రోబో టెక్నాలజీ తో తయారయ్యే పంచ లోహ విగ్రహాలకు పశ్చిమగోదావరి జిల్లా కేంద్రంగా మారుతుంది. ఎంతో మంది ప్రముఖుల విగ్రహాలు ఇక్కడే తయారై దేశ విదేశాల్లో ఆవిష్కరించబడ్డాయి. ఈ క్రమంలో కలియుగ దైవం వేంకటేశ్వరుని పై అనేక గేయాలు రచించి ఆలపించిన తెలుగు వాగ్గేయ కారుడు అన్నమయ్య 111 అడుగుల భారీ పంచలోహ విగ్రహాన్ని పెనుమంట్ర మండలం నత్తా రామేశ్వరంలో శిల్పి కరుణాకర్ వడయార్ తయారు చేస్తున్నారు. దీనిని అమెరికా లోని టాన్సిస్ రాష్ట్రం మిమిపీస్ ప్రాంతంలో ఇండియన్ కల్చరల్ సెంటర్ అండ్ టెంపుల్ ఆధ్వర్యంలో నెలకొల్పనున్నారు. అన్నమయ్య విగ్రహం అమెరికాలోని లిబర్టీ విగ్రహం తర్వాత సమాన ఎత్తు కలిగిన విగ్రహం మని తయారీదారు చెబుతున్నారు.
తెలుగు వారికి చెందిన వాగ్గేయకారుడు అన్నమయ్య విగ్రహం విదేశాల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నెలకొల్పడం విశేషంగా మారింది. దేశంలోనే విగ్రహాలు తయారీలో పేరు పొందిన ఏకే ఆర్ట్స్ సంస్థ శిల్పి కరుణాకర్ వడయార్ కు విగ్రహం తయారీ ని ప్రవాసాంధ్రులు అప్పగించారు. దీంతో విగ్రహం తయారీలో శిల్పి నిమగ్నం అయ్యారు. ముందుగా మట్టితో ఐదు అడుగుల అన్నమయ్య విగ్రహం నమూనాను తయారు చేస్తారు. తరువాత ఆ విగ్రహాన్ని కంప్యూటర్ సహాయంతో ఆధునిక టెక్నాలజీ ని ఉపయోగించి సెంటీమీటర్ ను అడుగుల లోకి మార్చుతారు. దీన్ని హిచ్చింగ్ మిషన్ కు అనుసంధానం చేసి భాగాలుగా విగ్రహం ను తయారు చేస్తారు.
ఈ విగ్రహం తయారీకి పంచలోహాలను వినియోగిస్తారు. విగ్రహం తయారు చేసే ముందు మూడు రోజులు ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహిస్తామని ఆ తర్వాత విగ్రహం తయారీని ప్రారంభిస్తామని శిల్పి కరుణాకర్ వడాయార్ తెలిపారు. భారతదేశంలో పశ్చిమగోదావరి జిల్లా నత్తారామేశ్వరంలో తయారై విదేశాల్లో ఆవిష్కరించబడుతుండటంతో విగ్రహం పట్ల అందరూ ఆసక్తి కనబరుస్తున్నారు. పలువురు విగ్రహరూపం చూసేందుకు తయారీ కేంద్రం కు సైతం వస్తుండటం ఆసక్తి కరంగా మారింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..