AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP, Telangana News Live: మేడారం సమ్మక్క – సారలమ్మను దర్శించుకున్న సీఎం రేవంత్

సీఎం రేవంత్ రెడ్డి మేడారంలో పర్యటిస్తున్నారు. సమ్మక్క - సారలమ్మ అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. సీఎంకు మంత్రి సీతక్క స్వాగతం పలికారు. మేడారం జాతర ఏర్పాట్లు, అభిృద్ధిపై సీఎం సమీక్షించనున్నారు. కాగా మహా జాతరకు తాత్కాలికంగా కాకుండా శాశ్వతంగా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

AP, Telangana News Live: మేడారం సమ్మక్క – సారలమ్మను దర్శించుకున్న సీఎం రేవంత్
Andhra Pradesh News Telangana News India News Live Updates
Balaraju Goud
|

Updated on: Sep 23, 2025 | 8:10 PM

Share

తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలా.. పరకామణి వ్యవహారం కూడా పాన్‌ ఇండియా లెవల్‌ ఇష్యూలా మారుతోంది. దీనిపై ఇప్పటికే అధికార, విపక్ష పార్టీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇప్పుడు లేటెస్ట్‌గా..ఈ చోరీపై సిట్‌ విచారణకు ఆదేశిస్తామని చెప్పారు మంత్రి లోకేష్‌. అటు వైసీపీ మాత్రం సిట్‌తో కాదు సీబీఐను రంగంలోకి దించాలని డిమాండ్‌ చేస్తోంది.

పరకామణి దొంగను అరెస్ట్ చేయకుండా గతంలో 41 సీఆర్‌పీసీ నోటీసులు ఇచ్చి పంపించేశారని లోకేష్‌ ఆరోపించారు. పరకామణి చోరీ కేసులో వాస్తవాలు బయటకు రావాలని చిట్‌చాట్‌లో చెప్పారు. దేవుడిని కూడా వదలని దొంగలు తప్పించుకోలేరని..సిట్‌ విచారణకు ఆదేశించి ఈ వ్యవహారంలో నిజాలు తేలుస్తామని తేల్చిచెప్పారు. జగన్‌ అండ్‌ టీం దేవుడి దగ్గర నాటకాలు ఆడారని.. అందుకే దేవుడు ఏం చేయాలో అది చేశాడని వ్యాఖ్యానించారు లోకేష్‌.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 23 Sep 2025 04:32 PM (IST)

    భార్యను కత్తితో పొడిచి భర్త ఆత్మహత్య

    అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం సజ్జలదిన్నె గ్రామంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. భార్యను హత్య చేసిన భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య జోత్స్నను కత్తితో పొడిచి, అనంతరం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు భర్త ఆంజనేయులు. కుటుంబ కలహాలే కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఆంజనేయులు, జోత్స్న దంపతులకు ఇద్దరు కుమారులు అఖిల్ (7) అరుణ్ (5) ఉన్నారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

  • 23 Sep 2025 03:54 PM (IST)

    టీటీడీ ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు కీలక నిర్ణయం..!

    శ్రీవారి సేవకుల వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై శ్రీవారి సేవకులకు వీఐపీ బ్రేక్‌ దర్శనం కల్పించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు టీటీడీ అధికారులను ఛైర్మన్‌ నాయుడు ఆదేశాలు జారీ చేశారు. శ్రీవారి సేవకులు భగవత్‌ బంధువులు.. భక్తులకు సేవ చేస్తే శ్రీవారికి చేసినట్టేనని ఆయన అన్నారు. దీంతో ఇకపై శ్రీవారి సేవకులకు వీఐపీ బ్రేక్‌ దర్శనం కల్పిస్తామని తెలిపారు.

