తాను చనిపోతూ నలుగురికి ప్రాణం పోసిన చిట్టితల్లి.. దైవదర్శనానికి వెళ్లి తనువు చాలించిన చిన్నారి
భార్య, భర్త పరిస్థితి విషమంగా ఉండగా చిన్నారి పల్లవి మాత్రం చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ అయ్యి మృతి చెందింది. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భార్య భర్తలకు కుమార్తె పల్లవి చనిపోయిందన్న మరణవార్త చెప్పారు వైద్యులు..
నిండు నూరేళ్లు ఆనందంగా గడపాల్సిన ఓ చిన్నారి అర్ధాంతంగా తనువు చాలించింది. తాను మరణిస్తూ మరో నలుగురికి ప్రాణదానం కూడా చేసి మానవత్వాన్ని చాటుకుంది. విజయనగరం జిల్లాలో చోటు చేసుకున్న హృదయవిదార ఘటన అందరినీ కలిచివేస్తుంది. విజయనగరం జిల్లా గంట్యాడ మండలం మురుపాకకు చెందిన గండి వెంకటరమణ దంపతులు కార్తీకమాసం సందర్భంగా గంట్యాడ మండలం డికె పర్తిలో నూతనంగా నిర్మించిన వెంకటేశ్వరస్వామి దైవదర్శనానికి వెళ్లారు. వారితో పాటు వారి పన్నెండేళ్ల కుమార్తె పల్లవి కూడా ఉంది. అలా వెళ్లిన ఆ కుటుంబం ఉదయాన్నే స్వామివారి దర్శనం చేసుకొని బైక్ పై తిరిగి వస్తుండగా మార్గ మధ్యలో సడన్ గా కుక్క అడ్డం వచ్చింది. దీంతో బైక్ పై ఉన్న భార్య, కుమార్తె పల్లవితో పాటు వెంకటరమణ పక్కనే ఉన్న లోయలో పడిపోయాడు. ఆ ప్రమాదంలో తీవ్ర గాయాలైన ముగ్గురిని స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. వెంటనే వైద్యులు ఆసుపత్రిలో మెరుగైన చికిత్స అందించారు.
అయితే భార్య, భర్త పరిస్థితి విషమంగా ఉండగా చిన్నారి పల్లవి మాత్రం చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ అయ్యి మృతి చెందింది. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భార్య భర్తలకు కుమార్తె పల్లవి చనిపోయిందన్న మరణవార్త చెప్పారు వైద్యులు. కుమార్తె మరణవార్త విన్న తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా పిలపించారు. ఓ వైపు తీవ్ర గాయాలతో కదల్లేని పరిస్థితిలో ఉన్న తల్లిదండ్రులు, మరోవైపు ప్రాణాలు విడిచిన చిన్నారి పరిస్థితి చూసిన బంధువులకు, అక్కడే ఉన్న ఆసుపత్రి సిబ్బందిని కలిచివేసింది.
అయితే తీవ్ర ఆవేదనకు లోనైన వైద్యులు వెంటనే తేరుకుని చిన్నారికి బ్రెయిన్ డెడ్ అయిందని, కానీ చిన్నారి అవయవాలు మాత్రం నలుగురి ప్రాణాలను కాపాడుతుందని గమనించి వెంటనే తల్లిదండ్రుల వద్దకు చేరుకున్నారు. వారిని కొంత ఓదార్చి, చిన్నారి అవయవాలను దానం చేయాలని అవగాహన కల్పించారు. దీంతో పుట్టెడు దుఃఖంలోనూ చిన్నారి పల్లవి అవయవదానానికి అంగీకరించారు తల్లిదండ్రులు. వెంటనే ఆసుపత్రి సిబ్బంది జీవన్ దాన్ సభ్యులకు సమాచారం ఇచ్చారు.
విషయం తెలుసుకున్న జీవన్ దాన్ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి చేరుకొని పల్లవి అవయవాలు సేకరించారు. అలా సేకరించిన కళ్లు, కిడ్నీ, లివర్, లంగ్స్ సేకరించి ప్రక్రియ ప్రకారం భద్రపరిచారు. అనంతరం జిల్లా ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో జిల్లా కలెక్టర్ అంబేద్కర్, జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పల్లవి అవయవాలను విశాఖ ఏర్పాటుకు తరలించేందుకు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు. ఆసుపత్రి వద్ద రెవెన్యూ, పోలీస్ సిబ్బంది సమన్వయంతో జీవన్ దాన్ సభ్యులకు సహకరించి అవయవాలను అంబులెన్స్ ద్వారా గ్రీన్ ఛానల్ లో విశాఖ ఎయిర్ పోర్ట్ కు తరలించారు. ఈ సందర్భంగా పల్లవి అవయవాలు వెళ్తుండగా పల్లవి అమర్ రహే అంటూ అక్కడున్న మెడికల్ సిబ్బంది, విద్యార్థులు పెద్ద నినాదాలు చేస్తూ తమ సంఘీభావం తెలిపారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి