్ అనే యువకుడు ఉండేవాడు. అతను తెలివైనవాడు, కష్టపడి పనిచేసేవాడు. అయితే అతనిలో ఒక బలహీనత ఉండేది. ఏ పని చేసినా దాని ఫలితం త్వరగా రావాలని కోరుకునేవాడు. కొత్త నైపుణ్యం నేర్చుకోవాలని ప్రయత్నించినా, చిన్న వ్యాపారం ప్రారంభించినా, తనను తాను మెరుగుపరుచుకోవడానికి కృషి చేసినా.. మొదట్లో ర్యాన్ ఎంతో ఉత్సాహంగా ఉండేవాడు. కానీ ఫలితాలు నెమ్మదిగా రావడం ప్రారంభించిన వెంటనే అతని ఉత్సాహం తగ్గిపోయేది. ‘ఇది బహుశా నా కోసం కాదు’.. ‘ఈ పద్ధతి పనిచేయడం లేదు’.. ‘నేను ఇప్పటికే చాలా ప్రయత్నించాను’.. ఇలా తనను తాను సమర్థించుకునే కారణాలు అతని దగ్గర ఎప్పుడూ ఉండేవి. తాను ఎందుకు ఆగిపోయానో చెప్పడానికి ప్రతి సారి ఒక కారణం దొరికేది. కానీ తాను ఎంత తరచుగా ఆగిపోతున్నాడో మాత్రం అతను గుర్తించలేదు.
అదే గ్రామంలో ఓ వృద్ధుడు నివసించేవాడు. అతనికి పెద్దగా ఆస్తిపాస్తులు ఏమీ లేవు. చాలా సాధారణమైన జీవితాన్ని గడిపేవాడు. అయితే గ్రామస్తులు అతని గురించి ఒక విచిత్రమైన విషయం చెప్పుకునేవారు. ‘ఆ వృద్ధుడు నృత్యం చేస్తే వర్షం పడుతుంది’. ఈ నానుడి ఎప్పటి నుంచి ఉందో ఎవరికీ తెలియదు. కానీ ఎప్పుడైనా గ్రామంలో వర్షాలు కురవక పొలాలు ఎండిపోయినప్పుడు.. గ్రామస్తులు “బహుశా ఆ వృద్ధుడు మళ్లీ నృత్యం చేయాలి” అని చెప్పుకునేవారు. ర్యాన్‌కు ఇది చాలా హాస్యాస్పదంగా అనిపించేది. ‘వర్షం వాతావరణం వల్ల వస్తుంది. ఒక మనిషి నృత్యం చేయడం వల్ల ఆకాశం మారదు’ అని అతను అన్నాడు. ఆ మాటలను విన్న వృద్ధుడు కోపం తెచ్చుకోలేదు. చిరునవ్వుతో ‘నువ్వు చెప్పింది నిజమే. ఏ మనిషీ వర్షాన్ని నియంత్రించలేడు’ అన్నాడు. ర్యాన్ ఆశ్చర్యపోయాడు. ‘అయితే నువ్వు నృత్యం చేస్తే వర్షం వస్తుందని అందరూ ఎందుకు అంటున్నారు?’ అని అడిగాడు. వృద్ధుడు ఎండిపోయిన పొలాల వైపు చూస్తూ ‘రేపు ఉదయం రా. నాతో కలిసి నువ్వు కూడా నృత్యం చేయవచ్చు’ అన్నాడు. ర్యాన్ నవ్వుతూ అంగీకరించాడు.