  • 23 Sep 2025 03:05 PM (IST)

    మల్లోజులను ద్రోహిగా ప్రకటించిన మావోయిస్ట్ కేంద్ర కమిటీ

    మావోయిస్ట్ నేత మల్లోజుల వేణుగోపాల్‌పై మావోయిస్టు కేంద్ర కమిటీ చర్యలు చేపట్టింది. మల్లోజులను ద్రోహిగా ప్రకటించింది కేంద్ర కమిటీ. ఆయుధ పోరాటానికి ముగింపు పలుకుతామంటూ మావోయిస్టు అధికార ప్రతినిధి హోదాలో మల్లోజుల వేణుగోపాల్‌ అలియాస్‌ భూపతి అలియాస్‌ అభయ్‌ పేరుతో గతవారం ఒక లేఖ విడుదలైంది. ఈ లేఖ సంచలనం సృష్టించింది. తుపాకులు విడిచిపెట్టి, తాము చర్చలకు సిద్ధంగా ఉన్నామని నాటి లేఖలో మల్లోజుల ప్రకటించారు. అయితే అభయ్‌ రాసిన లేఖ వ్యక్తిగతమంటూ తెలంగాణ శాఖ ఈ లేఖ విడుదల చేసింది. అధికార ప్రతినిధి జగన్‌ పేరుతో తెలుగులో లేఖ బయటకు వచ్చింది. సరిగ్గా ఆలోచించే వాళ్లు అలాంటి లేఖ రాయరని జగన్‌ స్పష్టం చేశారు. ఈ పరిస్థితుల్లో మల్లోజులను ద్రోహిగా ప్రకటించింది మావోయిస్టు కేంద్రకమిటీ.

  • 23 Sep 2025 02:29 PM (IST)

    అమ్మవారి దీక్షా దుస్తుల్లో అసెంబ్లీకి మహిళా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు

    నవరాత్రులు సందర్భంగా రోజూ అమ్మవారికి ధరించే రంగు దుస్తుల్లోనే అసెంబ్లీకి వెళ్లాలని మహిళా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిర్ణయించారు. ఇందులో భాగంగా మంగళవాం (సెప్టెంబర్ 23) గాయత్రిదేవి అలంకారం సందర్భంగా ఎర్ర దుస్తులు ధరించిన మహిళా సభ్యులు అసెంబ్లీకి వచ్చారు. రాష్ట్రాన్ని చల్లగా చూడాలని దుర్గమ్మను వేడుకున్నామని తెలిపారు. మన సంస్కృతి, సంప్రదాయాలపై సందేశం ఇవ్వాలని డ్రెస్‌కోడ్‌ పాటిస్తున్నామని ప్రజా ప్రతినిధులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా దుర్గా నవరాత్రులు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. భక్తులకు లోటు లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని హోంమంత్రి అనిత వెల్లడించారు.

  • 23 Sep 2025 01:35 PM (IST)

    కోర్టులేమైనా డబ్బు రికవరీ ఏజెంట్లా

    యూపీకి చెందిన ఓ కిడ్నాప్‌ కేసుకు సంబంధించిన వ్యవహారంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సివిల్‌ వివాదాలను క్రిమినల్‌ కేసులుగా మార్చుతున్న ధోరణిపై అత్యున్నత న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది. కోర్టులు డబ్బు రికవరీ ఏజెంట్లు కాదని, న్యాయవ్యవస్థను దుర్వినియోగం చేయడాన్ని అనుమతించేది లేదని కోర్టు స్పష్టం చేసింది.

  • 23 Sep 2025 01:12 PM (IST)

    దుల్కర్‌, పృథ్విరాజ్‌ ఇళ్లలో కస్టమ్స్‌ సోదాలు..

    లగ్జరీ కార్ల స్మగ్లింగ్‌ ఆరోపణలకు సంబంధించి సినీ హీరోలు దుల్కర్‌ సల్మాన్, పృథ్విరాజ్‌ సుకుమారన్ నివాసాల్లో కస్టమ్స్‌ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆపరేషన్ నమకూర్‌ పేరుతో దేశవ్యాప్తంగా లగ్జరీ కార్ల స్మగ్లింగ్‌పై దర్యాప్తు చేపట్టిన కస్టమ్స్, ఇందులో భాగంగానే కోచిలోని ఈ ఇద్దరు ప్రముఖుల ఇళ్లలో సోదాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. లగ్జరీ కార్ల దిగుమతిలో అక్రమాలు, పన్ను ఎగవేతలకు పాల్పడినట్లుగా కస్టమ్స్ అధికారులు అనుమానిస్తున్నారు.

