AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీలో స్థానిక సమరానికి సై.. ఆ రోజే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల..!

రిజర్వేషన్ల పంచాయితీ ముగిసింది. ఇక మిగిలింది, సమరమేనంటోంది ఏపీ రాజకీయం. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న స్థానిక ఎన్నికలకు కోడ్ కూసే సమయం ఆసన్నమైంది. ఏ క్షణమైనా ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చేందుకు రూట్ క్లియర్ అవడంతో.. పొలిటికల్ ఫీల్డ్‌లో పార్టీలన్నీ సై అంటున్నాయి. ఇటు మంత్రులు, పార్టీ నేతలకు చంద్రబాబు ఆదేశాలు.. అటు పార్టీ నేతలు, లీగల్‌సెల్‌కు వైసీపీ నేతల దిశానిర్దేశంతో పాలిటిక్స్ హీటెక్కాయి.

ఏపీలో స్థానిక సమరానికి సై.. ఆ రోజే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల..!
Ap Local Body Elections 2026
Shaik Madar Saheb
|

Updated on: Oct 11, 2026 | 10:19 AM

Share

ఏపీలో స్థానిక ఎన్నికలకు ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. రిజర్వేషన్లపైనా స్పష్టత ఇవ్వడంతో.. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించేందుకు అన్ని అడ్డంకులు తొలగిపోయినట్టు అయింది. దీంతో.. ఫుల్ యాక్షన్‌లోకి దిగింది ఎన్నికల సంఘం. ఈనెల 13న రాజకీయ పార్టీలతో ఎస్ఈసీ సమావేశం కాబోతోంది. ఆ తర్వాత, ఏ క్షణమైనా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఈ నెల 14 లేదా 15న ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. మూడు దశల్లో స్థానిక ఎన్నికలు నిర్వహించి.. నవంబర్ 30లోపు ఎన్నికల ప్రక్రియను పూర్తిచేయాలనే ఈసీ ఉన్నట్టుగా పొలిటికల్ సర్కిల్‌లో టాక్ వినిపిస్తోంది.

ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని ఇప్పటికే అధికారపక్షం ప్రకటించింది. ఇప్పుడు అంతా ఎన్నికల సంఘం చేతుల్లోనే ఉందని అంటోంది అధికారపక్షం.. దీనికోసం కసరత్తులు కూడా ప్రారంభించింది.

కూటమి అభ్యర్థుల గెలుపు బాధ్యత ఇన్‌ఛార్జ్ మంత్రులదే

మరోవైపు.. మంత్రులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలిచ్చారు. స్థానిక ఎన్నికల్లో మంత్రులంతా బాధ్యత తీసుకోవాలన్నారు. కూటమి అభ్యర్థుల గెలుపు బాధ్యత ఇన్‌ఛార్జ్ మంత్రులదేనని స్పష్టం చేశారు. మూడు పార్టీల మధ్య సమన్వయంతో ముందుకు వెళ్లాలన్నారు. ఏ ఒక్క స్థానం ఓడిపోవడానికి వీలులేదు.. 100 శాతం స్థానాలు గెలుచుకొని తీరాల్సిందేనన్నారు. నవంబర్ 15 నాటికి ఎన్నికల పనులు పూర్తి చేసుకుని రెగ్యులర్ విధుల్లోకి రావాలన్నారు సీఎం చంద్రబాబు.

లీగల్‌ టీమ్‌ను అప్రమత్తం చేసిన వైసీపీ

ఇక.. వైసీపీ కూడా ఎన్నికల్లో అన్ని అస్త్రాలను ప్రయోగించేందుకు సిద్ధమవుతోంది. పార్టీలోని అన్ని విభాగాలను వైసీపీ అప్రమత్తం చేస్తోంది. నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ఫలితాల ప్రకటన వరకు.. ఎవరెవరి బాధ్యత ఏంటనేది స్పష్టంగా దిశానిర్దేశం చేస్తోంది. ముఖ్యంగా.. లీగల్‌ టీమ్‌ను అప్రమత్తం చేసింది. పార్టీ అభ్యర్థులు, మద్దతుదారులకు అండగా నిలవాలనీ.. అవసరమైతే టాస్క్‌‌‌ఫోర్స్ ఏర్పాటు చేసుకోవాలని భావిస్తోంది.

వందశాతం గెలుపే లక్ష్యంగా కూటమి లక్ష్యంగా పనిచేస్తూంటే.. ఒక్క సీటు కూడా ఏకగ్రీవం కానివ్వబోమంటోంది వైసీపీ. మరి.. లోకల్ సమరంలో ఏం జరుగుతుందో చూడాలి.

Follow Us