Vizianagaram: జిల్లాకు గుడ్ న్యూస్ వచ్చేసింది… మంత్రి కొండపల్లి కృషితో..
విజయనగరం జిల్లాలో మరో భారీ పరిశ్రమకు మార్గం సుగమమైంది. గుర్ల మండలం కెల్ల సమీపంలో గ్రీన్‌ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జిల్లాలో ఉద్యోగావకాశాలు పెంచేందుకు మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు చేసిన కృషి ఫలించినట్లు తెలుస్తోంది.

విజయనగరం జిల్లాలో మరో భారీ పరిశ్రమ రానుంది. అందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చింది. జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు గట్టి ప్రయత్నమే చేశారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు తక్కువగా ఉన్న తమ జిల్లాలో పెట్టేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబును పలుమార్లు కలిసి ఆయన్ను ఒప్పించినట్లు తెలుస్తుంది. ఇప్పటికే స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కోసం ప్రభుత్వం భూమిని కేటాయిస్తూ నిర్ణయం కూడా తీసుకుంది. పరిశ్రమ ఏర్పాటుపై వడివడిగా అడుగులు వేస్తుంది. గుర్ల మండలం కెల్ల సమీపంలో గ్రీన్‌ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ పరిశ్రమ ఏర్పాటుకు సూపర్ స్మెల్టర్స్ లిమిటెడ్ సంస్థ ముందుకు రావడంతో ప్రభుత్వం మొత్తం 1,085 ఎకరాల భూమిని కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ప్రాజెక్టు కోసం సంస్థ రూ. 8,570.50 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. ఏడాదికి 2 మిలియన్ టన్నుల స్టీల్ ఉత్పత్తి సామర్థ్యంతో ఈ యూనిట్ రెండు దశల్లో నిర్మాణం కానుంది. ప్లాంట్ ఏర్పాటు ద్వారా 750 మందికి ప్రత్యక్ష ఉపాధి లభించనుంది.
అదనంగా టౌన్‌షిప్ కోసం 97 ఎకరాలు, రైల్వే సైడింగ్ కోసం 53 ఎకరాలు కేటాయించనున్నారు. అందుకోసం జిల్లాలో విస్తీర్ణపరంగా పెద్ద మండలం అయినా, గుర్లలో ఈ పరిశ్రమ ఏర్పాటు చేయడానికి నిర్ణయించుకుంది. ఈ మండలంలో 47 పంచాయతీలు, 52 గ్రామాలు ఉన్నప్పటికీ స్థానికంగా పెద్దగా ఉద్యోగ, ఉపాధి లేక వేలాది మంది యువకులు విజయనగరం, విశాఖపట్టణం వెళ్లి చిన్నచితకా పనులు చేసుకొని జీవనం సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ పరిశ్రమ ఏర్పాటు ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తుంది. పరిశ్రమ ఏర్పాటుకు కావలసిన నీటి వనరులు కూడా ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. గడిగడ్డ రిజర్వాయర్, తారకరామ తీర్థసాగర్ ప్రాజెక్టులు కూడా ఇక్కడ ఉండటంతో పరిశ్రమకు సరిపడా నీరు ఇవ్వొచ్చన్న అంచనా వేస్తున్నారు. అయితే పరిశ్రమ ఏర్పాటు కోసం కావలసిన భూమిని ఎస్ఎస్ఆర్ పేట, సోలిపి, సోమరాజుపేట, మన్యపురిపేట, బెల్లానపేట, దమరసింగి గ్రామాల్లో భూముల సేకరణ చేసినట్లు తెలుస్తుంది. ఈ గ్రామాల్లోనే ప్రభుత్వం భూములను గుర్తించి రికార్డులను సిద్ధం చేశారు. ఎస్ఎస్ఆర్ పేట నుంచి కొండచుట్టు ప్రక్క ప్రాంతాల్లో భూములను సర్వే చేశారు. వాటిలో కెల్ల రెవెన్యూ పరిధిలో విస్తీర్ణం ఎక్కువగా ఉంది. స్టీల్ ప్లాంట్ కోసం కావలసిన మొత్తం 1,080 ఎకరాల సర్వే కూడా పూర్తయింది. కాబట్టి ఇక అనుమతులు క్లియర్ అయితే నిర్మాణం ప్రారంభానికి లైన్ క్లియర్ అయినట్లే.
ఈ ప్రాంతంలో స్టీల్ ప్లాంట్ నిర్మాణం పూర్తయితే ప్రత్యక్షంగా వెయ్యి మందికి, పరోక్షంగా మరో 4వేల మందికి ఉపాధి వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
