AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Super Six: సూపర్ సిక్స్ హామిల్లో 5 అమల్లోకి.. ఒకే ఒక్కటి పెండింగ్… పూర్తి డీటేల్స్

ఆంధ్రప్రదేశ్‌లో సీఎం చంద్రబాబు నాయుడు ‘సూపర్ సిక్స్’ హామీల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించారు. ‘స్త్రీశక్తి’ పేరుతో ప్రారంభించిన ఈ పథకం కింద మహిళలు రాష్ట్రంలో ఎక్కడైనా ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో జీరో ఫేర్‌తో ప్రయాణించవచ్చు. ఈ పథకంలో సూపర్ 6 లో ఇప్పటివరకు ఐదు పథకాలను అమలు చేసినట్లైంది.

Super Six: సూపర్ సిక్స్ హామిల్లో 5 అమల్లోకి.. ఒకే ఒక్కటి పెండింగ్... పూర్తి డీటేల్స్
Chandrababu
Ram Naramaneni
|

Updated on: Aug 15, 2025 | 6:28 PM

Share

సూపర్‌ సిక్స్‌ హామీల అమలులో…ఇప్పటికే బౌండరీ కొట్టేశారు ఏపీ సీఎం చంద్రబాబు. ఇంకొక్క పథకం అమలు చేస్తే…సూపర్‌ సిక్సర్‌ కొట్టినట్లే! ఏపీలో పథకాల పండుగ కొనసాగుతోంది. తాజాగా సూపర్‌ సిక్స్‌ హామీల్లో ఒకటైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి పచ్చ జెండా ఊపారు చంద్రబాబు. దీనిలో భాగంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, మంత్రి నారా లోకేష్‌, బీజేపీ నేత మాధవ్…ఉండవల్లి నుంచి విజయవాడలోని నెహ్రు బస్టాండ్‌ వరకు ప్రయాణించారు. స్త్రీ శక్తి పేరుతో అమలయ్యే మహిళలకు ఫ్రీ జర్నీ విధివిధానాలపై ఇప్పటికే ఏపీ ప్రభుత్వం జీవో కూడా జారీ చేసింది. ఐదు రకాల ఆర్టీసీ బస్సు సర్వీసుల్లో మహిళలు, బాలికలు, ట్రాన్స్‌జెండర్లకు అనుమతి ఇచ్చింది. ఉచిత ప్రయాణం కల్పించే బస్సుల జాబితాలో పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ ఉన్నాయి. ఆయా బస్సుల్లో ఆధార్, రేషన్ కార్డు, ఓటర్ కార్డుల్లో ఏదో ఒకటి చూపించి ఉచిత ప్రయాణం చేయవచ్చని స్పష్టం చేసింది. జీరో టిక్కెటింగ్‌ విధానంతో ఫ్రీ జర్నీకి అనుమతి ఇవ్వనుండగా.. ఆ మొత్తాన్ని ఏపీ ప్రభుత్వం.. ఆర్టీసీకి రీయింబర్స్‌మెంట్ చేయనుంది. అయితే.. నాన్‌స్టాప్, ఇంటర్‌స్టేట్‌, సప్తగిరి, అల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ, స్టార్ లైనర్, ఏసీ బస్సులను మాత్రం స్త్రీ శక్తి పథకం నుంచి మినహాయించింది.

సూపర్‌ సిక్స్‌ హామీలు సూపర్‌ హిట్‌ అన్నారు సీఎం చంద్రబాబు. మంచి చేస్తున్న ప్రభుత్వానికి ప్రజలే ప్రచారం చేయాలన్నారు బాబు. మనం ఈ పథకాన్ని చేయగలమా అని ఎన్నికల ముందు చంద్రబాబును అడిగానని, ఆయన కమిట్‌మెంట్‌ ఉన్న నాయకుడు కాబట్టే…మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని ప్రారంభించగలిగామన్నారు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌. స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు మరింత శక్తి వస్తుందని, వాళ్లపై ఆర్థిక భారం తగ్గుతుందన్నారు మంత్రి లోకేష్‌. నెలకు రూ. 1500 దాకా వాళ్లకు మిగులుతుంది అన్నారు మంత్రి లోకేష్‌. గత జగన్‌ సర్కార్‌ మీద విమర్శలు గుప్పించారు.

అంతకుముందు సూపర్‌సిక్స్‌లో ఏయే పథకాలు ఎప్పుడు అమలు చేశారో తెలుసుకుందాం….

ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి 3 గ్యాస్‌ సిలిండర్లు. సూపర్‌సిక్స్‌ హామీల్లో ఇది కూడా భాగం. గత ఏడాది అక్టోబర్‌ 31న దీపావళి సందర్భగా, ఏపీ సీఎం చంద్రబాబు ఈ పథకాన్ని ప్రారంభించారు. శ్రీకాకుళం, అనంతపురం జిల్లాల్లో ఆయన స్వయంగా కొందరు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి, వాళ్లకు ఉచిత గ్యాస్‌ సిలిండర్‌ అందించారు. ఆ తర్వాత చంద్రబాబు స్వయంగా గ్యాస్‌ వెలిగించి టీ పెట్టారు. లబ్ధిదారులతో ముచ్చటించారు. వాళ్ల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. లబ్ధిదారులు ముందుగా నగదు చెల్లించి సిలిండర్‌ను తీసుకుంటే 2 రోజుల్లో ఆ డబ్బును, ప్రభుత్వం వాళ్ల ఖాతాల్లో జమ చేస్తుంది. ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంలో మొదటి సిలిండర్‌ను మార్చి31వ తేదీలోపు, రెండోది జులై 31, మూడోది నవంబర్ 30లోపు సిలిండర్లను పొందవచ్చు.

ఇక తల్లికి వందనం పథకాన్ని ఈ ఏడాది జూన్‌ 12న ప్రారంభించింది ఏపీ సర్కార్‌. పేద పిల్లలు చదువును మధ్యలోనే ఆపకుండా కొనసాగించేందుకు తల్లికి వందనం పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుంది. ఈ పథకం కింద అర్హులైన ప్రతి విద్యార్థికి ఏటా రూ. 15,000 ఆర్థిక సహాయం అందిస్తారు. ప్రైవేట్ పాఠశాలలో చదివే విద్యార్థులకు కూడా ఇది వర్తిస్తుంది. కుటుంబంలో ఎంత మంది పిల్లలు ఉంటే అంత మంది పిల్లలకు ఈ సాయం అందిస్తారు. ఇందులో విద్యార్థికి రూ.13,000 ఇవ్వగా.. పాఠశాల లేదా కాలేజీ నిర్వహణకు రూ.2 వేలు కేటాయిస్తారు. విద్యార్థికి ఇచ్చే మొత్తాన్ని తల్లి బ్యాంక్ ఖాతాలో నేరుగా జమ చేస్తారు.

ఇక అన్నదాత సుఖీభవ పథకాన్ని ఏపీ సీఎం చంద్రబాబు…ఈ నెలలో రెండో తేదీన ప్రారంభించారు. ఈ పథకం కింద కేంద్రం పీఎం కిసాన్‌ కింద ఇచ్చే రూ. 6 వేలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.14 వేలు కలిపి మొత్తం రూ. 20 వేల రూపాయల ఆర్థికసాయం రైతులకు అందిస్తారు. ఈ పథకంలో భాగంగా రైతులకు విడతలవారీగా వాళ్ల అకౌంట్లలో నగదు జమ చేస్తారు. చిన్న, సన్నకారు రైతులు, కౌలు రైతులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు.

యువతకు 20 లక్షల ఉద్యోగ అవకాశాలు లేదా నెలకు రూ. 3 వేల ఉద్యోగ భృతి…ఈ పథకంలో భాగంగా యువతకు ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలు కల్పించే ప్రక్రియ నిరంతరం సాగుతూనే ఉంటుంది. కూటమి ప్రభుత్వం 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నియామకానికి మెగా డీఎస్సీ నిర్వహించింది. ఇక యువతకు ప్రైవేటు కొలువులు కూడా కల్పించేందుకు ఏపీకి పెద్దఎత్తున పెట్టుబడులు వచ్చేలా ప్రభుత్వం కృషి చేస్తోంది.

ఇక సూపర్‌ సిక్స్‌ హామీల్లో….ప్రతి మహిళకు నెలకు రూ. 1500 ఆర్థిక సాయం అందించే పథకం ఒక్కటే మిగిలిపోయింది. అది కూడా పూర్తి చేస్తే చంద్రబాబు సూపర్‌ సిక్సర్‌ కొట్టినట్లే! ఈ పథకాన్ని దీపావళి నుంచి అమలు చేస్తారనే ప్రచారం జరుగుతోంది. అది కూడా నెరవేరిస్తే…మొత్తం సూపర్‌ సిక్స్‌ హామీలను నెరవేర్చినట్లే అంటున్నారు చంద్రబాబు.