అప్పుడు వృద్ధుడు ఒక మాట చెప్పాడు ‘నీకు చాలనిపించినప్పుడు నువ్వు ఎప్పుడైనా ఆపేయవచ్చు’. మరుసటి రోజు ఉదయం ర్యాన్ ముందుగానే అక్కడికి చేరుకున్నాడు. ఆకాశం నిర్మలంగా ఉంది. నేల పూర్తిగా పొడిగా ఉంది. ఒక్క మేఘం కూడా కనిపించలేదు. వృద్ధుడు నెమ్మదిగా నృత్యం చేయడం ప్రారంభించాడు. ర్యాన్ కూడా అతనితో కలిసి నృత్యం చేశాడు. మొదట్లో ర్యాన్‌కు ఆసక్తిగానే అనిపించింది. ఒక గంట గడిచింది. వర్షం లేదు. రెండు గంటలు గడిచాయి. ఆకాశంలో ఎలాంటి మార్పు లేదు. ఎండ పెరిగింది. ర్యాన్ అలసిపోయాడు. అతని కాళ్లు నొప్పించాయి. బట్టలు చెమటతో తడిసిపోయాయి. చివరికి అతను ఆగిపోయాడు. ‘చూశావా? నేను చెప్పిందే నిజం. మనం ఇన్ని గంటలు నృత్యం చేశాం. కానీ ఒక్క చుక్క వర్షం కూడా పడలేదు’ అన్నాడు. వృద్ధుడు ప్రశాంతంగా నవ్వాడు. ‘నీకు చాలనిపించినంత చేశావు’ అన్నాడు. ర్యాన్ ఇంటికి వెళ్లిపోయాడు. కానీ వృద్ధుడు మాత్రం మరుసటి రోజు మళ్లీ అదే ప్రదేశానికి వచ్చాడు. రెండో రోజు.. మూడో రోజు.. అయినా వర్షం లేదు రెండో రోజు కూడా వృద్ధుడు నృత్యం చేశాడు. వర్షం లేదు. మూడో రోజు కూడా వచ్చాడు. వర్షం లేదు. నాలుగో రోజు కూడా అదే పరిస్థితి.
ఐదో రోజు.. ఆరో రోజు.. అయినా ఆకాశం నిర్మలంగానే ఉంది. ర్యాన్ దూరం నుంచి వృద్ధుడిని గమనించేవాడు. ఒక రోజు అతను అడిగాడు ‘నువ్వింకా ఇది చేస్తున్నావా?’ వృద్ధుడు చిరునవ్వుతో నృత్యం చేస్తూనే ఉన్నాడు. అతను రోజంతా ఆగకుండా నృత్యం చేయలేదు. అలసిపోయినప్పుడు విశ్రాంతి తీసుకున్నాడు. ఆకలిగా ఉన్నప్పుడు భోజనం చేశాడు. కానీ మరుసటి రోజు మాత్రం మళ్లీ తిరిగి వచ్చాడు. అదే అతని రహస్యం. అతను ఫలితాన్ని బలవంతంగా తీసుకురావాలని ప్రయత్నించలేదు. కానీ ప్రయత్నాన్ని మాత్రం ఆపలేదు.
చివరకు.. ఆకాశం మారింది
ఒక రోజు మధ్యాహ్నం గాలి ఒక్కసారిగా మారింది. చల్లని గాలి వీచింది. గ్రామం మీద నెమ్మదిగా నల్లటి మేఘాలు కమ్ముకున్నాయి. మొదట కొన్ని చినుకులు పడ్డాయి. ఆ తర్వాత వర్షం వేగం పెరిగింది. కొన్ని నిమిషాల్లోనే ఎండిపోయిన పొలాలు వర్షపు నీటితో తడిసిపోయాయి. ఆ వర్షంలోనూ వృద్ధుడు నృత్యం చేస్తూనే ఉన్నాడు. ర్యాన్ అతని దగ్గరకు పరుగెత్తుకుంటూ వెళ్లాడు. ‘ఇప్పుడు నీ రహస్యం ఏమిటో చెప్పు’ అని అడిగాడు. వృద్ధుడు నవ్వాడు. ‘నా దగ్గర ఎలాంటి రహస్యం లేదు.’ ‘అయితే నువ్వు నృత్యం చేసినప్పుడల్లా చివరకు వర్షం ఎందుకు వస్తుంది?’ అని ర్యాన్ అడిగాడు. వృద్ధుడు చెప్పిన సమాధానం ర్యాన్ జీవితాన్ని మార్చేసింది. ‘నువ్వు వర్షం రావాలని నృత్యం చేశావు. కానీ నేను వర్షం వచ్చేవరకు నృత్యం చేస్తూనే ఉంటాను.’ ర్యాన్ నిశ్శబ్దంగా ఉండిపోయాడు. వృద్ధుడు మళ్లీ చెప్పాడు ‘నేను వర్షాన్ని నియంత్రించలేను. కానీ రేపు తిరిగి వస్తానా లేదా అనేది మాత్రం నా చేతుల్లో ఉంది.’ ఆ మాటలు ర్యాన్ మనసులో బలంగా నాటుకున్నాయి. అతనికి తన జీవితంలోని తప్పు అర్థమైంది.
