Vizag Indira Gandhi Zoo: విశాఖ ఇందిరా గాంధీ జూలో ఎలుగుబంటి ‘దివ్య’ మృతి.. పోస్టుమార్టం రిపోర్టులో షాకింగ్
విశాఖలోని ఇందిరా గాంధీ జంతు ప్రదర్శనశాలలో విషాదం చోటు చేసుకుంది. ఇదే జూ లో పుట్టి 20 ఏళ్ల పాటు అందరినీ అలరించిన ఎలుగుబంటి తనువు చాలించింది. ముద్దుగా దివ్య అని దానికి నామకరణం చేసిన జూ సిబ్బంది 20 ఏళ్ల పాటు దానిని కంటికి రెప్పలా కాపాడుకున్నారు. ఇటీవల కాలంలో దివ్య అనారోగ్యం పాలైంది. జూ వెటర్నరీ సిబ్బంది వైద్య పరీక్షలు నిర్వహించగా కిడ్నీ సంబంధిత వ్యాధిగా నిర్ధారణ అయింది. అయినప్పటికీ తగిన వైద్య చికిత్స లను అందించడం తో పాటు అవసరమైన..
విశాఖపట్నం, నవంబర్ 3: విశాఖలోని ఇందిరా గాంధీ జంతు ప్రదర్శనశాలలో విషాదం చోటు చేసుకుంది. ఇదే జూ లో పుట్టి 20 ఏళ్ల పాటు అందరినీ అలరించిన ఎలుగుబంటి తనువు చాలించింది. ముద్దుగా దివ్య అని దానికి నామకరణం చేసిన జూ సిబ్బంది 20 ఏళ్ల పాటు దానిని కంటికి రెప్పలా కాపాడుకున్నారు. ఇటీవల కాలంలో దివ్య అనారోగ్యం పాలైంది. జూ వెటర్నరీ సిబ్బంది వైద్య పరీక్షలు నిర్వహించగా కిడ్నీ సంబంధిత వ్యాధిగా నిర్ధారణ అయింది. అయినప్పటికీ తగిన వైద్య చికిత్స లను అందించడం తో పాటు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవడం తో కొన్నాళ్ళు సర్వైవ్ కాగలిగింది. వ్యాధి తీవ్రత పెరగడంతో నిన్న రాత్రి తనువు చాలించింది దివ్య.
ఎలుగుబంటి దివ్య మరణంతో జూ సిబ్బంది ఒక్కసారిగా విషాదానికి గురయ్యారు. 2003లో విశాఖ జూలోనే జన్మించిన ఎలుగుబంటి 20 ఏళ్లుగా ఇక్కడి సిబ్బంది, వాతావరణం తో మమేకమైపోయింది. దాని సంరక్షణ చూసే సిబ్బంది తో సొంత బిడ్డ లాంటి అనుబంధం, మమకారాన్ని కలిగి ఉండి మిగతా సిబ్బందితో కూడా ఆనందంగా ఉంటూ వాల్లను చూసిన సమయంలో కేరింతలు కొడుతూ, సందర్శకులకు నిరంతరం సందడి చేసే దివ్య మరణం తో సిబ్బంది కంట తడి పెట్టారు. బయట జనం చూడటానికి ఇదొక వన్య ప్రాణి మరణం గా చూస్తారు కానీ మాకు మాత్రం మా కుటుంబ సభ్యులలో ఒకరు మరణించినట్లు గా ఉందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు జూ సిబ్బంది.
దివ్య కు పోస్ట్ మార్టం
కొంత కాలంగా అనారోగ్యం తో బాధపడుతూ జూ లో చికిత్స పొందుతూ మృతి చెందిన దివ్య కు జూ వెటర్నరీ సిబ్బంది పోస్ట్ మార్టం నిర్వహించారు. జంతు ప్రదర్శన శాల నిబంధనల మేరకు నిర్వహించిన ఈ పోస్ట్ మార్టం లో కేవలం కిడ్నీ సంబంధిత వ్యాధి తీవ్రత వల్లే మృతి చెందినట్టు, ఇతర అనారోగ్య కారణాలు ఏవీ లేవని నివేదిక ఇచ్చారు. సీసీ కెమెరాల సమక్షంలో జరిగిన ఈ పోస్ట్ మార్టంలో సీనియర్ వెటర్నరీ డాక్టర్లు పాల్గొన్నారు. వన్యప్రాణులు మరణించినప్పుడు కచ్చితంగా కారణాలను పొందు పరచాలి. లేదంటే సిబ్బంది అలక్ష్యం, అశ్రద్దతో చనిపోయినట్టు రుజువైతే మళ్లీ అదో పెద్ద కేసు, దాని పై చాలా సుదీర్ఘ విచారణలు ఉంటాయ్.
ఎలుగుబంటి జీవిత కాలం 20 సంవత్సరాలు
సాధారణంగా ఎలుగుబంటి జీవిత కాలం 20 నుంచి 25 సంవత్సరాలు. జూ లలో ఉండే ఎలుగు బంట్లు కు జీవిత కాలం ఎక్కువ ఉంటుంది. ఫుడ్ కోసం ఎక్కువ గా శ్రమించాల్సిన అవసరం లేకపోవడం, ఎండ, వాన ల నుండి తగిన సంరక్షణ ఉండడం తో జీవితకాలం ఎక్కువ ఉంటుంది. సాధారణంగా ఎలుగుబంట్లకు భారీ శరీరం, బలమైన కాళ్ళు, పొడవైన మూతి, గరుకైన వెండ్రుకలు, పొట్టి తోక ను కలిగి ఉండి, చూడడానికి గంభీరంగా ఉంటాయి. ఎలుగు బంటి కి పంజాకు ఐదు పదునైన గోర్లుంటాయి. ఎలుగుబంట్లలో శాఖా హారి, మాంసాహారి లు ఉంటాయి. ద్రువపు ఎలుగు బంటి మాంసాహారి అయితే పాండా శాకాహారిగా వెదురు చిగుళ్లను, అడవులలో లభించే ఆకుకూరల లాంటివి మాత్రమే తింటాయి.
మొత్తానికి ఇటీవల కాలంలో విశాఖలోని ఇందిరాగాంధీ జూ పార్క్ లో వరుసగా పలు వన్య ప్రాణులు మృతి చెందుతూ ఉండడం, అయితే అవి సంపూర్ణ కాలం జీవించిన తర్వాత మాత్రమే మరణిస్తూ ఉన్నాయని అధికారులు చెబుతూ ఉండడం సాధారణ విషయంగా మారిపోయింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.