తెలంగాణ సీఏం కేసీఆర్ తన టీఆర్ ఎస్ పార్టీ పేరును బీఆర్ ఎస్ గా మారుస్తూ.. ఇక నుంచి జాతీయ రాజకీయాల్లో అరంగ్రేటం చేస్తున్నట్లు ప్రకటించారు. తొలుత కర్ణాటక, మహారాష్ట్రలో పార్టీ యాక్టివిటీ ప్రారంభిస్తామని వెల్లడించారు. దశలవారీ పార్టీని దేశ వ్యాప్తంగా విస్తరిస్తామని కూడా ప్రకటించారు. అయితే కేసీఆర్ కొత్త పార్టీ ఆంధ్రప్రదేశ్ లో పోటీ చేస్తుందా లేదా అనే చర్చ గత కొద్దిరోజులుగా సాగుతోంది. కేసీఆర్ పై ఆంధ్రప్రదేశ్ ప్రజలు వ్యతిరేకంగా ఉంటారని, ఆయన ఏ అజెండాతో ఏపీలో పోటీ చేస్తారనే అభిప్రాయాలు కొన్ని రాజకీయ పక్షాల నుంచి వినిపిస్తున్నాయి. తాజాగా బీజేపీ నేత జీవీఎల్.నరసింహరావు కూడా బీఆర్ ఎస్ పార్టీపై స్పందిస్తూ.. ఆంధ్రప్రదేశ్ కు బీఆర్ ఎస్ రావాలని, అదే సమయంలో తాము ఆ పార్టీని ప్రశ్నిస్తామంటూ చెప్పుకొచ్చారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీ కూడా కేసీఆర్ బీఆర్ ఎస్ పార్టీపై ఆచీతూచీ స్పందించింది. ప్రస్తుతానికి పార్టీ పేరు ప్రకటించారు మినహా, రాజకీయ అజెండాను, వచ్చే ఎన్నికల్లె ఏయే రాష్ట్రాల్లో పోటీ చేస్తామనేది స్పష్టంగా చెప్పలేదు. దీంతో కేసీఆర్ స్పష్టత ఇచ్చిన తర్వాత స్పందిద్దామనే ధోరణిలో మరికొన్ని రాజకీయ పక్షాలు ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా వైసీపీ నాయకులు మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో కొత్త పార్టీలను తాము స్వాగతిస్తామని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. కేసీఆర్ పార్టీతో తమకు వచ్చిన ఇబ్బంది ఏమి లేదని మంత్రి బొత్స సత్యనారాయణ కూడా వ్యాఖ్యానించారు. కేసీఆర్ కొత్త పార్టీపై చర్చ నడుస్తున్న క్రమంలో కోనసీమ బీఆర్ ఎస్ పార్టీ పేరుతో వెలసిన ఫ్లెక్సీలు కలకం సృష్టిస్తున్నాయి. పార్టీ పేరు ప్రకటన మినహా కేసీఆర్ ఏ రాష్ట్రంలోనూ అధికారికంగా పార్టీ కమిటీలను గాని, నియోజకవర్గ ఇన్ ఛార్జిలను ప్రకటించలేదు. అయినప్పటికి కోనసీమలోని అమలాపురం పట్టణంలో అమలాపురం పార్లమెంటు నియోజకవర్గం బీఆర్ ఎస్ ఏంపీ అభ్యర్థినంటూ ఫ్లెక్సీలు వెలిశాయి.
రేవు అమ్మాజీరావు పేరుతో ఈ ఫ్లెక్సీలను ఏర్పాటుచేశారు. పార్టీ పేరు ప్రకటించిన రెండు రోజుల్లోనే ఏపీలో బ్యానర్లు వెలవడంపై స్థానికులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే గతంలో కూడా కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఫ్లేక్సీలు ఏర్పాటు చేశారు. అప్పట్లో ఇది పెద్ద సంచలనమే సృష్టించింది. ఆంధ్రప్రదేశ్ అందులోనూ కోనసీమలో ఆయన ఫ్లెక్సీలు ఎవరు ఏర్పాటు చేశారనే చర్చకూడా నడిచింది. తాజాగా బీఆర్ ఎస్ పార్టీ పేరుతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం కలకలం రేపుతోంది. అయితే దీనిపై బీఆర్ ఎస్ పార్టీ నుంచి ఎటువంటి స్పందన రాలేదు. అయితే కనీసం కమిటీలు కూడా ప్రకటించకుండా ఏకంగా తాను ఏంపీ అభ్యర్థినంటూ ప్రకటించుకోవడం కూడా కలకలం రేపుతోంది. బీఆర్ ఎస్ నాయకులకు తెలిసే ఈఫ్లెక్సీలను ఏర్పాటు చేశారా, లేదా దీని వెనుకాల ఏదైనా రాజకీయ వ్యూహాం ఉందా అనేది కూడా తెలియాల్సి ఉంది. అసలు బీఆర్ పార్టీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే ఆంధ్రప్రదేశ్ లో ఎలాంటి రియాక్షన్ ఉంటుందనేది విషయం తెలుసుకోవడానికి కూడా ఎవరైనా ఈ బ్యానర్లు కట్టారా అనే అనుమానాలను కొంతమంది లేవనెత్తుతున్నారు.
విజయదశమి పర్వదినం సందర్భంగా తెలంగాణ సీఏం కేసీఆర్ టీఆర్ ఎస్ పార్టీని భారత్ రాష్ట్ర సమితిగా మార్పు చేస్తూ టీఆర్ సర్వసభ్య సమావేశంలో తీర్మానం చేశారు. బీఆర్ ఎస్ ను కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించినప్పటికి, అది కొంత కాలం ప్రాంతీయ పార్టీగానే కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఏదైనా రాజకీయ పార్టీ జాతీయ పార్టీ గుర్తింపు పొందాలంటే దానికి కొన్ని నిబంధనలను కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించింది. దేశ వ్యాప్తంగా పార్టీని విస్తరించడం కోసం కేసీఆర్ తన పార్టీ పేరును మార్చినప్పటికి అది జాతీయ పార్టీగా అవతరించాలంటే ఎన్నికల సంఘం నిర్దేశించిన లక్షణాలు కలిగి ఉండాలి. దీంతో వచ్చే ఎన్నికల్లో బీఆర్ ఎస్ తరపున పోటీ చేసినా, అది జాతీయ గుర్తింపు పొందేవరకు ఆ ప్రాంతంలోని ప్రాంతీయ పార్టీగానే పరిగణిస్తారు. దీంతో ఏపీలో పార్టీ కార్యకలాపాలపై కేసీఆర్ స్పష్టమైన ప్రకటన ఏమి చేయలేదు. అయితే నాయకులు మాత్రం కొంతమంది తాము బీఆర్ ఎస్ అంటూ ప్రచారం మొదలుపెట్టడం ఇప్పుడు కోనసీమ ప్రాంతంలో హట్ టాపిక్ గా మారింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి..