Andhra News: చూసి అమాయకురాలనుకునేరు.. ఆమె మామూలు లేడి కాదు భయ్యో..
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో లేడీ డాన్ ఆగడాలు బయటపడ్డాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో కోనేటి సులోచన చేస్తున్న మోసాలపై పోలీసులు కొరడా ఝళిపించారు. కోర్టు ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులకు దిమ్మతిరిగే నిజాలు తెలిశాయి. ఆమెపై ఇప్పటికే మదనపల్లె వన్ టౌన్, టూ టౌన్, తాలూకా పోలీస్ స్టేషన్లలో 14 కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. తాజాగా జరిపిన సోదాల్లో కోట్ల రూపాయల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు.

మదనపల్లె పట్టణంలో లేడీ డాన్‌గా పేరొందిన కోనేటి సులోచన నివాసంలో పోలీసులు చేపట్టిన తనిఖీల్లో భారీగా అక్రమాస్తులు బయటపడ్డాయి. కోట్ల రూపాయల విలువైన ఆస్తి పత్రాలను పోలీసులు గుర్తించారు. రాజకీయ నాయకులతో ఉన్న సంబంధాలతోనే ఈమె అక్రమాలకు పాల్పడి డాన్‌గా ఎదిగినట్లు తేలింది. గతంలోనే ఈమెపై రౌడీషీట్ తెరిచిన పోలీసులు, పలువురిని మోసగించినట్లు గుర్తించారు. తాజాగా ఒక కేసుకు సంబంధించి కోర్టు ఆదేశాల మేరకు సులోచనతో పాటు ఆమె సోదరుడి నివాసంలో సోదాలు నిర్వహించి, దాదాపు 50కి పైగా ఆస్తుల వివరాలను గుర్తించారు.
అప్పులు ఇచ్చినట్లు నకిలీ పత్రాలు (ఫేక్ డాక్యుమెంట్లు) సృష్టించి, ఆపై బెదిరింపులకు పాల్పడి ఆస్తులను కాజేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ విషయం వెలుగులోకి రావడంతో బాధితులు తమకు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించారు. ఫోర్జరీ పత్రాలతో మోసాలకు పాల్పడిన సులోచనపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వివిధ ప్రాంతాల్లోని ఆస్తుల పత్రాలు, ప్రామిసరీ నోట్లు, ఖాళీ బాండ్లు, స్టాంప్ పేపర్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపుతున్నట్లు వెల్లడించారు.
అసలెవరీ సులోచన? ఆమె నేపథ్యం ఏమిటి?
మదనపల్లెలోని నీరుగట్టువారిపల్లెకు చెందిన సులోచన ఒక సాధారణ మహిళ. అయితే రాజకీయ నాయకులు, అధికారులతో ఏర్పడిన పరిచయాలతో కాలక్రమేణా లేడీ డాన్‌గా ఎదిగింది. వారి అండదండలతో ఆగడాలకు పాల్పడుతూ అతి తక్కువ సమయంలోనే కోట్ల రూపాయల విలువైన ఆస్తులను కూడబెట్టింది. బండకమ్మమీదపల్లె, పొన్నూటిపాలెం తదితర ప్రాంతాల్లో భూములు కొనుగోలు చేయడంతో పాటు పలుచోట్ల ఆక్రమణలకు కూడా పాల్పడింది. పోలీసులు దాడులు నిర్వహించే సమయంలో సులోచన అందుబాటులో లేదు. ఆమె ఇంట్లో లభించిన దస్తావేజులు, ఖాళీ బాండ్ పేపర్లు, ప్రామిసరీ నోట్లను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపుతున్నట్లు డీఎస్పీ బుచ్చిరాజు స్పష్టం చేశారు. వెంకటేశ్ నాయుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు కొనసాగిస్తున్న పోలీసులు.. సులోచన అక్రమాస్తుల గుట్టు రట్టు చేసే పనిలో ఉన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