  • 23 Sep 2025 12:52 PM (IST)

    మేడారం సమ్మక్క – సారలమ్మను దర్శించుకున్న సీఎం రేవంత్

    సీఎం రేవంత్ రెడ్డి మేడారంలో పర్యటిస్తున్నారు. సమ్మక్క – సారలమ్మ అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. సీఎంకు మంత్రి సీతక్క స్వాగతం పలికారు. గద్దెల ప్రాంగణంలో మాస్టర్ ప్లాన్‌ను రేవంత్ పరిశీలించారు. మేడారం జాతర ఏర్పాట్లు, అభిృద్ధిపై సీఎం సమీక్షించనున్నారు.

  • 23 Sep 2025 12:25 PM (IST)

    కృష్ణా ట్రిబ్యునల్‌లో గట్టి వాదనలు వినిపిస్తాం

    కృష్ణా ట్రిబ్యునల్‌లో తెలంగాణకు న్యాయమైన వాటా సాధించేందుకు గట్టి వాదనలు వినిపిస్తామని మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అన్నారు. ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు కృష్ణా ట్రిబ్యునల్‌ విచారణలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. ట్రైబ్యునల్‌ ముందు తెలంగాణ ప్రభుత్వం తరఫున జరిగే వాదనలను స్వయంగా పరిశీలించనున్నట్లు మంత్రి తెలిపారు. కృష్ణా నది జలాల్లో రాష్ట్రానికి న్యాయబద్ధమైన వాటాను సాధించి తీరుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

  • 23 Sep 2025 12:11 PM (IST)

    పండుగ కానుకలపై కేంద్రం కీలక నిర్ణయం..

    పండుగల సందర్భంగా ప్రభుత్వ శాఖలు, విభాగాలు ఇచ్చే కానుకలపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీపావళి వంటి పండుగల వేళ ప్రజల సొమ్ముతో కానుకలు ఇచ్చిపుచ్చుకోవద్దని కేంద్ర ఆర్థిక శాఖ అన్ని మంత్రిత్వ శాఖలు, విభాగాలకు ఆదేశాలు జారీ చేసింది. ఆర్థిక క్రమశిక్షణను పాటించడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అనవసర ఖర్చులను తగ్గించి, ప్రభుత్వ నిధులను మరింత సమర్థంగా ఉపయోగించాలనే ఉద్దేశంతో ఈ చర్యలు చేపట్టింది.

  • 23 Sep 2025 11:55 AM (IST)

    పాడుబడిన షెడ్డులో 100కిలోల గంజాయి

    సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో భారీగా గంజాయి పట్టుబడింది. కోదాడలో ఒక పాడుబడిన షెడ్డులో 5 బస్తాల్లో దాదాపు 100 కిలోల గంజాయిని పోలీసులు గుర్తించారు. పోలీసులు తనిఖీలకు వెళ్లిన సమయంలో గంజాయి బస్తాలను అక్కడే వదిలేసి నిందితులు పరారైనట్లు తెలిసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

  • 23 Sep 2025 11:32 AM (IST)

    రేపు ఏపీకి ఉపరాష్ట్రపతి

    ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ బుధవారం ఏపీకి రానున్నారు. ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఆయన ఏపీ పర్యటనకు వస్తున్నారు. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలతో పాటు.. విజయవాడ ఉత్సవ్‌కు రాధాకృష్ణన్‌ హాజరుకానున్నారు.

