తిరుపతి, అక్టోబర్ 23: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) దర్శించుకునేందుకు నిత్యం వేలాది భక్తులు తరలి వస్తుంటారు. లైన్లలో గంటల తరబడి వేచి ఉంచి స్వామివారిని దర్శించుకుని తమ దారిన తాము వెళ్తుంటారు. అయితే ఓ వ్యక్తి సులువుగా దర్శనం చేసుకోవడానికి తనను తాను ఐఆర్‌ఎస్ అధికారిగా చెప్పుకొచ్చాడు. అందుకు తగినట్లుగా నకిలీ గుర్తింపు పత్రాలు కూడా సిద్ధం చేసుకున్నాడు. అనంతరం వీఐపీ దర్శనం కోసం వీఐపీ బ్యాడ్జీలు తీసుకున్నాడు. అయితే నికిలీ అధికారి తీరుపై అనుమానం వచ్చిన అధికారులు సోదా చేయగా అసలు బండారం బయటపడింది. అనంతరం సదరు నకిలీ అధికారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన తిరుమల టూటౌన్ పోలీసులు అరెస్ట్ చేసి కటకటాల వెనుక వేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
నిందితుడిని విజయవాడలోని శ్రీనివాసనగర్ బ్యాంక్ కాలనీకి చెందిన వేదాంతం శ్రీనివాస్ భరత్ భూషణ్ (52)గా గుర్తించారు. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేసిన శ్రీనివాస్ తనను ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (ఐఆర్‌ఎస్) అధికారిగా చెప్పుకునేందుకు భారీగానే స్కెచ్ వేశాడు. పథకం అమలు చేయడానికి నకిలీ గుర్తింపు కార్డులు, విజిటింగ్ కార్డులు, ఆధార్ కార్డు కూడా సృష్టించాడు. అయితే పలుమార్లు టీటీడీకి వచ్చిన సదరు నకిలీ అధికారి కొన్నిసార్లు ఆదాయపు పన్ను శాఖ జాయింట్ కమీషనర్‌గా టీటీడీ అధికారులకు పరిచయం చేసుకునేవాడు. మరి కొన్నిసార్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అదనపు కమీషనర్‌గా చెప్పుకునేవాడు. దీంతో సదరు వ్యక్తిపై అనుమానం వచ్చిన టీటీడీ అధికారులు ముందుగా విజిలెన్స్, సెక్యూరిటీ విభాగాన్ని అప్రమత్తం చేశారు.
అనంతరం అతని వద్ద ఉన్న గుర్తింపు పత్రాలను పరిశీలించగా అవన్నీ ఫేక్ అని తేలిపోయింది. దీంతో శ్రీనివాస్ తమను మోసం చేస్తున్నాడని నిర్ధారించిన అధికారులు అరెస్ట్ చేశారు. టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ వింగ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు తిరుమల పోలీసులు నిందితుగు శ్రీనివాస్‌పై చీటింగ్, ఫోర్జరీ వంటి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ సంఘటన ఆదివారం (అక్టోబర్ 22)న జరిగింది. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తిరుమల పోలీసులు తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.