AP News: వేసవి చాలా హాట్ గురూ.! ఏపీలో మండుతున్న ఎండలు.. బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ
ఏపీ ప్రజలకు తీవ్ర హెచ్చరిక. విపత్తుల నిర్వహణ సంస్థ కీలక సూచనలు ఇచ్చింది. మంగళ, బుధవారాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరి ఆ వాతావరణ సూచనలు ఏంటి.? ప్రజలకు ఇచ్చిన అలెర్ట్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..

తెలుగు రాష్ట్రాల్లో పగటిపూట ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతున్నాయి. మంగళవారం(మార్చి 11) నాడు ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలోని కూనవరం, వరరామచంద్రాపురం.. అలాగే ఏలూరు జిల్లా వేలేర్పాడు.. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ, సీతంపేట, శ్రీకాకుళం జిల్లా బూర్జ, హీరామండలం, లక్ష్మీనర్సుపేట మండలాల్లో తీవ్ర వడగాల్పుల(8) ప్రభావం ఉండే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. అలాగే రేపు రాష్ట్రంలోని 62 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు.
శ్రీకాకుళం జిల్లాలో 11 మండలాలు, విజయనగరంలో 16 మండలాలు, పార్వతీపురంమన్యంలో 10 మండలాలు, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 10 మండలాలు, అనకాపల్లిలో 2 మండలాలు, కాకినాడ, కోనసీమలో చెరో మండలం.. తూర్పుగోదావరి జిల్లాలో 8 మండలాలు, ఏలూరులో 3 మండలాలు ఈ లిస్టులో ఉన్నాయి. ఆయా మండలాల్లో వడగాల్పులు ప్రభావం ఉండే అవకాశముందన్నారు. బుధవారం 13 మండలాల్లో తీవ్ర, 162 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
సోమవారం నంద్యాల జిల్లా బండి ఆత్మకూరులో 38.3 డిగ్రీలు, అల్లూరి సీతారామరాజు ఎర్రంపేటలో 37.6 డిగ్రీలు, చిత్తూరు జిల్లా గుడిపాలలో 37.3 డిగ్రీలు, పల్నాడు జిల్లా వినుకొండలో 36.7 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు. ఎండదెబ్బ తగలకుండా టోపీ, గొడుగు, టవల్, కాటన్ దుస్తులు ఉపయోగించాలి. వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలి. చెవుల్లోకి వేడిగాలి వెళ్ళకుండా జాగ్రత్త పడాలన్నారు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ. గుండె సంబంధిత వ్యాధులు, షుగర్, బీపీ ఉన్నవారు ఎండలో తిరగకూడదని, శారీరక శ్రమతో కూడిన కఠినమైన పనులను ఎండలో చేయరాదని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి కూర్మనాథ్ సూచించారు.