Andhra Pradesh: భూ వివాదాల పరిష్కారానికై జగన్ కీలక నిర్ణయం.. ప్రతి మండల కేంద్రంలో ట్రైబ్యునల్ ఏర్పాటుకు..
Andhra Pradesh: భూ వివాదాల పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే జగనన్న శాశ్వత భూహక్కు భూరక్ష కార్యక్రమాన్ని...
Andhra Pradesh: భూ వివాదాల పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే జగనన్న శాశ్వత భూహక్కు భూరక్ష కార్యక్రమాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం కింద సర్వే ముగిశాక కూడా ట్రైబ్యునల్ కొనసాగనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ప్రతి మండల కేంద్రంలో భూ వివాదాల పరిష్కారం కోసం ట్రైబ్యునల్ ఏర్పాటు చేయాలని, ఈ ట్రైబ్యునల్ యూనిట్లు శాశ్వత ప్రాతిపదికన పనిచేయాలని సీఎం ఆదేశించారు. మంగళవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జగనన్న శాశ్వత భూహక్కు భూరక్ష కార్యక్రమంపై సీఎం సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. సర్వే చేసే సమయంలో తలెత్తే వివాదాల పరిష్కారానికి సరైన యంత్రాంగం ఉండాలని అధికారులకు సూచించారు. మొబైల్ ట్రైబ్యునల్ యూనిట్లు ఉండాలని, దీనిపై సమగ్ర కార్యాచరణ రూపొందించాలని ఆదేశాలు జారీ చేశారు. భూ వివాదాల పరిష్కారం కోసం అత్యుత్తమ వ్యవస్థను తీసుకరావాలని సీఎం అధికారులకు దిశానిర్ధేశం చేశారు. సర్వే ప్రక్రియలో నాణ్యత కూడా చాలా ముఖ్యమని చెప్పిన ముఖ్యమంత్రి.. సర్వే సందర్భంగా వచ్చే ఫిర్యాదులపై థర్డ్ పార్టీ పర్యవేక్ష ఉండాలని తెలిపారు. అలా చేస్తే పక్షపాతం, వివక్ష, అవినీతికి ఆస్కారం ఉండనది అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లాం, సీఎస్ సమీర్ శర్మతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..