తన లక్ష్యాలు అసాధ్యమైనవి కావడం వల్ల తాను విఫలం కాలేదు. ఫలితాలు తనకు కావాల్సినంత వేగంగా రాకపోవడంతో తానే చాలా తొందరగా నిర్ణయం తీసుకుని ఆగిపోయాడు. పురోగతి నెమ్మదిగా ఉండటం.. పురోగతి లేకపోవడం కాదు. కొన్ని లక్ష్యాలకు సమయం పడుతుంది. కొన్ని మార్పులు బయటికి కనిపించకముందే మనలో జరుగుతుంటాయి. అయితే పట్టుదల అంటే అదే తప్పును పదే పదే చేయడం కాదు. లక్ష్యం ఇంకా విలువైనదే అయితే.. నేర్చుకోవాలి, విధానాన్ని మార్చుకోవాలి, అవసరమైన సర్దుబాట్లు చేసుకోవాలి, మళ్లీ ప్రయత్నించాలి. ఆ రోజు నుంచి ర్యాన్ మారిపోయాడు ఆ సంఘటన తర్వాత ర్యాన్ తన పని విధానాన్ని మార్చుకున్నాడు. ఏ పని ప్రారంభించినా వెంటనే ఫలితం రాకపోతే వదిలేయడం మానేశాడు. పనిచేయని విధానాన్ని మార్చుకున్నాడు. తన తప్పుల నుంచి నేర్చుకున్నాడు. అవసరమైనప్పుడు కొత్త మార్గాలను ప్రయత్నించాడు. ముఖ్యంగా.. తిరిగి రావడం నేర్చుకున్నాడు. కొన్ని సంవత్సరాల తర్వాత గ్రామస్తులు ర్యాన్‌ను ‘బలంగా ప్రారంభించే యువకుడు’గా గుర్తుంచుకోలేదు. ముఖ్యమైన పనులను పూర్తి చేసే వ్యక్తిగా గుర్తించారు.
ఈ కథ మనకు చెప్పే నీతి
మన జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితులు ఎన్నో వస్తాయి. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నప్పుడు, వ్యాపారం చేస్తున్నప్పుడు, పరీక్షలకు సిద్ధమవుతున్నప్పుడు, కొత్త నైపుణ్యం నేర్చుకుంటున్నప్పుడు.. ఫలితాలు వెంటనే కనిపించకపోవచ్చు. అలాంటి సమయంలో ‘ఇది పనిచేయడం లేదు’ అని నిర్ణయించుకోవడం చాలా సులభం. కానీ ఒకసారి ఆలోచించండి.. మీరు విఫలమయ్యారా? లేక ఫలితం కనిపించే ముందు ఆగిపోయారా? స్లో ప్రోగ్రెస్ చాలా సార్లు నో ప్రోగ్రెస్‌లా కనిపిస్తుంది. మీరు ప్రతిదీ నియంత్రించలేరు. ఫలితం ఎప్పుడు వస్తుందో, పరిస్థితులు ఎప్పుడు మారతాయో, ఇతరులు ఎలా స్పందిస్తారో మీ చేతుల్లో ఉండకపోవచ్చు. కానీ ఒక విషయం మాత్రం మీ చేతుల్లో ఉంటుంది. రేపు మళ్లీ ప్రయత్నించడానికి తిరిగి వస్తారా లేదా అనేది. అందుకే ముఖ్యమైన లక్ష్యాన్ని ఎంచుకోండి. పనిచేయని విధానాన్ని మెరుగుపరచండి. అవసరమైతే మార్గాన్ని మార్చుకోండి. కానీ ఫలితం వెంటనే కనిపించలేదని విలువైన ప్రయత్నాన్ని వదిలేయకండి. మీరు వర్షాన్ని నియంత్రించాల్సిన అవసరం లేదు. వర్షం కోసం తిరిగి రావడం విలువైనదేనా అని నిర్ణయించుకోవాలి.




