AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sajjala Ramakrishna Reddy: గొడవలు సృష్టించేది వారే.. ఆరోపణలు చేసేది వారే.. సజ్జల సంచలన కామెంట్స్..

కుట్రలకు సంబంధించి రాష్ట్రంలో కొత్త ట్రెండ్ కనిపిస్తోందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. విశాఖలో చేసిన డ్రామా ఈ విషయాన్ని స్పష్టం చేస్తోందని విమర్శించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో...

Sajjala Ramakrishna Reddy: గొడవలు సృష్టించేది వారే.. ఆరోపణలు చేసేది వారే.. సజ్జల సంచలన కామెంట్స్..
Sajjala Ramakrishna Reddy
Ganesh Mudavath
|

Updated on: Nov 10, 2022 | 7:05 PM

Share

కుట్రలకు సంబంధించి రాష్ట్రంలో కొత్త ట్రెండ్ కనిపిస్తోందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. విశాఖలో చేసిన డ్రామా ఈ విషయాన్ని స్పష్టం చేస్తోందని విమర్శించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో ముఖ్యమంత్రి జగన్ ను కుర్చీ నుంచి దించేయడానికి కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటం గ్రామానికి పరామర్శ పేరుతో పవన్ కల్యాణ్, నారా లోకేష్ లు రావడం వారి మధ్య ఉన్న పొత్తులను స్పష్టం చేస్తున్నాయన్నారు. చంద్రబాబు నాయుడు నందిగామ పర్యటనలో తనపై రాళ్ల దాడి జరిగిందంటూ ఆరోపణలు చేయడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. తమ అవసరాల కోసం ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని సజ్జల ఆక్షేపించారు. ఏడాదిన్నరలో ఎన్నికలు రాబోతున్నాయన్న సజ్జల.. నిజాయతీ, నిబద్ధత ఉంటే చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ కలిసి ఎందుకు పోటీ చేయాలనుకుంటున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పనితీరులో లోపాలు ఉంటే వాటిని చెప్పడంలో తప్పులేదన్నారు.

ఇప్పటం ఘటనలో పవన్ కల్యాణ్ అంత ఆవేశంగా ఎందుకు వచ్చారో అర్థం కాలేదు. పవన్ కల్యాణ్ సభకు స్థలాలు ఇచ్చిన ఏ ఒక్కరూ ఆక్రమణల తొలగింపులో లేరు. సభకు భూములు ఇచ్చిన వారెవరివీ గోడలు కూడా కూల్చలేదు. చంద్రబాబు కాన్వాయ్ పై రాయి ఘటన, ఆ తర్వాత రోజు ఇప్పటం గ్రామంలో పవన్ పర్యటన, వాళ్లకు వాళ్లు ఓ సంఘటనను సృష్టించుకున్నట్లుగా ఉంది. ఏమీ లేని దానికి ఒక కుట్రను ఆపాదించి, వారి స్క్రిప్ట్ ప్రకారం అసత్య ప్రచారం చేస్తున్నారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం అని చెప్పుకునే చంద్రబాబు వ్యవహరించాల్సిన తీరు ఇదేనా?. చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో అర చేతిలో వైకుంఠం చూపించారు. అమరావతి పేరుతో మాయాబజార్ సృష్టించారు. విత్తనాలు, ఎరువుల కోసం రైతులు రోడ్లు ఎక్కాల్సి వచ్చేది.

– సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ సలహాదారు

ఇవి కూడా చదవండి

కరోనా విపత్కర సమయం మినహాయిస్తే, మూడేళ్లలో చాలా అభివృద్ధి చేశామన్న సజ్జల.. స్పష్టంగా కనిపిస్తున్నా ప్రతిపక్షాల ఆరోపణలు చేయడం అర్ధరహితమన్నారు. సంక్షేమ పథకాల ద్వారా 80 శాతానికి పైగా కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయని చెప్పారు. దిశ చట్టం స్ఫూర్తితో ప్రభుత్వం, పోలీసులు పనిచేస్తూ సత్వరమే చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. మహిళల భద్రతకు సంబంధించి తక్షణమే స్పందిస్తూ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. జగనన్న ఇళ్ల పథకం ద్వారా 2021 జూన్ లో నిర్మాణాలు ప్రారంభించినట్లు సజ్జల వివరించారు. 600లకు పైగా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక చంద్రబాబు ఏం చేశారని నిలదీశారు. అర్హులైన అందరికీ 3 సెంట్ల స్థలంలో పక్కా గృహాలు కట్టిస్తామన్న టీడీపీ, బీజేపీ- జనసేన జాయింట్ ప్రకటన చేయలేదా అని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో 5 ఏళ్ల పాటు ఏమీ చేయకుండా, లక్షల కోట్లు దోచుకుని అవినీతి, అక్రమాలు, ఆరాచకాలకు పాల్పడ్డారని విమర్శించారు.

లిక్కర్ స్కాంలో విజయసాయిరెడ్డి కుటుంబ సభ్యులెవరూ లేరని చెప్పారు. ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆప్, తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్, కేంద్రంలోని బీజేపీ ఇటీవల కాలంలో ఆ పార్టీ నాయకులు పరస్పరం చేసుకుంటున్న ఆరోపణలను బట్టి చూస్తే.. ఈ అంశం వారికి సంబంధించిందని సజ్జల చెప్పారు. ఢిల్లీ లిక్కర్ స్కాంతో వైసీపీ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. మంత్రి ధర్మాన ప్రసాదరావు వికేంద్రీకరణ గురించి మాట్లాడితే ఆయన మాటలనూ వక్రీకరించారన్న సజ్జల… ప్రభుత్వం అమలు చేస్తున్న సంస్కరణల ఫలాలు రావడానికి సమయం పడుతుందన్నారు. యోగి వేమన విశ్వవిద్యాలయంలో ఉన్న వేమన విగ్రహాన్ని, బయటకు తెచ్చి, అందంగా తీర్చిదిద్దిన ముఖద్వారం వద్ద పెట్టి, ఆ విగ్రహానికి మరింత ప్రాముఖ్యతను ఇస్తే.. దానిని కూడా వక్రీకరిస్తూ అసత్య ప్రచారాలు చేస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..