అక్కడ భాస్కర్‌రెడ్డి.. ఇక్కడ మనోహర్‌రెడ్డి.. మరోచోట ఇంకో కొత్త పేరు. ఇలా పూటకో పేరు.. పేటకో వేషంతో జనాన్ని ఏమార్చి ఏకంగా పది కోట్ల రూపాయలు లూటీ చేశాడో కేటుగాడు. పోలీసుల కూపీలో ఇదంతా ఒకేఒక్కడు చేస్తున్నాడని బయటపడటంతో అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. వివరాల్లోకెళ్తే.. అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం కొప్పలకొండకు చెందిన బెస్త చిన్న ఓబులేసు అధిక వడ్డీ ఆశ చూపి పలు చోట్లు అప్పులు చేశాడు. ఊరికో పేరు మార్చుకుంటూ మారు వేషాల్లో చెలామణి అవుతుండటంతో ప్రజలు ఇతగాడి మోసాలను పసిగట్టలేకపోయారు. కిరాణా దుఖాణం, షేర్ మార్కెట్ వంటి పలు వ్యాపారాలు చేస్తున్నానంటూ.. లక్ష రూపాయలకు వెయ్యి నుంచి 5 వేల వరకు వడ్డీ ఇస్తానని నమ్మబలికువాడు. అధిక వడ్డీకి ఆశపడి జనం డబ్బు ఇచ్చేవారు. అనంతరం ఆ ప్రాంతం నుంచి ఉడాయించేవాడు. మోసపోయామని తెలుసుకున్న నంద్యాల జిల్లా అవుకు, అనంతపురం జిల్లా కణేకల్లుకు చెందిన బాధితులు ఆత్మకూరు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. అప్పట్లో పోలీసులు అరెస్ట్ చేశారు కూడా. ఆ తర్వాత బెయల్‌పై తిరిగి వచ్చి కొత్తపేరుతో మళ్లీ దందా కొనసాగించేవాడు.
ఇలా గడచిన రెండేళ్లలో అనంతపురం, కర్నూలు జిల్లాల్లో సుమారు రూ.10 కోట్ల వరకు మోసాలకు పాల్పడ్డాడు. తాజాగా శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లిలో రూ.1.7 కోట్లు తీసుకుని పరారైనట్లు బాధితులు జనవరి 25న పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తులో భాగంగా విచారించగా ఓబులేసు నేరాలు ఒక్కొక్కటిగా వెలుగు చూశాయి. జులపాల జుట్టు, కద్దర్ చొక్కా, ఒంటినిండా బంగారం దరించి పెద్దమనిషిలా డబ్బులున్న వారితో పరిచయం పెంచుకుని అధిక వడ్డీ ఆశ చూపి లూఠీ చేసి పరారవుతాడు. అనంతరం అమ్మాయిలతో టూర్లకు వెళ్లి ఎంజాయ్ చేస్తూ విందు, విలాసాల్లో మునిగితేలుతుండాడు. పోలీసులకు మాత్రం గుండు వేషంలో పట్టుపడతాడు. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తులో ఉంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.