Andhra Pradesh: సీఎం జగన్ కడన పర్యటన.. మూడు రోజులపాటు జిల్లాలోనే..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మూడు రోజుల పాటు కడప జిల్లాలో పర్యటిస్తారు. కమలాపురం, పులివెందుల, కడప నియోజకవర్గాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మూడు రోజుల పాటు కడప జిల్లాలో పర్యటిస్తారు. కమలాపురం, పులివెందుల, కడప నియోజకవర్గాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారు. ఇక కడప జిల్లాలో సీఎం జగన్ పర్యటన కోసం ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఇవాళ ఉదయం 11.30 గంటలకు కడప ఎయిర్‌పోర్టుకు సీఎం చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా పెద్ద దర్గాకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. ఆ తర్వాత ప్రైవేటు కార్యక్రమాల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 2 గంటల 15 నిముషాలకు కమలాపురంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హాజరవుతారు.
రూ. 902 కోట్లతో చేపట్టే అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారు. రూ. 213 కోట్లతో GNSSప్యాకేజీ-11 పనులు, వామికొండకు మట్టి కట్ట ఏర్పాటు పనులు, రూ. 150 కోట్లతో మెగా ఇండస్ట్రియల్ పార్క్, రూ. 54 కోట్లతో కమలాపురం జాతీయ రహదారి వంతెన నిర్మాణం, రూ. 48.50 కోట్లతో కమలాపురం పట్టణానికి బైపాస్ రోడ్డు, రూ. 39 కోట్లతో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం పనులకు సీఎం శంకుస్థాపన చేస్తారు. రూ. 34 కోట్లతో వైఎస్ఆర్ ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ ఎగ్జిక్యూటివ్ సెంటర్ భవనం నిర్మాణం, రూ. 25 కోట్లతో కడప జిల్లాలో NH-18ని కలుపుతూ రోడ్డు విస్తరణ పనుల సంబందించిన అభివృద్ధి పనులకు సీఎం ఫౌండేషన్ స్టోన్ వేయనున్నారు.
కమలాపురం సభ తర్వాత తిరిగి కడపకు వస్తారు. అక్కడ అరగంట సేపు స్థానిక నేతలతో మాట్లాడుతారు. ఆ తర్వాత ఇడుపులపాయకు వెళ్లి రాత్రి అక్కడ బస చేస్తారు. శనివారం ఉదయం పులివెందుల చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. ఆ తర్వాత పులివెందుల నియోజకవర్గంలో అభివృద్ధి పనులతో పాటు కొత్త బస్టాండ్‌ను ప్రారంభిస్తారు. 25న క్రిస్మస్ ప్రార్థనల్లో పాల్గొని.. మధ్యాహ్నం తర్వాత తాడేపల్లి నివాసానికి బయల్దేరి వెళతారు.




మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