  • 23 Sep 2025 11:15 AM (IST)

    చర్చకు సిద్ధంగా ఉన్నాం – లోకేశ్

    ఆంధ్రప్రదేశ్‌లో ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి నారా లోకేశ్‌ తెలిపారు. శాసన మండలిలో వైసీపీ సభ్యులు చేసిన విమర్శలకు ఆయన సమాధానమిస్తూ.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలపై బహిరంగ చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో భారీగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు పేరుకుపోయాయని లోకేశ్‌ ఆరోపించారు. ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ నేతలు తమపై విమర్శలు చేయడం సరికాదన్నారు.

  • 23 Sep 2025 11:00 AM (IST)

    గాయత్రీ దేవి రూపంలో దుర్గమ్మ దర్శనం

    విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు రెండో రోజు గాయత్రీ దేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవాల సందర్భంగా మంత్రులు అనిత, కొండపల్లి సంధ్యారాణి, గుమ్మడి సవిత దుర్గమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కాగా ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది.

  • 23 Sep 2025 10:41 AM (IST)

    గోడ కూలి తండ్రీకూతుళ్లు మృతి

    నిజామాబాద్ జిల్లా కోటగిరిలో జరిగిన ఒక విషాదం చోటుచేసుకుంది. ఇంటి గోడ కూలి ఒక తండ్రికూతుళ్లు మరణించారు. అర్ధరాత్రి సమయంలో వారి ఇంటి గోడ కూలడంతో నిద్రిస్తున్న తండ్రి, కుమార్తె శిథిలాల కింద చిక్కుకున్నారు. సహాయక చర్యలు చేపట్టినా అప్పటికే వారిద్దరూ మరణించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.

  • 23 Sep 2025 10:15 AM (IST)

    రోడ్డు ప్రమాదంలో స్టూడెంట్ మృతి..

    హైదరాబాద్ హయత్‌నగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన ఒక వాహనం ఇంజినీరింగ్ స్టూడెంట్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో యువతి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

  • 23 Sep 2025 09:44 AM (IST)

    కోల్‌కతాలో భారీ వర్షాలు.. ఐదుగురు మరణం

    కోల్‌కతాను భారీ వర్షాలు ముంచెత్తాయి. వర్షాల వల్ల ఐదుగురు మరణించారు. లోతట్టు ప్రాంతాలు జలమయం అవడంతో జనజీవనం స్తంభించిపోయింది. కొన్ని ప్రాంతాల్లో ఇళ్లు, రోడ్లు పూర్తిగా మునిగిపోయాయి. రహదారులపై నీరు నిలవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మెట్రో రైలు సేవలు కూడా నిలిచిపోయాయి.

  • 23 Sep 2025 09:06 AM (IST)

    తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు నేడు అంకురార్పణ

    తిరుమల శ్రీవారి వారి సాలకట్ల వార్షిక బ్రహ్మోత్సవాలు రేపటి నుంచి ప్రారభం కానున్నాయి. అక్టోబర్ 2 వరకు జరగనున్న ఈ బ్రహ్మోత్సవాలకు ఇవాళ సాయంత్రం వేదం పండితులు అంకురార్పణ చేయనున్నారు. వైఖానస ఆగమ సాంప్రదాయం ప్రకారం రాత్రి 7 నుంచి 8 గంటల మధ్యలో నిర్వహించే అంకురార్పణ ఘట్టంతో ఈ బ్రహ్మోత్సవాలకు బీజం పడనుంది. స్వామివారి ఆలయంలోని యాగశాలలో అంకురార్పణ ఘట్టాన్ని శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు.

  • 23 Sep 2025 08:36 AM (IST)

    భారత్ మాకు చాలా ముఖ్యం – రూబియో

    అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఇరు దేశాల మధ్య వాణిజ్యం, రక్షణ, ఇంధనం, కీలక ఖనిజాలు వంటి అనేక అంశాలపై చర్చలు జరిగాయి. సందర్భంగా భారత్‌తో సంబంధాలు అమెరికాకు ఎంతో ముఖ్యమని రూబియో తెలిపారు. భారత్, అమెరికా మధ్య స్నేహ బంధం మరింత బలపడుతుందని రూబియో స్పష్టం చేశారు.

