AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Assembly: అసెంబ్లీ సమావేశాలకు వేళాయే.. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టే ఛాన్స్‌!

ఏపీలో శాసనసభ సమావేశాలకు వేళయింది...! కొత్త ప్రభుత్వం వచ్చాక జరుగుతున్న తొలి పూర్తి స్థాయి సమావేశాలు కావడంతో అందరి దృష్టి వీటిపై పడింది. ఈ అసెంబ్లీ సమావేశాలకు ఇరు పక్షాలు అస్త్రశస్త్రాలతో సిద్ధమయ్యాయి. గత ప్రభుత్వ పాలనపై శ్వేతపత్రాలు విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తుంటే... సభ వేదికగా కూటమి ప్రభుత్వాన్ని ఎండగట్టేందుకు వైసీపీ రెడీ అయ్యింది. అయితే అసెంబ్లీలో జగన్ ఎలాంటి వ్యూహాలను అమలు చేస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.

AP Assembly: అసెంబ్లీ సమావేశాలకు వేళాయే.. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టే ఛాన్స్‌!
Jagan Vs Chandrababu
Shaik Madar Saheb
|

Updated on: Jul 22, 2024 | 8:53 AM

Share

ఏపీ అసెంబ్లీ సమావేశాలకు సర్వం సిద్ధమయ్యింది. ఇవాళ్టి నుంచి ఐదు రోజుల పాటు సమావేశాలు జరగనున్నాయి. ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే సమావేశాల్లో ఉమ్మడి సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. గవర్నర్ ప్రసంగం అనంతరం స్పీకర్ అయ్యన్నపాత్రుడు అధ్యక్షతన బీఏసీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై నిర్ణయం తీసుకోనున్నారు. ఇక ఈ నెలాఖరుతో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ గడువు పూర్తి కానున్నందున, మరో 3 నెలలకు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. అక్టోబరులో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లు ప్రవేశపెట్టే అవకాశం

ఈ సభలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది. వీటితో పాటు వరదలు, రైతులకు సంబంధించిన అంశాలు, నీటిపారుదలతోపాటు పలు కీలక అంశాలపై అసెంబ్లీలో చర్చించనున్నారు. మరోవైపు వైసీపీ పాలనపై చంద్రబాబు ఇప్పటికే నాలుగు శ్వేతపత్రాలను విడుదల చేశారు. మరో మూడు శ్వేత పత్రాలైన శాంతిభద్రతలు, ఎక్సైజ్‌, ఆర్థిక శాఖల శ్వేతపత్రాలను సభలోనే విడుదల చేసి చర్చ పెట్టనున్నారు. ఈ శ్వేతపత్రాలకు సంబంధించిన వివరాలను అసెంబ్లీ వేదికగా పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వనున్నారు సీఎం చంద్రబాబు. మరోవైపు అసెంబ్లీ సమావేశాల కోసం టీడీపీ డ్రెస్ కోడ్ కూడా ఫాలో కానుంది. టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ పసుపు రంగు దుస్తులు, సైకిల్ గుర్తు కండువాలు మెడలో వేసుకుని రావాలని టీడీఎల్పీ సూచించింది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సీఎం చంద్రబాబు సహా తెలుగుదేశం నేతలు ఉదయం ఎనిమిదిన్నరకు వెంకటపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి అసెంబ్లీకి వెళ్తారు.

అసెంబ్లీలో అమీతుమీకి సిద్ధమైన వైసీపీ

ఇక అసెంబ్లీ సమావేశాలకు అస్త్రశస్త్రాలతో సిద్ధమైంది వైసీపీ. అసెంబ్లీ వేదికగా కుటమి ప్రభుత్వంతో అమీతుమీ తేల్చుకోవడానికి రెడీ అయింది. మాజీ సీఎం జగన్‌ కూడా సభకు హాజరు కానున్నారు. దీంతో అసెంబ్లీలో జగన్ ఎలాంటి వ్యూహాలను అమలు చేస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల అమలుపై కూటమి ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఏపీలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలు, దాడులకు సంబంధించిన కీలకమైన అంశాలను లేవనెత్తనున్నారు. ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో నెలకొన్న పరిణామాలను అసెంబ్లీలోనే గవర్నర్‌కు వివరించాలని భావిస్తున్నారు. ఇప్పటికే అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగాన్ని తమ ఎమ్మెల్యేలు అడ్డుకుంటారని జగన్‌ చెప్పారు. దీంతో అసెంబ్లీ సమావేశాలపై సర్వాత్రా ఉత్కంఠ నెలకొంది.