ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు ఏపీ సీఎం జగన్ ను కలిశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లి.. సీఎం జగన్ తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. చాగంటి కోటేశ్వరరావు ఇటీవల టీటీడీ ధార్మిక సలహాదారుగా నియమితులయ్యారు. చాగంటిని సీఎం జగన్ శాలువా కప్పి సన్మానించారు. వెంకటేశ్వరస్వామి ప్రతిమను చాగంటికి బహూకరించారు. అదే సమయంలో సీఎం జగన్ ను శాంతా బయోటెక్స్ లిమిటెడ్ వ్యవస్థాపకులు, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కేఐ వరప్రసాద్ రెడ్డి కూడా కలిశారు. సీఎంతో సమావేశం అనంతరం చాగంటి కోటేశ్వరరావు, కేఐ వరప్రసాద్ రెడ్డి సీఎం నివాసం వద్ద ఉన్న గోశాలను సందర్శించారు. అక్కడ గోవులను పరిరక్షిస్తున్న తీరు పట్ల సీఎం జగన్ ను చాగంటి అభినందించారు.
టీటీడీ నిర్వహిస్తున్న ‘పారాయణం’ కార్యక్రమాలు ప్రతి వ్యక్తి చేరాలంటే.. సరైన మార్గదర్శకత్వం అవసరం అని భావించిన తిరుమల తిరుపతి దేవస్థానం ధార్మిక కార్యకలాపాలకు సలహాదారుగా చాగంటి కోటేశ్వరరావును నియమిస్తూ హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యనిర్వాహక కమిటీ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తన ప్రవచనాలతో వయసుతో సంబంధం లేకుండా అనేక మందిని ఆధ్యాత్మికత వైపు నడిపిస్తున్న చాగంటి యువతను ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసే దిశగా ఆలోచింపజేస్తారని ఆశాభావం వ్యక్తం చేసింది. హిందూ ధర్మ ప్రచారాన్ని ప్రతి ఒక్కరి దగ్గరకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో మారుమూల గ్రామాల్లో నివసించే గ్రామీణ యువతను ఈ కార్యక్రమాల్లో భాగస్వాములను చేయాలని ఈ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..