Andhra News: మొంథా తుఫాన్ నష్టంపై కేంద్రానికి ఏపీ ప్రభుత్వం ప్రాథమిక నివేదిక
మొంథా తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌కు నష్టంపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రాథమిక నివేదికను సమర్పించింది. తుఫాన్ కారణంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని రంగాల్లో కలిసి రూ.5,244 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు వెల్లడించింది. ఈ మేరకు రాష్ట్రంలోని తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను పరిశీలించేందుకు కేంద్ర బృందాలని కోరింది.

మొంథా తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ అతలాకుతలం అయ్యింది. చాలా ప్రాంతాల్లో ఇళ్లు నీట మునిగాయి. పంట పొలాలు నాశనం అయ్యాయి. రోడ్లు , రైల్వే ట్రాక్‌లు తెగిపోయాయి. ఈ నేపథ్యంలో తుఫాన్ ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా జరిగిన నష్టాన్ని ప్రభుత్వం అంచనా వేసింది. మొత్తం 17 శాఖల్లో కలిసి రూ.5,244 కోట్లు నష్టం జరిగినట్టు ప్రాథమికంగా అంచనా వేసింది. అయితే తాజాగా ఈ అంశాన్ని ప్రభుత్వం కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది. మొంథా తుఫాన్ ప్రభావంతో ఏపీకి జరిగిన నష్టంపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రాథమిక నివేదికను అందించింది. తుఫాన్ కారణంగా మొత్తం 17 శాఖలు దెబ్బతిన్నాయని.. మొత్తం కలిసి రూ. 5,244 కోట్లు నష్టం వాటిల్లినట్టు పేర్కొంది.
ఈ మేరకు రాష్ట్రంలోని తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను పరిశీలించేందుకు కేంద్ర బృందాలను పంపాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని 249 మండలాల పరిధిలోని 1,434 గ్రామాలు, 48 పట్టణాలపై తుఫాన్ ప్రభావం పడ్డట్టు నివేదిక సమర్పించారు. 161 మండలాల్లో అత్యధిక వర్షపాతం నమోదైందని.. ఈ కారణంగా 4,794 కి.మీ. ఆర్ అండ్ బీ రహదారులు దెబ్బతినడంలో రూ. 2774 కోట్ల నష్టం వాటినట్టు పేర్కొంది.
రాష్ట్రంలో శాఖల వారిగా జరిగిన నష్టం
- 4,794 కి.మీ. మేర దెబ్బతిన్న ఆర్ అండ్ బీ రహదారులు- రూ. 2774 కోట్ల నష్టం
- 1.38 లక్షల హెక్టార్లలో దెబ్బతిన్న పంట- రూ. 829 కోట్ల నష్టం
- ఉద్యానవన పంటలు – రూ. 40 కోట్ల నష్టం
- ఆక్వారంగంలో 32 వేల ఎకరాల్లోని దెబ్బతిన్న పంట రూ.514 కోట్ల
- విద్యుత్ శాఖకు రూ.19 కోట్ల నష్టం
- నీటిపారుదల శాఖకు రూ. 234 కోట్ల నష్టం
- తుఫాన్ కారణంగా 23 జిల్లాల పరిధిలోని 3,045 ఇళ్లు ధ్వంసం
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
