Visakha Agency: రూడకోటలో అంతుపట్టని మరణాలు.. మాయ రోగమా? వ్యవస్థ నిర్లక్ష్యమా?

Visakha Agency: కనీస వసతుల్లేని గిరిజన పల్లె అది. ఆ గ్రామంలోని పిల్లలకు ఏడాది కూడా నిండకుండానే నూరేళ్ల ఆయుష్షు తీరిపోతోంది.

Visakha Agency: రూడకోటలో అంతుపట్టని మరణాలు.. మాయ రోగమా? వ్యవస్థ నిర్లక్ష్యమా?
Rudakota

Edited By:

Updated on: Aug 09, 2022 | 4:02 PM

Visakha Agency: కనీస వసతుల్లేని గిరిజన పల్లె అది. ఆ గ్రామంలోని పిల్లలకు ఏడాది కూడా నిండకుండానే నూరేళ్ల ఆయుష్షు తీరిపోతోంది. ఒక్కరో, ఇద్దరో కాదు, ఏడాదిలో 24మంది చనిపోయారు. లేటెస్ట్‌గా మరో ఆడబిడ్డ మృత్యువాత పడింది. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా రూడకోట అంతుచిక్కని మరణాలపై స్పెషల్‌ స్టోరీ.

ప్రపంచ ఆదివాసీ దినోత్సవం రోజు, రూడకోట శిశు మరణాలు మరోసారి తెరపైకి వచ్చాయ్‌. పాడేరు ఏజెన్సీలోని రూడకోటలో అంతుపట్టని శిశు మరణాలు కొనసాగుతున్నాయ్‌. తాజాగా రెండున్నర నెలల ఆడశిశువు ఊపిరి ఆగిపోయింది. గత మరణాల్లాగే, ఎందుకు చనిపోయిందో? కారణమేంటో? అంతుచిక్కని ప్రశ్నగా మిగిలిపోయింది.

పెదబయలు మండలం రూడకోట గ్రామంలో గతేడాది 24మంది నవజాత శిశువులు అంతుచిక్కని రోగంతో చనిపోయారు. శిశు మరణాలపై ఇన్వెస్టిగేషన్‌ స్టోరీస్‌ టెలికాస్ట్‌ చేసింది టీవీ9. పిల్లలు ఎందుకు చనిపోతున్నారు? కారణాలేంటి? అంతుపట్టని రహస్యమేంటి? అంటూ ప్రత్యేక కథనాలు ప్రసారం చేసింది. అప్పట్లో టీవీ9 కథనాలు అధికారులను పరుగులు పెట్టించాయ్‌.

ఇవి కూడా చదవండి

టీవీ9 వరుస కథనాలతో గిరిజనశాఖ, వైద్యశాఖ స్పందించి, కేజీహెచ్‌ వైద్యబృందంతో అధ్యయనం చేయించారు. కలుషిత నీటి కారణంగానే శిశువులు మరణిస్తున్నారంటూ తేల్చారు. సురక్షిత తాగునీటి కోసం కోటీ 50లక్షల రూపాయలు మంజూరు చేశారు. కానీ, పనులు ప్రారంభం కాకపోవడం, మళ్లీ అవే నీళ్లు తాగాల్సి రావడంతో శిశు మరణాలు కంటిన్యూ అవుతున్నాయ్ అంటూ కన్నీళ్లు పెడుతున్నారు రూడకోట గ్రామస్తులు.

శిశు మరణాలకు పొల్యూటెడ్‌ వాటరో కాదో పూర్తిగా తెలియదు, అసలు ఎందుకు చనిపోతున్నారో తెలియడం లేదంటున్నారు ముగ్గురు పిల్లల్ని పోగొట్టుకున్న ఓ తండ్రి. తన బిడ్డ చనిపోయినప్పుడు, ఎందుకు మరణించిందో తేల్చేందుకు పోస్టుమార్టం చేయమని అడిగినా అధికారులు పట్టించుకోలేదని ఆవేదనతో చెబుతున్నాడు.

రూడకోటలో శిశు మరణాలకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమంటున్నారు గిరిజన నేతలు. ఇంతమంది పిల్లలు చనిపోతున్నా, ఇప్పటికీ పరిష్కారం చూపకపోవడం బాధ్యతా రాహిత్యం కాదా? అని మండిపడుతున్నారు.

శిశు మరణాలకు పొల్యూటెడ్‌ వాటరే కారణమనేది అధికారుల వాదన. టీవీ9 ఇన్వెస్టిగేషన్‌లోనూ ఇదే తేలింది. అయితే, పిల్లలంతా కాళ్లూచేతులు నీలుక్కుని, మెడ వెనక్కి విరుచుకుని చనిపోవడంతో గ్రామంతో తీవ్ర భయాందోళనలు రేపింది. అప్పట్లో ఎంతోమంది గర్భిణీలు గ్రామం విడిచివెళ్లిపోవడం అక్కడ జరుగుతోన్న అంతుపట్టని మరణాలకు నిదర్శనం. అయితే, పిల్లలు ఎందుకు చనిపోతున్నారో ఇప్పటికీ మిస్టరీగానే ఉందంటున్నారు రూడకోట గ్రామస్తులు. అధికారులు చెబుతున్నట్లు కలుషిత నీరే కారణమైతే, సురక్షిత మంచినీరు అందించాలని వేడుకుంటున్నారు. మరి, రూడకోటలో మరణాలకు అధికారులు అడ్డుకట్ట వేస్తారా? లేక, గిరిజనులు అంటున్నట్టుగా మాటలకే పరిమితం అవుతారా?.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..