  • 23 Sep 2025 08:02 AM (IST)

    చిరు – పవన్ కలిసి సినిమా.. ఆర్జీవీ ఇంట్రెస్టింట్ కామెంట్స్

    మెగాస్టార్ చిరంజీవి సినీ రంగ ప్రవేశం చేసి 46 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సోషల్ మీడియాలో పోస్టుల వెల్లువ కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆయన తమ్ముడు, జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కూడా ఒక ప్రత్యేక పోస్ట్‌తో అన్నయ్యకు శుభాకాంక్షలు తెలిపారు. పవన్ కల్యాణ్ చేసిన పోస్ట్‌ను రామ్ గోపాల్ వర్మ రీషేర్ చేస్తూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. “మీరిద్దరూ కలిసి ఒక సినిమా చేస్తే, అది ఈ శతాబ్దంలోనే ఒక మెగా పవర్ మూవీ అవుతుంది” అని అన్నారు. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

  • 23 Sep 2025 07:18 AM (IST)

    ఇవాళ మేడారంకు సీఎం రేవంత్

    ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి మేడారంలో పర్యటించనున్నారు. జాతర ఏర్పాట్లను స్వయంగా పరిశీలించనున్నారు. ఇంతకాలం జాతరకు తాత్కాలిక ఏర్పాట్లు మాత్రమే చేశారని.. అయితే ఈసారి శాశ్వత నిర్మాణాలపై దృష్టి పెడతామని సీఎం తెలిపారు. పెరుగుతున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, దర్శన, బెల్లం సమర్పణ, జంపన్న వాగు స్నాన ఘాట్ల వద్ద వసతి, సదుపాయాలను మెరుగుపరచాలని నిర్ణయించారు. గద్దెల ప్రాంగణంలో చేపట్టే పనులకు గ్రానైట్ మరియు లైమ్‌స్టోన్ వంటి విలువైన రాళ్లను ఉపయోగించనున్నారు. స్థానిక పూజారులు, పెద్దలతో ఆలయ అభివృద్ధి పనులపై సీఎం సమీక్షించనున్నారు. మేడారం జాతరను ప్రపంచ పటంలో నిలబెట్టి, ఆధ్యాత్మిక పర్యాటకాన్ని ప్రోత్సహించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

  • 23 Sep 2025 07:03 AM (IST)

    నేడు తెలంగాణలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

    బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల తెలంగాణలో రాగల నాలుగు రోజులు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ కొమరం భీం, మంచిర్యాల, నిర్మల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములతో కూడిన మోస్తరు వర్షం పడొచ్చు. రేపు తెలంగాణలోని అన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

  • 23 Sep 2025 06:52 AM (IST)

    ఇవాళ, రేపు ఏపీలో భారీ వర్షాలు

    ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ అల్పపీడనం రాబోయే రోజుల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది సెప్టెంబర్ 27వ తేదీన దక్షిణ ఒడిశా మరియు ఉత్తరాంధ్ర తీరాలను దాటవచ్చని అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో నేడు, రేపు ఉత్తరాంధ్రలోని పలు జిల్లాల్లో ఉరుములతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 25వ తేదీన మరో అల్పపీడనం ఏర్పడటానికి అవకాశం ఉందని తెలిపింది.

  • 21 Sep 2025 01:24 PM (IST)

    పేలిన గ్యాస్ సిలెండర్.. ఇళ్లు, పశువులు అగ్నికి అహుతి!

    విజయనగరం బొండపల్లి మండలం తమటాడలో అగ్ని ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా ఎగిసిపడ్డ మంటలు. పూరిళ్లు, పశువుల దగ్దం. ప్రమాదంలో పేలిన గ్యాస్ సిలెండర్. భయాందోళనకు గురైన స్థానికులు. తప్పిన ప్రాణాపాయం.

Published On - Sep 23,2025 6:47 AM