Atmakur Bypoll: మరి కాసేపట్లో నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నిక పోలింగ్ మొదలు కానుంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమయే పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు జరుగుతుంది. ఆత్మకూరు నియోజకవర్గంలోని 279 పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. 1,339 మంది జనరల్, 1032 మంది పోలీస్ సిబ్బందిని నియమించారు. అంతే కాకుండా 142 మంది మైక్రో అబ్జర్వర్లు, 38 మంది సెక్టార్ ఆఫీసర్స్ కూడా విధుల్లో ఉంటారు. మొత్తం 377 ఈవీఎంలను సిద్ధం చేశారు.
నియోజకవర్గంలో 123 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి అక్కడ ప్రత్యేక బందోబస్తును నియమించామని రిటర్నింగ్ ఆఫీసర్, జేసీ ఎంఎన్ హరేందిర ప్రసాద్ చెప్పారు. ఇప్పటికే ఓటర్లు అందరికీ ఓటర్ స్లిప్‌లు పంపిణీ చేశామని హరేందిర ప్రసాద్ చెప్పారు. ఓటర్లు తప్పనిసరిగా ఓటర్ స్లిప్‌లతో పాటు ఓటరు ఐడీ, ఆధార్, బ్యాంకు పాస్ బుక్, పాస్‌పోర్ట్ తదితర వాటిలో ఏదో ఒక గుర్తింపు కార్డును తప్పనిసరిగా తీసుకొచ్చి చూపాలన్నారు. ఓటర్లు నిర్భయంగా, స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు.
మేకపాటి గౌతమ్ రెడ్డి ఆకస్మిక మరణంతో ఆత్మకూరు ఉప ఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే. వైసీపీ తరఫున గౌతమ్ రెడ్డి సోదరుడు మేకపాటి విక్రమ్ రెడ్డి బరిలోకి దిగగా, ప్రతిపక్ష టీడీపీ పోటీకి దూరంగా ఉంది. బీజేపీ తరఫున భరత్ కుమార్ పోటీలో ఉన్నారు. వైసీపీ, బీజేపీ అభ్యర్థులతో పాటు మొత్తం 14 మంది ఎన్నికల బరిలో ఉన్నారు. 26న కౌంటింగ్ జరుగుతుంది. 2019 ఎన్నికల్లో ఆత్మకూరులో 83.38 శాతం పోలింగ్ జరిగింది. ఉప ఎన్నిక కాబట్టి ఈ సారి ఎంత పోలింగ్ జరుగుతుందనేది ఆసక్తిగా మారింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి